Begin typing your search above and press return to search.

అసలేంటి ధర్మస్థల హత్యల వివాదం?

కర్ణాటకలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ధర్మస్థల, ఇప్పుడు సంచలనాత్మక ఆరోపణలతో వార్తల్లో నిలిచింది.

By:  Tupaki Desk   |   25 July 2025 3:00 PM IST
అసలేంటి ధర్మస్థల హత్యల వివాదం?
X

కర్ణాటకలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ధర్మస్థల, ఇప్పుడు సంచలనాత్మక ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. ఒక మాజీ పారిశుధ్య కార్మికుడు చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆరోపణల తీవ్రత, పోలీసుల స్పందన, సిట్ ఏర్పాటు, గతంలో జరిగిన ఘటనలు.. ఈ అంశాలన్నీ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి.

ధర్మస్థల ఆలయంలో గతంలో పనిచేసిన ఓ పారిశుధ్య కార్మికుడు, ఆలయ అధికారుల ఒత్తిడితో దాదాపు 100కి పైగా మృతదేహాలను రహస్యంగా ఖననం చేశానని ఆరోపించాడు. వాటిలో లైంగిక దాడులకు గురైన మహిళలు, మైనర్లు ఉన్నారని, అలాగే 400 మందికి పైగా యువతులు అదృశ్యమయ్యారని పేర్కొన్నాడు. ఈ దారుణాలకు ప్రభావవంతమైన స్థానిక నేతలు, ఆలయ యాజమాన్యం బాధ్యులని అభిప్రాయపడ్డాడు. ఈ ఆరోపణలు శ్రీ వీరేంద్ర హెగ్గడే వంటి కీలక వ్యక్తులపైనా ప్రభావం చూపాయి. అయితే, ఇప్పటివరకు భౌతిక ఆధారాలు లేకపోవడం విచారణను సంక్లిష్టం చేస్తోంది.

-పోలీసుల స్పందనపై విమర్శలు

పారిశుధ్య కార్మికుడు జూలై 4న ఫిర్యాదు చేసినా, పోలీసులు జూలై 11 వరకు ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. తవ్వకాలకు సిద్ధంగా ఉన్నానని కార్మికుడు చెప్పినప్పటికీ, పోలీసులు అతడిని గుర్తించలేకపోవడం ఆలస్యానికి కారణమైంది. ఇది స్థానిక రాజకీయ ఒత్తిడులు, ఆలయ యాజమాన్యపు ప్రభావం లేదా అధికారుల నిర్లక్ష్యమా అనే అనుమానాలకు దారితీసింది.

-సిట్ ఏర్పాటు.. పురోగతి లేకపోవడమే సమస్య

ఈ వివాదంపై కర్ణాటక ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రణవ్ మోహంతి నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేసింది. అయితే, దర్యాప్తులో ఎటువంటి గణనీయమైన పురోగతి కనిపించకపోవడం ప్రజల్లో విశ్వాసం కోల్పోవడానికి దారితీస్తోంది. పైగా, సిట్ అధికారికి వ్యతిరేకంగా కొందరు న్యాయవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేయడం మరింత అనుమానాలకు తావిచ్చింది.

- గతం వెనుక మరొక బాధితురాలి కథ

ఈ వివాదానికి కొత్త ఊపునిస్తూ 22 ఏళ్ల క్రితం అదృశ్యమైన 'సౌజన్య' అనే యువతి కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆమె తల్లి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తన కుమార్తె అదృశ్యంపై పూర్తిస్థాయి దర్యాప్తు కావాలని కోరింది. ఇప్పుడు వెలుగులోకి వస్తున్న ఆరోపణలు తమ కుటుంబం అనుభవించిన బాధను గుర్తు చేస్తున్నాయని ఆమె పేర్కొనడం, పారిశుధ్య కార్మికుడి ఆరోపణలకు బలాన్ని చేకూర్చింది.

- ప్రజలు కోరేది.. పారదర్శక దర్యాప్తు మాత్రమే

ఇలాంటి నాజూకు అంశాల్లో మతపరమైన ఆస్తిక భావాలు, స్థానిక రాజకీయ ఒత్తిడులు అడ్డుకుంటే నిజం వెలుగు చూడదు. కాబట్టి తక్షణమే తవ్వకాలు ప్రారంభించాలి. సాక్షులకు రక్షణ కల్పించాలి.సిట్ విచారణను వేగవంతం చేయాలి.పారదర్శక నివేదికలు ప్రజలకు అందించాలి.అధికారుల పాత్రపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది.

ధర్మస్థల కేసు, దేశంలోని మతస్థలాల పట్ల ఉన్న గౌరవాన్ని సవాల్ చేస్తూ, న్యాయ వ్యవస్థ పారదర్శకతను పరీక్షించే అంశంగా మారింది. ఆధ్యాత్మికత కప్పిపుచ్చిన చీకటి నిజాలు వెలుగులోకి రావాలంటే, ప్రభుత్వం ధైర్యంగా ముందుకు రావాలి. లేదంటే, ఇది కేవలం మరో మూతపడ్డ కేసుగానే మిగిలిపోతుంది.