సోనియాగాంధీ విషయంలో అదే జరిగింది.. డీకే సంచలన వ్యాఖ్యలు..
చివరిసారి శాసన సభ ఎన్నికల్లో అధిక సీట్లు సాధించిన కాంగ్రెస్ సిద్ధరామయ్యను సీఎం చేసింది. డీకే శివకుమార్ కు డిప్యూటీ సీఎం ఇచ్చింది.
By: Tupaki Desk | 4 Aug 2025 7:00 PM ISTకర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గురించి పరిచయం అవసరం లేదు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఆయన చేసిన కృషి, చూపిన తెగువ మామూలుది కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదురొడ్డి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చారు. కేవలం ఆయన విసిరిన పాచికల వల్లే నేడు కర్ణాటక కాంగ్రెస్ హస్తంలో ఉందన్న వాదనలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. సాధారణ కార్యకర్త నుంచి మొదలైన డీకే జీవితం అంచెలంచెలుగా ఎదిగింది. పార్టీ ముఖ్య నాయకుల సమావేశాలు ఏర్పాటు చేయడం. వాటిని నిర్వహించడం లాంటివి చేస్తూ పార్టీ అధినాయకురాలు సోనియాగాంధీ చూపులో పడ్డారు డీకే శివకుమార్. కన్నడనాట సిద్ధరామయ్యకు మంచి గుర్తింపు ఉంది. ఆయన చాలా సార్లు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. చివరి సారి సైతం 2023లో కాంగ్రెస్ గెలిచింది. ఈ గెలుపు నేపథ్యంలో పార్టీ ఎవరికి సీఎం పదవి ఇస్తుందోనని అంతా ఆశగా ఎదురు చూశారు. ఆ సమయంలోనే డీకే శివకుమార్ పేరు బాగా వినిపించింది.
పార్టీని పదవిలోకి తెచ్చింది అతనే..!
చివరిసారి శాసన సభ ఎన్నికల్లో అధిక సీట్లు సాధించిన కాంగ్రెస్ సిద్ధరామయ్యను సీఎం చేసింది. డీకే శివకుమార్ కు డిప్యూటీ సీఎం ఇచ్చింది. అప్పటి నుంచి చాలా సందర్భాల్లో డీకే సీఎం కాబోతున్నారంటూ పుకార్లు రావడం ప్రారంభమైంది. సిద్ధ రామయ్య, పార్టీ పెద్దలు సైతం ఇది కేవలం పుకార్లు మాత్రమేనని తానే సీఎం అంటూ చెప్పుకస్తున్నారు. అయితే.. కొన్నాళ్లు సీఎం సిద్ధరామయ్య, ఆ తర్వాత డీకే అన్నట్లుగా పార్టీలో అంతర్గతంగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఎప్పుడు ఈ చర్చ వచ్చినా పార్టీ తొక్కిపెడుతూ వచ్చింది. ఇటీవల మళ్లీ ఇదే ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జర్నలిస్టులు డీకేను సీఎం మార్పు విషయంలో స్పందించాలంటూ కోరారు. దీనికి ఆయన స్పందించారు.
డీకే వ్యంగ్యస్త్రాలు..
పదవి అనుభవించిన వారికంటే త్యాగం చేసిన వారికే ఎక్కువ గౌరవం ఉంటుందని ఆయన వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు సిద్ధ రామయ్యను ఉద్దేశిస్తూ అన్నట్లు చర్చ జరుగుతోంది. ఇది చెప్పిన ఆయన సోనియా గాంధీ త్యాగం గురించి మాట్లాడారు. 2004లో సోనియా గాంధీ అతిపెద్ద త్యాగం చేసిందని, తనకు అధికారం ముఖ్యం కాదని ప్రధాని పదవిని సైతం వదులుకుందని చెప్పుకచ్చారు. కానీ ఇప్పటికీ చిన్న చిన్న పదవులను కూడా వదులుకునేందుకు కొందరు ఇష్టపడడం లేదని.. కనీసం అధికారంను పంచుకునేందుకు సైతం ఇష్టపడడం లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు నేరుగా సిద్ధ రామయ్యను ఉద్దేశించనవేనని కర్ణాటకకు మొత్తం అవగతమే.
డీకే వ్యాఖ్యలతో కన్నడనాట జోరుగా చర్చ..
డీకే శివకుమార్ నర్మగర్భంగా మాట్లాడడం కన్నడనాట చర్చకు దారి తీసింది. సీఎం పదవి గురించే డీకే మాట్లాడారని తెలుస్తోంది. పదవి పంపకం గురించి మొదలే పార్టీలో చర్చ జరిగిందా..? సిద్ధ రామయ్య పదవిని వదులుకునేందుకు ఎందుకు ఇష్టపడడం లేదు.. దాదాపు రెండేళ్లు పూర్తయిన తర్వాత ఈ టాపిక్ రావడంపై కొంత చర్చ నడుస్తోంది.
