Begin typing your search above and press return to search.

డోలాయమానంలో డీకేకు ఎమ్మెల్యే గిరీ.. ఆమె కాంగ్రెస్ సభ్యురాలే

అయినప్పటికీ ఆమెకు ఎమ్మెల్యే గిరీ దక్కడం అనుమానాస్పదమే అనేలా ఉన్నాయి పరిస్థితులు.

By:  Tupaki Desk   |   5 Sep 2023 1:37 PM GMT
డోలాయమానంలో డీకేకు ఎమ్మెల్యే గిరీ.. ఆమె కాంగ్రెస్ సభ్యురాలే
X

తెలంగాణ-ఏపీ సరిహద్దులో ఉన్న ఆ నియోజకవర్గ రాజకీయాలే వేరు. ఎత్తులు పైఎత్తులతో అంతుపట్టని విధంగా సాగే రాజకీయాలు అక్కడి ప్రత్యేకత. దశాబ్దాలుగా ఒకే కుటుంబం ఆధిపత్యంలో ఉన్న ఆ నియోజకవర్గంలో అప్పుడప్పుడు మాత్రమే బయటివారు ఎన్నికయ్యారు. ప్రస్తుతం వారి కుటుంబానికి దగ్గరి బంధువే ఎమ్మెల్యేగా ఉన్నారు. అనూహ్యంగానే అయినా అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఆయనపై.. ఓడిన మహిళా అభ్యర్థి, అత్త వరుస అయ్యే నాయకురాలు కేసు విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పునకు మద్దతుగా ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నుంచి ఆదేశాలు తీసుకొచ్చారు. అయినప్పటికీ ఆమెకు ఎమ్మెల్యే గిరీ దక్కడం అనుమానాస్పదమే అనేలా ఉన్నాయి పరిస్థితులు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల రాజకీయాలను దశాబ్దాలుగా ధర్మవరపు కొట్టం (డీకే) శాసిస్తోంది. డీకే సత్యారెడ్డి మూడుసార్లు, ఆయన పెద్ద కుమారుడు డీకే సమరసింహారెడ్డి రెండుసార్లు, చిన్న కుమారుడు భరత సింహా రెడ్డి ఒకసారి, భరతసింహారెడ్డి భార్య అరుణ మూడుసార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కృష్ణమోహన్‌రెడ్డి.. భరతసింహా రెడ్డికి మేనల్లుడే. ఈ లెక్కన 1957 నుంచి మొత్తమ్మీద 15 సార్లు ఎన్నికలు జరిగితే 10సార్లు వీరి కుటుంబమే విజయం సాధించింది.

భార్య, భర్త స్వతంత్రులుగా..

ఒక నియోజకవర్గంపై ఓ కుటుంబం ఈస్థాయిలో ఆధిపత్యం సాగించడమే విశేషం అంటే.. అందులోనూ భార్యాభర్తలు ఎమ్మెల్యేలుగా గెలవడం మరో విశేషం. వీరిద్దరూ స్వతంత్రులుగా నెగ్గడం ఇంకొక విశేషం. కాగా, డీకే భరతసింహారెడ్డి 1994లో గెలిచాక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన భార్య అరుణ 2004లో స్వతంత్రంగా, 2009, 2014లో కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. హ్యాట్రిక్ కొట్టిన ఆమెను 2018లో ఆడబిడ్డ కొడుకు క్రిష్ణమోహన్ రెడ్డి 28 వేల పైగా ఓట్లతో ఓడించి సంచలనం రేపారు. కాగా, తొలినుంచి కృష్ణమోహన్‌రెడ్డి మేనమామ వెంటే ఉంటూ వచ్చారు. టీడీపీ, కాంగ్రెస్ ఇలా భిన్న పార్టీల్లో మామ వెంటే నడిచారు. తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ లో చేరారు. 2014లో ఓడినా 2018లో ఘన విజయం సాధించారు. కాగా, ఈ ఓటమి అనంతరం డీకే అరుణ కాంగ్రెస్ ను వీడారు. బీజేపీలో చేరారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు కూడా అయ్యారు.

అఫిడవిట్ గొడవ

నామినేషన్‌ సందర్భంగా కృష్ణమోహన్‌రెడ్డి తప్పుడు వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేసినట్లు డీకే అరుణ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇందులో కీలక అంశం ఏమంటే.. కృష్ణమోహన్‌రెడ్డి గతంలో అమ్మిన ఆస్తులను పేర్కొనలేదని. కానీ, అమ్మేసిన వాటి గురించి ప్రస్తావించడం ఎందుకని తాము భావించినట్లు కృష్ణమోహన్‌రెడ్డి వర్గం చెబుతోంది. మొత్తానికి కేసుపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇచ్చింది. అంతేగాక అరుణను గద్వాల ఎమ్మెల్యేగా ప్రకటించింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తీరుపై అనుమానాలున్న డీకే అరుణ తన ఎన్నికను ప్రకటిస్తూ గెజిట్‌ జారీ చేయాలంటూ వ్యూహాత్మకంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. దీనిపై సీఈసీ అండర్‌ సెక్రటరీ సంజయ్‌ కుమార్‌ సోమవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌కు ఉత్తర్వులు (గెజిట్) పంపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శులకు కూడా ఆయన ఉత్తర్వులు జారీచేశారు. ఈ గెజిట్‌ జారీ చేసేందుకు ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం కసరత్తు చేపట్టింది. వాస్తవానికి కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చాక కేంద్ర ఎన్నికల సంఘం డీకే అరుణ ఎన్నికను ధ్రువీకరిస్తూ నోటిఫికేషన్‌ జారీచేసింది. దానికి హైకోర్టు తీర్పు కాపీని సైతం జత చేశారు. 2018 డిసెంబరు 12 నుంచి ఆమెను ఎమ్మెల్యేగా పరిగణించాలని న్యాయస్థానం ఆ తీర్పులో పేర్కొన్న అంశాన్నీ కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

బీఆర్ఎస్ సర్కారు చాన్సిస్తుందా?

ఇప్పటికే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విషయంలో బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలింది. వాస్తవానికి వనమా గెలిచింది కాంగ్రెస్ నుంచి. ఆయన చేతిలో ఓడింది బీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావు. కాగా, తన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వనమా సుప్రీం కోర్టుకు వెళ్లి ఉపశమనం పొందారు. ఇక్కడ వనమా, జలగం ఇద్దరిలో ఎవరు ఎమ్మెల్యే అయినా బీఆర్ఎస్ కు ఇబ్బంది లేదు. కానీ కృష్ణమోహన్‌రెడ్డి అనర్హుడి మారి అరుణ ఎమ్మెల్యే అయితే బీఆర్ఎస్ కు ఒక సీటు తగ్గినట్లే. దీంతోనే సర్కారు.. హైకోర్టు తీర్పును అమలు చేయకుండా జాప్యం చేస్తున్నదనే ప్రచారం ఉంది.

కొసమెరుపు: సీఈసీ ఆదేశాలు అందుకున్న తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం.. మంగళవారం డీకే అరుణ ఎన్నికపై గెజిట్ జారీ చేస్తుందనే వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పటివరకు ఆ మేరకు ఆదేశాలు రాలేదు. ఈ రాత్రి లోపు వస్తాయేమో చూడాలి. మరి అప్పుడు అరుణ సాంకేతికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అవుతారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉన్న సంగతి తెలిసిందే.