Begin typing your search above and press return to search.

పెళ్లి వేడుకపై కొత్త ఆలోచనలు వచ్చేలా చేసే వైరల్ వీడియో

లక్షలాది రూపాయిలు ఖర్చు చేసి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవటం ఇప్పుడు ఫ్యాషన్ గా మారింది.

By:  Tupaki Desk   |   8 Jun 2024 7:30 AM GMT
పెళ్లి వేడుకపై కొత్త ఆలోచనలు వచ్చేలా చేసే వైరల్ వీడియో
X

లక్షలాది రూపాయిలు ఖర్చు చేసి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవటం ఇప్పుడు ఫ్యాషన్ గా మారింది. కల్యాణ మండపాల కోసమే లక్షలు తగలపెట్టేయకపోతే ఎలా? అన్నట్లు మారింది. ఇంట్లో పెళ్లి వేడుక ముగిసేసరికి చెత్త రూపంలో ప్లాస్టిక్ కుప్ప పెద్ద ఎత్తున ఏర్పడటం కామన్ అయ్యింది. అయితే.. తమ పెళ్లిలో ప్లాస్టిక్ అన్నదే కనిపించకుండా చేయాలన్న ఒక జంట అనుకున్నది సాధించింది. కాస్తంత కష్టమే అయినప్పటికీ కుదరకపోవటం ఏమీ ఉండదన్న విషయాన్ని స్పష్టం చేసింది. జీరో వేస్టుతో తమ వివాహ వేడుకను చేసుకోవాలని భావించిన బెంగళూరు జంట.. అందుకు తగ్గట్లే పెళ్లిని పూర్తి చేసింది. ఈ సందర్భంగా తమ పెళ్లి వేడుకను నేచురల్ వస్తువులతో ఎలా చేసుకున్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా ఒక చిట్టి వీడియోలో చూపించేశారు.

ఆడంబరంగా చేయాలనుకోవటం మామూలే. అందుకు భిన్నంగా జీరో వేస్టేజ్ తో పెళ్లి చేసుకోవటం ఎంత కష్టమన్న విషయం ఆ వీడియోను చూస్తే అర్థమవుతుంది. దీన్ని చూసినోళ్లు పలువురు.. జీరో వేస్టేజ్ తో పెళ్లి చేసుకోవటం కోసం మీరు పడిన శ్రమ కనిపిస్తోందన్న వ్యాఖ్యలు చేశారు. ఆలంకరణ మొదలు భోజనాలు వడ్డించే వరకు అన్ని చోట్ల ఎక్కడా ప్లాస్టిక్ అన్నది వాడకుండా వేడుకను పూర్తి చేశారు.

చెరుకుగడలతో మండపాన్ని.. కొబ్బరి ఆకులతో ఆలంకరణ చేపట్టి..వివిధ రకాల పూలు.. అరిటాకుల్లో భోజనాలు.. పూలమాలల్లోనూ ప్లాస్టిక్ పువ్వులు వాడకుండా.. సహజమైన పువ్వులు.. వాటిని కట్టేందుకు సైతం పత్తి దారాల్ని వాడటం ద్వారా చాలా కేర్ ఫుల్ గా వస్తువుల్ని ఎంపిక చేసుకోవటం కనిపిస్తుంది. ఈ పెళ్లి కుమార్తె డాక్టర్ గా పని చేస్తున్నారు. ఆమె తన ప్రయత్నాన్ని చిట్టి వీడియోగా మార్చి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. లక్షల మంది ఈ వీడియోను చూసి అభినందిస్తున్నారు. తమకు కొత్త ఐడియాలు వచ్చేలా చేశారని పేర్కొంటున్నారు. తమ పెళ్లిని జీరో వేస్టుగా నిపుణులు పరిగణిస్తారో లేదో తనకు తెలీదని.. కాకుంటే ప్లాస్టిక్ మాత్రం ఎక్కడా వాడకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఏమైనా ఈ వీడియో చూశాక సహజసిద్ధమైన వస్తువులతో పెళ్లి వేడుకను చేయటంపై కొత్త ఆలోచనలు రావటం ఖాయమని చెప్పక తప్పదు.