Begin typing your search above and press return to search.

డీకే అరుణ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ఉత్తర్వులు

గద్వాల అసెంబ్లీ నియోజవర్గ ఎమ్మెల్యేగా డీకే అరుణ ఎన్నికైనట్లుగా ప్రచురించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

By:  Tupaki Desk   |   4 Sep 2023 1:37 PM GMT
డీకే అరుణ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం  సంచలన ఉత్తర్వులు
X

గద్వాల అసెంబ్లీ నియోజవర్గ ఎమ్మెల్యేగా డీకే అరుణ ఎన్నికైనట్లుగా ప్రచురించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసింది. గద్వాల ఎమ్మెల్యేగా 2018లో ఎన్నికైన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి ఎన్నిక చెల్లదని.. ఆయన ఎన్నికల నామినేషన్‌ సందర్భంగా తప్పుడు అఫిడవిట్‌ ను సమర్పించారని తెలంగాణ హైకోర్టు ఇటీవల ఆయనను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులను తదుపరి గెజిట్‌లో ప్రచురించాలని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు తీర్పు కాపీని జత చేస్తూ.. సీఈవోకు ఈసీ అండర్‌ సెక్రెటరీ సంజయ్‌ కుమార్‌ లేఖ రాశారు.

ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా గద్వాల ఎమ్మెల్యేగా ఎన్నికైన కృష్ణమోహన్‌ రెడ్డి నామినేషన్‌ సందర్భంగా తప్పుడు వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేసినందుకు శిక్షగా హైకోర్టు రూ.2.50 లక్షలు జరిమానా విధించింది. ఖర్చుల కింద పిటిషనర్‌ డీకే అరుణకు రూ.50 వేలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

అంతేకాకుండా కృష్ణమోహన్‌ రెడ్డి తరువాత అత్యధిక ఓట్లు సాధించిన అరుణను 2018 డిసెంబరు 12 నుంచి ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. నాటి ఎన్నికల్లో గద్వాల నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కృష్ణమోహన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ తరఫున డీకే అరుణ పోటీ చేసిన సంగతి తెలిసిందే. కృష్ణమోహన్‌ రెడ్డికి 1,00,057, అరుణకు 71,612 ఓట్లు వచ్చాయి.

కాగా డీకే అరుణ 1999లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గద్వాలలో ఓడిపోయారు. 2004లో కాంగ్రెస్‌ సీటు దక్కకపోవడంతో సమాజవాదీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ వెంటనే కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2009, 2014లోనూ గద్వాల నుంచే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగానూ పనిచేశారు. 2018 ఎన్నికల్లో డీకే అరుణ ఓడిపోయారు.

కాగా తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో 25 మందికి పైగా అనర్హత పిటిషన్లలో విచారణను ఎదుర్కొంటున్నారు. ప్రజాప్రతినిధుల అనర్హత కేసులన్నింటినీ ఆగస్టు నెలాఖారులోగా తేల్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే హైకోర్టు వరుసగా తీర్పులు వెలువరిస్తోంది.

ఇప్పటికే మంత్రులు.. కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్‌ తో పాటు పాతిక ఎమ్మెల్యేలు ఇలా అనర్హత వేటు కేసులు ఎదుర్కొంటున్నారు. ఇందులో 90 శాతం పైగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు.

అనర్హత కేసులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లో... తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, దేవరకొండ ఎమ్మెల్యే ఆర్‌ రవీంద్రకుమార్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌లతో పాటు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డి, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్, నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్, కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే పద్మారావు, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, వరంగల్‌ ఈస్ట్‌ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌ రావు, వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్, పటాన్‌ చెరువు ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఉన్నారు.