పే సీఎం నుంచి బాకీ కార్డు వరకు.. రాజకీయ వ్యూహాల్లో కొత్త పదాలు.. సరికొత్త నినాదాలు
రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒకప్పుడు భావోద్వేగం, ఆత్మాభిమానం, ప్రాంతీయాభిమానం ఇలా ఏదో ఒక అంశమే రాజకీయ వ్యూహంగా ఉండేది.
By: Tupaki Political Desk | 30 Sept 2025 7:00 PM ISTరాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒకప్పుడు భావోద్వేగం, ఆత్మాభిమానం, ప్రాంతీయాభిమానం ఇలా ఏదో ఒక అంశమే రాజకీయ వ్యూహంగా ఉండేది. కులాలు, మతాలు, వర్గాలు ఇలా చాలా లెక్కలు తీసివేతలు ఉండేవి. అయితే ఇప్పుడు కాలం మారింది. అంతా ఆధునిక యుగం.. డిజిటల్ ప్రపంచం.. భావోద్వేగం పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఆత్మాభిమానం అన్న ఊసు సరిగా వినిపించడం లేదు. ఇల కుల, మత లెక్కలు సరేసరి.. ఇక భారీ సభలు.. పెద్దపెద్ద రోడ్ షోలకు జనం వెల్లువలా వస్తున్నారు. కానీ, వాటి ప్రభావం ఎన్నికల ఫలితాలపై పెద్దగా చూపడం లేదు. కోట్లాదిగా వస్తున్న జనం ఎవరికి ఓట్లు వేస్తున్నారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో పార్టీలు రాజకీయ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. పెద్ద పెద్ద సభలు కన్నా, ప్రజలను ఆకట్టుకునే పొందికైన పదునైన పదాలను ఎన్నికల అస్త్రాలుగా వాడుకుంటున్నాయి.
ఇప్పుడు అంతా డిజిటల్ ప్రపంచం.. జనం తమ సమయాన్ని ఎక్కువగా సెల్ ఫోన్లతోనే గడుపుతున్నారు. ఎక్కడికి వెళ్లినా.. ఎటు చూసినా చేతిలో ఫోన్ పట్టుకుని వినోదాన్ని అనుభవిస్తున్న వారే... ఇక రాజకీయ నాయకుల విమర్శలు, ఆరోపణలపై చర్చించేందుకు ఎవరూ సమయం కేటాయించడం లేదు. దీంతో డిజిటల్ వీక్షకులను తమ పార్టీ అభిమానులుగా మార్చుకోడానికి పార్టీలు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. తమ రాజకీయ విమర్శలకు డిజిటల్ పదాలు జోడిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసిన ఈ సరికొత్త ఎన్నికల వ్యూహాన్ని ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నాయి. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పే సీఎం అంటూ అప్పటి బీజేపీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అదే సమయంలో ‘గ్యారెంటీ’ హామీలతో సానుకూల నినాదాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి సక్సెస్ అయింది.
కర్ణాటకలో కాంగ్రెస్ సాధించిన విజయం ఇతర రాజకీయ పార్టీలను ఆకర్షించింది. తాజాగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ‘బాకీ కార్డు’ అనే కొత్త నినాదం అందుకుంది. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీ హామీలు అమలు చేయలేదని చెప్పడానికి బీఆర్ఎస్ ఎంచుకున్న నినాదమే ‘బాకీ కార్డు’. తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడం లేదని, ప్రజలకు బాకీ పడిందని బీఆర్ఎస్ చెప్పాలని అనుకుంటోంది. అయితే దీనికి ఆ పార్టీ ఎంచుకున్న పదం చాలా ఆకర్షణీయంగా ఉందని అంటున్నారు.
ఇదంతా కాంగ్రెస్ తీసుకువచ్చిన సరికొత్త ఎన్నికల వ్యూహమే అంటున్నారు పరిశీలకులు. కర్ణాటక ఎన్నికల్లో మొదలుపెట్టిన ఈ సరికొత్త వ్యూహాన్ని ప్రతిపార్టీ అనుసరిస్తోంది. బీజేపీ కూడా ‘మోదీ కా గ్యారెంటీ’ అన్న ప్రచారం ఎంచుకుంది. ఇక ఏపీ ఎన్నికల్లో కూడా ఈ సరికొత్త రాజకీయ విమర్శలు చాలా ఆసక్తి రేపాయి. ప్రధానంగా టీడీపీ యువనేత లోకేశ్ తీసుకువచ్చిన ‘రెడ్ బుక్’ థీమ్ ఆ పార్టీ కార్యకర్తలను ఏకం చేసింది. అప్పటి అధికార పార్టీపై తిరుగుబాటుకు బాగా పనికొచ్చిందని అంటున్నారు. లోకేశ్ ‘రెడ్ బుక్’ ఎఫెక్ట్ ప్రస్తుత ప్రతిపక్షం వైసీపీపై చాలానే పడిందని అంటున్నారు. అందుకే ఎన్నికల్లో ఓడిన తర్వాత ఈ ఏడాదిన్నర కాలంలో వైసీపీ అధినేత అనేక పుస్తకాలను రాస్తామని ప్రకటనలు చేశారు. ఇక చివరికి డిజిటల్ బుక్ తీసుకువచ్చారు.
కర్ణాటకలో పేసీఎం నినాదంతో బంపర్ విక్టరీ సాధించిన కాంగ్రెస్.. ఇప్పుడు బిహార్ ఎన్నికలలో ‘ఓట్ చోర్’ అన్న మరో పదాన్ని ప్రయోగిస్తోంది. తాము ఏం చెప్పాలని అనుకుంటున్నామో ఒక్క మాటలో ప్రజలకు అర్థమయ్యేలా చేప్పడమే ఈ సరికొత్త పదాల ప్రయోగంగా పరిశీలకులు చెబుతున్నారు. ప్రతి ఎన్నికకు ఈ నినాదాలు మారడం.. ప్రజలు కూడా ఎక్కువగా ఇలాంటి డిజిటల్ క్యాంపెయిన్లకే ఆకర్షితులు అవుతుండటంతో పార్టీలు పోటాపోటీగా పొలిటికల్ ఫైట్ కోసం సరికొత్త పదాలు అన్వేషిస్తున్నారు.
