Begin typing your search above and press return to search.

మమత యాక్టివ్.. విజయ్ ఇన్, స్టాలిన్ ఔట్..!? జాతీయ రాజకీయాలు వెరీ ఇంట్రస్టింగ్

జాతీయ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధానంగా విపక్ష ఇండియా కూటమిలో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   25 May 2026 9:00 PM IST
మమత యాక్టివ్.. విజయ్ ఇన్, స్టాలిన్ ఔట్..!? జాతీయ రాజకీయాలు వెరీ ఇంట్రస్టింగ్
X

జాతీయ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధానంగా విపక్ష ఇండియా కూటమిలో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత జాతీయ స్థాయిలో బలమైన ముద్ర వేయాలని విపక్షాలు తహతహలాడుతున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమి మరింత ఐక్యంగా ఉండాలని అభిలషిస్తున్నారు. ఇప్పటివరకు ఇండియా కూటమి తరఫున పెద్దగా చొరవ చూపని మమతా బెనర్జీ ఇప్పుడు స్వయంగా కూటమి బలోపేతంపై మాట్లాడుతుండటం ఇంట్రెస్టింగ్ గా మారుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.

కేంద్రంలో అధికార బీజేపీని ఉమ్మడి శత్రువుగా భావిస్తూ 2024 సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు ఇండియా కూటమి ఆవిర్భవించిన విషయం తెలిసిందే. ఈ కూటమి ప్రారంభంలోనే జేడీయూ బయటకు వెళ్లి దెబ్బకొట్టింది. ఆ తర్వాత తృణమూల్, ఆప్ వంటి పార్టీలు కూటమి ఐక్యతకు గండి కొడుతూ వచ్చాయని అంటున్నారు. అయితే ఢిల్లీ, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు ఓటమితో ఇప్పుడు ఆలోచన మార్చుకుంటున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రధానంగా వెస్ట్ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమి మరింత బలపడాలని కోరుకుంటున్నారు. బీజేపీపై పోరాటానికి ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ విపక్ష నేతలు అంతా ఐక్యంగా పోరాడాలని మమత పిలుపునిస్తున్నారు. వచ్చేనెల మొదటి వారంలో ఇండియా కూటమి సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని మమత తాజాగా ప్రకటించారు. ఎన్నికల్లో పరాజయంతో మమత లో ఈ మార్పు వచ్చిందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఇండియా కూటమిలో ఉంటూనే కాంగ్రెస్ తో అంటీముట్టనట్లు మమత వ్యవహరించేవారని గుర్తుచేస్తున్నారు.

కాంగ్రెస్ ఆధిపత్యాన్ని నిరసిస్తూ మమత వ్యవహరించడం వల్ల ఇండియా కూటమిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యేవని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఇప్పుడు ఓటమితో బీజేపీని ఒంటరిగా ఢీకొట్టలేనన్న అంచనాకు వచ్చిన మమత, కాంగ్రెస్ పార్టీకి స్నేహ హస్తం చాస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదే సమయంలో తమిళనాడు రాజకీయాల్లో చోటుచేసుకున్న మార్పులతో ఇండియా కూటమితో ప్రధాన భాగస్వామి డీఎంకే తెగతెంపులు చేసుకున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

డీఎంకే ఔట్.. టీవీకే ఇన్..

తమిళనాడు ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీపై తీరును నిరసిస్తూ డీఎంకే పార్టీ ఇండియా కూటమి నుంచి బయటపడింది. పార్లమెంటులో తమను ప్రత్యేకంగా చూడాలని కోరుతూ ఆ పార్టీకి చెందిన ఎంపీ కనిమొళి కోరారు. దీంతో కాంగ్రెస్ పార్టీపై డీఎంకే ఆగ్రహం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదని అంటున్నారు. అయితే ఇదే సమయంలో తమిళనాడుకు చెందిన అధికార టీవీకే ఇండియా కూటమిలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. దీంతో డీఎంకే వెళ్లినా టీవీకే రూపంలో ఆ లోటు భర్తీ అయిందని కాంగ్రెస్ ధీమాగా ఉందని అంటున్నారు. మరోవైపు కేజ్రీవాల్ సైతం ఇండియా కూటమికి మరింత దగ్గరయ్యేలా సంకేతాలిస్తున్నారన్న వార్తలు ప్రచారం అవుతున్నాయి. దీంతో జాతీయ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయని చెబుతున్నారు.