Begin typing your search above and press return to search.

వైరల్ వీడియో... ఆ పక్షులు భూకంపాన్ని పసిగట్టాయి?

ఈ సందర్భంగా అక్కడ పక్షులకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   2 Jan 2024 9:59 AM GMT
వైరల్  వీడియో... ఆ పక్షులు భూకంపాన్ని పసిగట్టాయి?
X

ప్రకృతిలో జరిగే పలు విషయాలు, సంభవించే పలు ప్రమాదాలు మనిషి కంటే ముందుగా జంతువులు, పక్షులు పసిగడతాయని అంటుంటారు. వాటికి ఆ సక్తి ఉంటుందని చెబుతుంటారు. కొన్ని సంఘటనలు చూస్తే.. ఆ విషయం అక్షరాలా నిజం అనిపించకమానదు. తాజాగా జపాన్ లో 24 గంటల వ్యవధిలో సుమారు 150కంటే ఎక్కువసార్లు భూమి కంపించిందని చెబుతున్నారు. ఈ సందర్భంగా అక్కడ పక్షులకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

అవును... జపాన్ లో భూకంపం అల్లకల్లోలం సృష్టించిన నేపథ్యంలో మనుషులకు మించి ప్రకృతిని అర్ధం చేసుకునే శక్తి పక్షులకే ఉంటుందా అనే ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది. దీనికి మెజారిటీ ప్రజానికం నుంచి అవుననే సమాధానమే వస్తుందని అంటున్నారు. కారణం... ప్రకృతి వైపరీత్యాలను ప్రధానంగా కుక్కలు, కాకులు వంటివి ముందుగానే గుర్తిస్తుంటాయని చెబుతుండటమే.

ఉదాహరణకు... సునామీ, భూకంపం లాంటి ప్రకృతి విపత్తులు సంభవించడానికి కొన్ని క్షణాల ముందు వేలాది కాకులు వింతగా ప్రవర్తించడం, కుక్కలు విచిత్రంగా శబ్ధాలు చేస్తూ భయాందోళనలు వ్యక్తపరచే ప్రయత్నం చేయడం వంటివి అని చెబుతుంటారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటుంటాయి.

ఈ క్రమంలో తాజాగా జపాన్‌ లో 2024 నూతన సంవత్సరం తొలిరోజే శక్తివంతమైన భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్‌ పై 7.6 తీవ్రతో ఈ భూకంపం నమోదైనట్లు జపాన్‌ వాతావరణ సంస్థ వెల్లడించింది. ఈ ఘటనల్లో కనీసం 13 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో... మరోసారి భూప్రకంపనలు సంభవించే అవకాశం, సునామీ వచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

అయితే ఈ భూకంపానికి కొన్ని నిముషాల ముందు వేలాది పక్షలు ఒకచోట చేరి విచిత్రంగా ప్రవర్తించాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ వీడియోలో వేలాది పక్షులు బిల్డింగులు, చెట్లు ఉన్న చోట కాకుండా.. వీలైనంత ఖాళీ స్థలం ఉన్నచోట చేరాయి. దీంతో... ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు... ఆ పక్షులు మనిషికి ఏవో చెప్పాలనుకున్నాయి.. కానీ, అది అర్ధంచేసుకునే పరిస్థితిలో మనిషి లేడంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా... గతంలో జపాన్‌ లోని క్యోటో నగరంలోనూ, కొన్నాళ్ల క్రితం క్రితం టర్కీలో సంభవించిన విధ్వంసకర భూకంపానికి కొద్ది క్షణాల ముందు కూడా పక్షులు ఇలా అసాధారణంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. దీంతో... పక్షులు అలా ప్రవర్తించడానికి కారణం రానున్న ప్రకృతి విపత్తును, ప్రధానంగా భూకంపాన్ని పసిగట్టడమేనని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం!!