Begin typing your search above and press return to search.

మోడీ అబద్ధాలు చెప్పారా ?

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ మూడింటిని ఇపుడు మోడీ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఆచరిస్తోంది.

By:  Tupaki Desk   |   16 Aug 2023 6:14 AM GMT
మోడీ అబద్ధాలు చెప్పారా ?
X

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోదీ ప్రసంగంలో ఆత్మవిశ్వాసం కనిపించింది. అందుకనే రాబోయే ఆగస్టు 15వ తేదీన కూడా ఎర్రకోటలో తానే ప్రసంగిస్తానని చెప్పారు. ఎర్రకోట నుంచి ప్రసంగించటం అంటే ప్రధానమంత్రిగా ఉండటమే కదా. మళ్ళీ అధికారంలోకి వచ్చే విషయంలో మోడీకి నమ్మకం ఉండచ్చు, మోడీ లెక్కలు మోడీకి ఉండచ్చు. అయితే ఆ సందర్భంగా చెప్పిన అనేక విషయాల్లో కీలకమైనవి అవినీతి, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలను అంతచేస్తామని చెప్పటం.

ఈ మూడింటిని ప్రజాస్వామ్యానికి, సమాజానికి పట్టిన చీడ పురుగులుగా మోడీ అభివర్ణించారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ మూడింటిని ఇపుడు మోడీ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఆచరిస్తోంది. అవినీతి అంటే డైరెక్టుగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో నిధులను స్వాహా చేయటమే కానక్కర్లేదు. వేల కోట్ల రూపాయాల ప్రజాధనాన్ని బ్యాంకుల నుండి దోపిడీ చేసిన వాళ్ళని రక్షించటం కూడా అవినీతిని ప్రోత్సహించటమే. బ్యాంకుల నుండి వేల కోట్ల రూపాయలు దోచుకున్న పారిశ్రామికవేత్తలు దేశం వదిలి వెళ్ళిపోవటానికి సహకరించటమూ అవినీతే.

నీరవ్ మోడీ, విజయమాల్య, మొహుల్ చోక్సీ లాంటి ఎంతోమంది పారిశ్రామికవేత్తల ముసుగుల్లో వేల కోట్ల రూపాయలు దోచేసుకున్నారు. ఎవరిపైనా ఇంతవరకు చర్యలు లేవు. అలాగే వేల కోట్లరూపాయలు అప్పులు తీసుకుని చెల్లించకపోతే రానిబాకీల ముసుగులో వాటిని రద్దుచేయటం కూడా అవినీతికి కిందకే వస్తుంది. గడచిన తొమ్మిదేళ్ళల్లో మోడీ ప్రభుత్వం రద్దుచేసిన రానిబాకీలు సుమారు రు. 11 లక్షల కోట్లు.

ఇక వారసత్వ రాజకీయాల గురించి చెప్పింది కూడా అబద్ధమే. ఎందుకంటే ఎన్డీయే పార్టనర్స్ లోని చాలాపార్టీల అధినేతలు వారసత్వంగా ఉన్నవారే. నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత కోన్రాడ్ సంగ్మా, అప్నాదళ్ అనుప్రియాపటేల్, జన నాయక్ జనతాపార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా, లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ లాంటి వాళ్ళంతా వారసులుగా వచ్చిన వాళ్ళే. అసలు క్రికెట్ బోర్డు అధ్యక్షుడు జై షా కు ఆ పదవి కేవలం అమిత్ షా వల్లే వచ్చింది. వారసత్వ రాజకీయాలు చేస్తు దానికి వ్యతిరేకమని మోడీ చెబితే ఎవరు నమ్ముతారు ?