Begin typing your search above and press return to search.

కర్ణాటక హైడ్రామాకు తెర..కర్ణాటక పీఠంపై డీకే, 3న ముహూర్తం

డీకే సారథ్యంలోని కొత్త ప్రభుత్వంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండే అవకాశం ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   30 May 2026 8:12 PM IST
కర్ణాటక హైడ్రామాకు తెర..కర్ణాటక పీఠంపై డీకే, 3న ముహూర్తం
X

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఆయనతోపాటు మరో ఇద్దరు నేతలు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. శనివారం బెంగళూరులో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఇందులో కొత్త సీఎల్పీ నేతగా డీకే పేరును సీఎం సిద్ధరామయ్య ప్రతిపాదించగా, మరో సీనియర్ నేత పరమేశ్వర బలపరిచారు. దీంతో శాసనసభ్యులు అంతా డీకే పేరును ఏకగ్రీవంగా ఆమోదించారు.

సీఎల్పీ నేతగా డీకే ఏకగ్రీవంగా ఎన్నికవడంతో ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేసేందుకు లైన్ క్లియర్ అయింది. జూన్ 3న డీకే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామా తర్వాత కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై పార్టీలో ఏకాభిప్రాయం నెలకొనడంపై కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భిన్నాభిప్రాయాలకు తావు లేకుండా డీకేఎస్ ఎంపిక ప్రక్రియ పూర్తి కావడంపై అధిష్టానం కూడా ఊపిరి పీల్చుకుందని అంటున్నారు.

3న ప్రమాణ స్వీకారం

సీఎల్పీ నేతగా ఎన్నికైన డీకే శివకుమార్ గవర్నర్ థాపర్ చంద్ర గెహ్లోత్ ను కలిసేందుకు సమయం కోరారు. గవర్నర్ తో భేటీలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గవర్నర్ ఆహ్వానంతో డీకే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమే అంటున్నారు. ఈ నెల 3న ముఖ్యమంత్రిగా ప్రమాణానికి ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఈ వేడుక అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఇద్దరు డిప్యూటీ సీఎంలు

డీకే సారథ్యంలోని కొత్త ప్రభుత్వంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండే అవకాశం ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం డీకే ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చూస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడంతోపాటు అపధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వర్గాన్ని సంతృప్తిపరచడానికి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయంచినట్లు చెబుతున్నారు. తన కుమారుడు యతీంధ్రను మంత్రిగా నియమించాలని సిద్ధూ కోరారని ప్రచారం జరుగుతోంది. యతీంధ్రకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.