Begin typing your search above and press return to search.

తరచూ ఫ్లైట్ జర్నీలా? డిజి యాత్ర యాప్ వాడాల్సిందే

ఇంతకు డిజియాత్ర యాప్ ను ఎలా వాడాలన్న సందేహం రావొచ్చు. దీనికి సమాధానం చాలా సింపుల్ అని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   12 April 2024 6:03 AM GMT
తరచూ ఫ్లైట్ జర్నీలా? డిజి యాత్ర యాప్ వాడాల్సిందే
X

మీరు విమాన ప్రయాణాలు తరచూ చేస్తుంటారా? తరచూ కాకున్నా అప్పుడప్పుడు కూడా చేస్తుంటారా? అయితే.. మీరు మీ ఫోన్ లో డిజియాత్ర యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారా? అలా చేసుకోకపోతే వెంటనే ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి. దీంతో.. మీ ప్రయాణం మరింత సులువు కావటమే కాదు.. అనవసరమైన ఆలస్యాన్ని.. రద్దీగా ఉండే ఎయిర్ పోర్టుల్లో ఇబ్బంది పడకుండా ఉండే వీలుంది. తెలుగు రాష్ట్రాల్లో మొన్నటివరకు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో మాత్రమే డిజియాత్ర సేవలు అందుబాటులో ఉండగా తాజాగా విశాఖ పట్నంతో పాటు మరో 13 ఎయిర్ పోర్టుల్లో ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ నెలాఖరులో ఈ సేవలు ఆయా ఎయిర్ పోర్టుల్లో అందుబాటులోకి రానున్నాయి.

త్వరలో డిజియాత్ర సేవలు అందుబాటులోకి వచ్చే విమానాశ్రయాలు చూస్తే..

- విశాఖపట్నం

- చెన్నై

- కోయంబత్తూరు

- శ్రీనగర్

- త్రివేండ్రం

- బాగ్ డోగ్రా

- భువనేశ్వర్

- చండీగఢ్

- డబోలిమ్

- ఇండోర్

- మంగళూర్

- పట్నా

- రాయ్ పూర్

- రాంచీ

ఇంతకూ ఈ డిజి యాత్ర అంటే ఏమిటి? దీని సేవలు ఏ విధంగా ఉపయోగపడతాయి? ఇంతకూ ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకున్న తర్వాతేం చేయాలి? లాంటి సందేహాలు వస్తాయి. వీటికి సమాధానాలు వెతికితే.. ఈ డిజి యాప్ తో ప్రయోజనం ఏమంటే.. మనం ఎయిర్ పోర్టుల్లో ఎంట్రీ అయ్యే ముందుకు భద్రతా సిబ్బందికి మన టికెట్.. మన ఆధార్ కార్డు చూపించి.. వారు పరిశీలించిన తర్వాత లోపలకు వెళ్లాల్సి ఉంటుంది. రద్దీ వేళల్లో ఈ ప్రాసెస్ లేటు అవుతుంది. అయితే.. ఈ డిజీ యాత్రలో టికెట్ ను లోడ్ చేసుకుంటే.. అక్కడ ఉండే స్కానర్ల వద్దకు వెళ్లినంతనే.. ముఖాన్ని గుర్తించి వెంటనే గేట్లు ఓపెన్ అవుతాయి. అంతేకాదు.. మరికొన్ని ఎయిర్ పోర్టుల్లో రెండు అంచెల తనిఖీ వ్యవస్థ ఉంటుంది. అలాంటి చోట్ల కూడా ఈ యాప్ తో సులువుగా క్యూ బారి నుంచి తప్పించుకోవచ్చు.

ఇంతకు డిజియాత్ర యాప్ ను ఎలా వాడాలన్న సందేహం రావొచ్చు. దీనికి సమాధానం చాలా సింపుల్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఈ డిజియాత్ర యాప్ లో 50లక్షల మంది వినియోగిస్తున్నారు. అంతర్జాతీయ ప్రయాణికులకు సైతం ఈ సేవల్ని కల్పించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. డిజియాత్ర యాప్ లో నమోదు చేసే వ్యక్తిగత డేటాకు సంబంధించిన గోప్యతపై పలు సందేహాల్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని స్పస్టం చేస్తున్నారు. డేటా మొత్తం సెల్ ఫోన్ లో మాత్రమే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు దీని రూపకర్తలు.

ఇక.. డిజియాత్ర యాప్ ను ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత.. మన వివరాల్ని అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మనం ఎప్పుడైనా విమాన ప్రయాణానికి సంబంధించిన టికెట్ బుక్ చేసుకుంటే.. ఆ తర్వాత ఆ వివరాల్ని అందులో నమోదు చేసుకోవాలి. మన జర్నీ టికెట్ (బోర్డింగ్ పాస్)ను ఈ డిజియాత్ర యాప్ లో స్కాన్ చేస్తే.. ఎయిర్ పోర్టుకు చేరతాయి. ప్రయాణికులు ఎయిర్ పోర్టు ఈ గేట్ వద్దకు వచ్చి.. బార్ కోడ్ కలిగిన బోర్డింగ్ పాస్ ను స్కాన్ చేస్తే.. ముఖాన్ని గుర్తించటం ద్వారా వెంటనే ఓకే చేస్తుంది. దీంతో.. ఈ గేట్ ద్వారా ఎయిర్ పోర్టులోకి ప్రవేశించొచ్చు. డిజియాత్ర ఫౌండేషన్ లో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో పాటు హైదరాబాద్.. కోచి.. బెంగళూరు.. ఢిల్లీ.. ముంబయి విమానాశ్రయాల నిర్వాహణ సంస్థలు కూడా సభ్యులుగా ఉంటున్నారు. ఏమైనా.. ఈ డిజియాత్ర ద్వారా మన ప్రయాణాన్ని మరింత సులభతరం చేసుకోవచ్చని చెప్పక తప్పదు.