''నేను రాయల్ ఛాలెంజ్ కూడా తాగను.. RCB ఎందుకు కొంటాను?" డీసీఎం కామెడీ
ఇటీవలి కాలంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు అమ్మకానికి ఉందని, దీని విలువ సుమారు $2 బిలియన్లు ఉంటుందని ఊహాగానాలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి.
By: Tupaki Desk | 12 Jun 2025 12:05 PM ISTఇటీవలి కాలంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు అమ్మకానికి ఉందని, దీని విలువ సుమారు $2 బిలియన్లు ఉంటుందని ఊహాగానాలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఈ క్రమంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దృష్టికి ఈ విషయం వెళ్ళింది.
ఈ ప్రతిష్టాత్మక క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయాలనే ఆసక్తి ఆయనకు ఉందా అని విలేకరులు ప్రశ్నించగా.., డీకే శివకుమార్ చేసిన సరదా వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తనదైన శైలిలో హాస్యాన్ని పండిస్తూ, ఆయన ఇలా బదులిచ్చారు. "నేను పిచ్చివాడిని కాను. చిన్నప్పటి నుంచి కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సభ్యుడిగా ఉన్నాను అంతే. నాకు ఈ విధమైన సమయం లేదు. యాజమాన్యంలో భాగస్వామ్యంగా ఉండాలని చాలా సార్లు ఆఫర్లు వచ్చాయి. కానీ నాకు ఆ అవసరం లేదు. RCB ఎందుకు కొనాలి? నేను రాయల్ ఛాలెంజ్ కూడా త్రాగను!" అని పేర్కొన్నారు.
డీకే శివకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు ముఖ్యంగా "రాయల్ ఛాలెంజ్ కూడా త్రాగను… RCB ఎందుకు?" అనే చమత్కారం నెటిజన్లకు విపరీతమైన వినోదాన్ని పంచుతోంది. ఎప్పుడూ సరదాగా, స్పష్టంగా మాట్లాడే డీకే శివకుమార్ మరోసారి తన హాస్య చతురతను ప్రదర్శించారు.
ఈ వ్యాఖ్యలతో పాటు " ఆర్సీబీని కొనే వార్తలన్నీ అవాస్తవాలు, నేను ఇలాంటి ఆలోచనలు చేయడం లేదు" అని కూడా ఆయన స్పష్టం చేశారు. దీంతో RCB అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన ఊహాగానాలకు ప్రస్తుతానికి బ్రేక్ పడినట్లైంది. డీకే శివకుమార్ వ్యాఖ్యలు క్రికెట్ అభిమానులను, రాజకీయ వర్గాలను ఒకేసారి ఆకట్టుకున్నాయి.
