కర్ణాటకలో కాంగ్రెస్ 2.0 సర్కార్.. పూర్తయిన డీకే పట్టాభిషేకం!
కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
By: Tupaki Political Desk | 3 Jun 2026 5:42 PM ISTకర్ణాటక రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియం సాక్షిగా, జనసందోహం మధ్య ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో మూడేళ్ల అనంతరం కాంగ్రెస్ 2.0 సర్కార్ పాలన ప్రారంభం అయిందని వ్యాఖ్యానిస్తున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలలో గెలిచి అధికారంలోకి వచ్చింది. అప్పట్లో సీనియర్ నేతలు, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారు. అధికార పంపిణీలో భాగంగా ఇద్దరి మధ్య రాజీ కుదర్చి ఇద్దరూ ముఖ్యమంత్రి పదవిని సమానంగా పంచుకోవాలని అధిష్టానం సూచించింది. దీంతో గత నెలలో సిద్దరామయ్య రాజీనామా చేయగా, ఆయన స్థానంలో డీకే శివకుమార్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు.
13 మంది కొత్త మంత్రులు
ఇక కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తోపాటు మరో 13 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గత ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా పనిచేసిన పరమేశ్వరకు ఉపముఖ్యమంత్రిగా ప్రమోట్ చేశారు. అదేవిధంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు మరోసారి మంత్రి చాన్స్ దక్కింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొడుకు, ఎమ్మెల్సీ యతీంద్ర కూడా మంత్రిగా ప్రమాణం చేశారు. గత ప్రభుత్వంలో మొత్తం 24 మంది మంత్రులు ఉండగా, ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రస్తుతానికి 13 మందితోనే ప్రమాణం చేశారు. అధిష్టానంతో చర్చల అనంతరం మరో విడత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, సీఎం, సుఖ్విందర్ సింగ్ సుఖు, వీడీ సతీషన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తల కోలాహలం మధ్య ఆధ్యాత్మిక వేత్తల ఆశీస్సులు తీసుకుని డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. చేతిలో చిన్న రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని వేలాది మంది అభిమానుల సాక్షిగా ప్రమాణం చేశారు. డీకేఎస్ వేదికపైకి రాగానే స్టేడియం మొత్తం ‘డీకే.. డీకే..’ అంటూ మార్మోగిపోయింది. రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ముగ్గురూ చేతులు పైకెత్తి ప్రజలకు అభివాదం చేసిన దృశ్యం ఈ వేడుకకే హైలైట్‌గా నిలిచింది.
దశాబ్దాల కల
కర్ణాటకలో దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్న డీకే శివకుమార్ ఎప్పటికైనా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష ఎట్టకేలకు నెరవేర్చుకున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఒంటిచేత్తో అధికారంలోకి తీసుకువచ్చిన డీకే.. ముఖ్యమంత్రి పదవిపై తనదే అన్న ధీమా వ్యక్తం చేశారు. అయితే అధిష్టానం మాత్రం సీనియర్ నేతగా ముందు సిద్దరామయ్యకు అవకాశం ఇచ్చింది. అయినప్పటికీ ఎప్పటికైనా తానే సీఎం అన్న ఆశతోనే డీకే కాలం గడిపారు. ఎట్టకేలకు ఆయన నిరీక్షణ ఫలించింది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ చాకచక్యంగా అధికార బదిలీ పూర్తి చేసి డీకేను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొబెట్టిందని అంటున్నారు.
