కింగ్ మేకర్ టు కింగ్ : మూడేళ్ల వెయిటింగ్.. ఐదు దశాబ్దాల కల.. సీఎంగా డీకే
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత కీలకమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
By: Tupaki Political Desk | 28 May 2026 3:26 PM ISTకర్ణాటక రాజకీయాల్లో అత్యంత కీలకమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పేరును సిద్ధూ స్వయంగా ప్రకటించారు. 2023 ఎన్నికల్లో పార్టీని ఒంటిచేత్తో గెలిపించిన డీకే శివకుమార్ సీఎం కావాలని కలలు కన్నారు. కానీ, అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం సీనియార్టీకి ప్రాధాన్యమిచ్చింది. అయితే పార్టీని గెలిపించిన డీకేకు న్యాయం చేస్తామని అప్పట్లోనే హామీ ఇచ్చింది. సిద్దూ, డీకే మధ్య అధికారాన్ని పంచుతూ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. నాటి ఒప్పందం మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన బాధ్యతల నుంచి తప్పుకున్నారని చెబుతున్నారు.
డీకే విధేయత
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక కానున్న డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీ ఎప్పుడు కష్టకాలంలో ఉన్నా ముందుగా డీకే రంగంలోకి దిగుతారని చెబుతున్నారు. ఒక విధంగా కాంగ్రెస్ బాహుబలిగా కీర్తి గడించారు. గాందీ కుటుంబానికి నమ్మిన బంటుగా కొనసాగుతున్నారు. మెజార్టీ శాసనసభ్యులు మద్దతు ఉన్నప్పటికీ మూడేళ్ల క్రితం పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉండిపోయారు. ఈ మధ్య కాలంలో ఎన్నో ఆఫర్లు వచ్చినా, కాంగ్రెస్ పార్టీపై విధేయతతో గడప దాటలేదని పరిశీలకులు చెబుతున్నారు. డీకే విధేయతకు ఎట్టకేలకు కాంగ్రెస్ పట్టం కట్టిందని విశ్లేషిస్తున్నారు.
బలమైన ఆకాంక్ష
దశాబ్దాలుగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్న డీకే శివకుమార్ ఎప్పటికైనా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే బలమైన ఆకాంక్షతోనే పనిచేసినట్లు ఆయన గురించి తెలిసిన వారు చెబుతారు. ముఖ్యంగా 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఒంటిచేత్తో అధికారంలోకి తీసుకురావడంలో కేపీసీసీ అధ్యక్షుడిగా ఆయన వ్యూహాలు ప్రధాన పాత్ర పోషించాయని గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలోనే ఆయన సీఎం పదవి కోసం గట్టిగా పట్టుబట్టినా, కాంగ్రెస్ అధిష్టానం సూచనతో వెనక్కి తగ్గారు. తన ఆకాంక్ష నెరవేర్చుకోడానికి మూడేళ్లుగా ఎంతో ఓపికగా నిరీక్షిస్తూ వచ్చారని అంటున్నారు.
ట్రబుల్ షూటర్
కాంగ్రెస్ పార్టీలో డీకే శివకుమార్‌కు "ట్రబుల్ షూటర్"గా తిరుగులేని స్థానం ఉంది. పార్టీ ఎప్పుడు సంక్షోభంలో పడినా డీకే రంగంలోకి దిగుతారు. గతంలో గుజరాత్ రాజ్యసభ ఎన్నికల సమయంలో పార్టీ నేత అహ్మద్ పటేల్ గెలుపు కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కర్ణాటకకు తీసుకువచ్చి క్యాంపు నిర్వహించారు. ఆ విధంగా డీకే పేరు జాతీయ స్థాయిలో మారమోగిపోయింది. ఆ తర్వాత మహారాష్ట్రలో విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ప్రభుత్వం సంక్షోభంలో ఉన్నప్పుడు అక్కడి ఎమ్మెల్యేలను బెంగళూరు రిసార్ట్స్‌లో ఉంచి క్యాంప్ రాజకీయాన్ని విజయవంతంగా నడిపారు. గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడైన నాయకుడిగా కీర్తి గడించారు.
విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్
డీకే శివకుమార్ తన విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగమైన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ యూఐ) ద్వారా 1980ల్లో రాజకీయాల్లోకి వచ్చారు. అంటే దాదాపు 45 ఏళ్లుగా ఆయన కాంగ్రెస్ భావజాలంతోనే ప్రయాణిస్తున్నారు. 1985లో తొలిసారి సాతనూరు నియోజకవర్గం నుంచి జనతాదల్ నేత, మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడపై పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని శక్తిగా ఎదిగారు. ఇప్పటివరకు వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989 తర్వాత రాజకీయంగా వెనక్కి తిరిగి చూసుకోలేదని అంటారు.
వరుసగా 8 సార్లు ఎమ్మెల్యే
తొలుత సాతనూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన డీకే తర్వాత కనకపుర నియోజకవర్గానికి మారారు. 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా 4 సార్లు కనకపుర నుంచి గెలిచారు 1994లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి మళ్లీ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం కనకపుర నియోజకవర్గానికి మారారు. ఇప్పుడూ అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కనకపుర నుంచి 2008, 2013, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 4 సార్లు గెలిచారు. 2023 ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచి ఏకంగా 1.22 లక్షల పైచిలుకు ఓట్ల రికార్డు మెజార్టీతో విజయం సాధించడం గమనార్హం.
