లగ్జరీ సీఎం డీకే..!! చంద్రబాబు రికార్డూ బ్రేక్, మూడో ప్లేసులో దళపతి
కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 3న డీకే కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
By: Tupaki Political Desk | 1 Jun 2026 6:00 PM ISTకర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 3న డీకే కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సమయంలో డీకే లగ్జరీ లైఫ్ స్టైల్ పై సోషల్ మీడియాతోపాటు, పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ డిబేట్ నడుస్తోంది. రాజకీయాల్లో తనదైన వ్యూహాలతో ‘ట్రబుల్ షూటర్’గా పేరొందిన డీకే స్టైల్ మెయింటెన్ చేయడంలోనూ కింగే అనిపించుకుంటున్నారు. ఆయన వాడే బ్రాండ్స్, వాటి ధరలు చూస్తే సామాన్యులకే కాదు, సెలబ్రిటీలకు సైతం మైండ్ బ్లాక్ అవుతోందని అంటున్నారు.
మెడలోని స్కార్ఫ్ ధర రూ. లక్ష!
కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఏ పబ్లిక్ మీటింగ్‌కు వచ్చినా, ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడినా ఆయన మెడలో ఒక స్కార్ఫ్ ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. అయితే అది ఏదో సాదాసీదా స్కార్ఫ్ అనుకుంటే పొరపాటే. అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్ అయిన ‘లూయిస్ విట్టన్’ కశ్మీర్ కలెక్షన్‌కు చెందిన ఆ స్కార్ఫ్ ధర అక్షరాల రూ. 1 లక్ష పైమాటేనని అంటున్నారు. ఇక ఆయన లైఫ్‌స్టైల్‌లో స్కార్ఫ్ మాత్రమే కాదు.. చేతికి పెట్టుకునే వాచీలు కూడా నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. డీకే శివకుమార్ కలెక్షన్‌లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన లగ్జరీ వాచీలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ధరిస్తున్న ‘కార్టియర్ శాంటోస్’ వాచ్ ధర సుమారు రూ. 50 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. అదేవిధంగా ప్రత్యేక సందర్భాల్లో ఆయన పెట్టుకునే ‘రోలెక్స్ కాస్మోగ్రాఫ్’ వాచ్ ధర దాదాపు రూ. 1 కోటి వరకూ ఉంటుందని సమాచారం.
‘డీకే’ మోనోగ్రామ్ షర్టులు
డీకే శివకుమార్ ధరించే వైట్ కుర్తాలు, షర్టులు కూడా సాదాసీదావి కావు అని చెబుతున్నారు. ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి కుట్టించుకునే ఈ దుస్తుల కఫ్‌లు లేదా ఛాతీ భాగంపై ‘dk’ అనే అక్షరాలు చిన్నగా ఎంబ్రాయిడరీ చేసి ఉంటాయని అంటున్నారు. ఈ పర్సనల్ మోనోగ్రామ్ స్టైల్ ఆయన బ్రాండ్‌ను మరింత ఎలివేట్ చేస్తోందని చెబుతున్నారు. ఇక కేవలం లూయిస్ విట్టన్ మాత్రమే కాదు.. గూచీ, ఫెర్రాగామో, బర్‌బెర్రీ, ఫెండీ వంటి ప్రపంచ ప్రసిద్ధ బ్రాండ్ల క్యాష్మీర్ స్కార్ఫ్‌లను కూడా ఆయన వాడుతుంటారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, అత్యంత స్టైలిష్ పొలిటీషియన్‌గా పేరొందిన ఎస్.ఎమ్. కృష్ణ లగ్జరీ స్టైల్ చూసే డీకే కూడా ఈ బ్రాండెడ్ లైఫ్‌స్టైల్‌కు ఇన్స్పైర్ అయ్యారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
దేశంలోనే అత్యంత ధనిక సీఎం!
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) గణాంకాల ప్రకారం.. డీకే శివకుమార్‌కు రూ. 1,400 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. ఈ భారీ ఆస్తులతో ఆయన దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించబోతున్నారు. డీకే శివకుమార్ తన ఆస్తులతో అత్యంత ధనిక సీఎంగా తొలి స్థానం ఆక్రమిస్తుండగా, ఇప్పటివరకు ధనిక ముఖ్యమంత్రిగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు రెండో స్థానానికి దిగిపోతున్నారు. ఇప్పటివరకు రూ. 931 కోట్ల ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు ఉండేవారు. ఇక రాజకీయాల్లోకి వచ్చిన తొలి ప్రయత్నంలోనే సీఎం పీఠాన్ని దక్కించుకున్న కోలీవుడ్ స్టార్ విజయ్.. రూ. 648 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు.
