Begin typing your search above and press return to search.

2700 కోట్ల 'బ్రదర్స్ స్కామ్' దేశాన్ని షాక్‌కు గురి చేసిన బ్రదర్స్ మోసం

రాజస్థాన్‌కు చెందిన అన్నదమ్ములు సుభాష్ బిజారాణి, రణ్వీర్ బిజారాణి 'నెక్సా ఎవర్ గ్రీన్' అనే నకిలీ కంపెనీతో ఏకంగా రూ. 2,676 కోట్లను ప్రజల నుంచి దోచుకున్నారు.

By:  Tupaki Desk   |   16 Jun 2025 3:00 PM IST
2700 కోట్ల బ్రదర్స్ స్కామ్  దేశాన్ని షాక్‌కు గురి చేసిన బ్రదర్స్ మోసం
X

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌కు చెందిన అన్నదమ్ములు సుభాష్ బిజారాణి, రణ్వీర్ బిజారాణి 'నెక్సా ఎవర్ గ్రీన్' అనే నకిలీ కంపెనీతో ఏకంగా రూ. 2,676 కోట్లను ప్రజల నుంచి దోచుకున్నారు. సుమారు 70,000 మందిని మోసగించిన ఈ 'బ్రదర్స్ స్కామ్' దేశాన్ని షాక్‌కు గురిచేసింది. గుజరాత్‌లోని ప్రతిష్టాత్మక ధోలేరా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పేరును వాడుకుని, భారీ లాభాల ఆశచూపి ప్రజలను నిండా ముంచేశారు.

- మోసం వెనుక మాయాజాలం

ఈ మోసం కథ 2014లో మొదలైంది. రణ్వీర్ ‘ధోలేరా’లో కొంత భూమిని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత 2021లో ఆర్మీ నుంచి రిటైరైన సుభాష్ తన సోదరుడితో కలిసి అహ్మదాబాద్‌లో 'నెక్సా ఎవర్ గ్రీన్' కంపెనీని రిజిస్టర్ చేశాడు. తాము ధోలేరా స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగమని, 1,300 బీగాల భూమిపై ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మించనున్నట్లు విస్తృతంగా ప్రచారం చేశారు. పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు, లెవెల్ ఇన్‌కమ్, కమీషన్లు, అలాగే కార్లు, బైక్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటి బహుమతులు ఇస్తామని ఆశ చూపారు.ఈ ప్రచారానికి ఆకర్షితులై దేశవ్యాప్తంగా వేలాదిమంది అమాయకులు తమ కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టారు. ఇలా దాదాపు 70,000 మందికి పైగా వినియోగదారుల నుంచి రూ. 2,676 కోట్లను ఈ అన్నదమ్ములు సేకరించారు. ఆశ్చర్యకరంగా సేకరించిన మొత్తంలో రూ. 1,500 కోట్లకు పైగా డబ్బును తమకు పనిచేసిన ఏజెంట్లకు కమీషన్లుగా చెల్లించారు.

-మోసపు సొమ్ముతో విలాసవంతమైన జీవనం

ప్రజలను మోసం చేసి సంపాదించిన డబ్బుతో బిజారాణి సోదరులు విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఖరీదైన కార్లు, గనులు, హోటళ్లు, అహ్మదాబాద్‌లో ఫ్లాట్లు, గోవాలో 25 రిసార్టులు కొనుగోలు చేశారు. దాదాపు రూ. 250 కోట్లు నగదుగా తమవద్ద ఉంచుకుని మిగిలిన మొత్తాన్ని 27 నకిలీ కంపెనీల ద్వారా విదేశాలకు తరలించారు. మోసం బయటపడటంతో నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

-ఈడీ రంగప్రవేశం, దర్యాప్తు ముమ్మరం

ఈ మోసంపై పలు ఫిర్యాదులు అందడంతో జోధ్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కోణం ఉందని అనుమానించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. జూన్ 12న రాజస్థాన్, గుజరాత్‌లోని 25 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి, కీలకమైన ఆధారాలను స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

-అసలు 'ధోలేరా స్మార్ట్ సిటీ' ప్రాజెక్ట్ ఏమిటి?

నిందితులు మోసానికి ఉపయోగించుకున్న 'ధోలేరా స్మార్ట్ సిటీ' అనేది వాస్తవానికి కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాల ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. ఇది భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా గుర్తింపు పొందింది. 920 చ.కి.మీ. విస్తీర్ణంలో, ఢిల్లీ కంటే రెట్టింపు పరిమాణంలో అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాజెక్టులో అంతర్జాతీయ విమానాశ్రయం, బహుళజాతి కంపెనీలు ఏర్పాటు కానున్నాయి. 2042 నాటికి ఇది పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోనుంది. ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పేరును వాడుకుని నిందితులు ఇంత భారీ మోసానికి పాల్పడటం గమనార్హం.

ఈ భారీ స్కామ్ దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజల నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ప్రభుత్వ ప్రాజెక్టుల పేరుతో ఇలాంటి మోసాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను ఈ ఘటన తెలియజేస్తుంది. ఈ దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.