Begin typing your search above and press return to search.

ఇదో వెరైటీ క్రైం లవ్ స్టోరీ.. ఆ లేడీ ఆఫీసర్ కలెక్టరేట్ లో అతడ్ని కత్తితో పొడిచింది

ఆత్మకూరు (ఎం) మండల వ్యవసాయ అధికారిణిగా శిల్ప 2018 నుంచి పని చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   11 Nov 2023 4:22 AM GMT
ఇదో వెరైటీ క్రైం లవ్ స్టోరీ.. ఆ లేడీ ఆఫీసర్ కలెక్టరేట్ లో అతడ్ని కత్తితో పొడిచింది
X

రోటీన్ కు భిన్నమైన లవ్ స్టోరీలోకి క్రైం ఎంటరై.. వార్తగా మారింది. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం అక్కడి వారిని అవాక్కు అయ్యేలా చేయటమే కాదు హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా అమ్మాయిపై అబ్బాయి దాడి చేయటం.. తీవ్రంగా గాయపర్చటం లాంటివి చేస్తుంటారు. ఇక్కడ సీన్ రివర్సు. లేడీ ఆఫీసర్.. మరో ఉద్యోగిపై కత్తితో పొడిచిన వైనం కలకలాన్ని రేపింది. యాదాద్రి కలెక్టరేట్ లో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల నడుమ జరిగిన దాడి వైనంలో మరో ప్రత్యేకత ఉంది. అదేమంటే.. తన కింది ఉద్యోగిపై అధికారిణి కత్తితో దాడి చేసి.. గాయపర్చటం. దీనంతటికి కారణం ప్రేమకథే కారణమంటున్నారు. అసలేం జరిగిందంటే..

ఆత్మకూరు (ఎం) మండల వ్యవసాయ అధికారిణిగా శిల్ప 2018 నుంచి పని చేస్తున్నారు. అదే మండలంలోని పల్లెపహాడ్ వ్యవసాయ విస్తరణాధికారిగా మనోజ్ విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరి మధ్య రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఇదిలా ఉండగా.. సదరు లేడీ అధికారిణికి గతంలోనే మరో వ్యక్తితో పెళ్లైంది. వారికి రెండున్నరేళ్ల బాబు కూడా ఉన్నాడు. శిల్పతో ప్రేమ వ్యవహారం మనోజ్ తల్లిదండ్రులకు తెలియటం.. వారు అతడ్ని మందలించారు. దీంతో ఆమెకు దూరంగా ఉంటున్నాడు.

ఈ క్రమంలో మూడు నెలల క్రితం డిప్యూటేషన్ మీద వేరే ప్రాంతానికి వెళ్లిపోయాడు. అనంతరం సెలవు పెట్టేశాడు. తిరిగి విధుల్లోకి జాయిన్ అయ్యేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కు శుక్రవారం వచ్చాడు. అదే సమయంలో అతడు శిల్పకు తారసపడ్డాడు. దీంతో ఆమె మనోజ్ తో మాట్లాడే ప్రయత్నం చేశారు. కాసేపటికే వీరి మధ్య మాటలు కాస్తా ఘర్షణ పడటం.. కత్తితో మనోజ్ పై శిల్ప దాడి చేయటం జరిగిపోయింది. మెడ మీద.. వీపు మీద రెండు పోట్లు పొడవటంతో మనోజ్ గాయపడటం.. రక్తం కారటం మొదలైంది. దీంతో అక్కడి వారు కలుగజేసుకొని.. అతడ్ని ఆసుపత్రికి పంపారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు శిల్పను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. మనోజ్ తో తాను రిలేషన్ తో ఉన్నానని.. 2022 జూన్ లో తామిద్దరం సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్లుగా శిల్ప చెబుతున్నారు. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి తనతో ఉండాలని మనోజ్ ఒత్తిడి చేశాడని.. బాబును కూడా తీసుకొస్తానంటే చంపేస్తానని బెదిరించినట్లుగా చెప్పుకొచ్చారు. మూడు నెలల నుంచి తనను దూరంగా పెట్టి పట్టించుకోవటం లేదన్న ఆమె.. కలెక్టరేట్ లో తనపై దాడికి ప్రయత్నించగా.. తాను ఆత్మరక్షణ కోసం ఎదురుదాడి చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దాడి ఘటనలో కీలకమైన కత్తిని ఎవరు తెచ్చారు? ఎక్కడి నుంచి ఆ కత్తి వచ్చింది? ఎవరు మొదట దాడికి పాల్పడ్డారు? లాంటి అంశాలపై పోలీసులు విచారణ మొదలు పెట్టారు.