Begin typing your search above and press return to search.

'దుస్తులు లేకుండా మహిళల మృతదేహాలు'.. అసలు ధర్మస్థల కేసు ఏమిటి?

కర్నాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థల.. ఇప్పుడు అత్యంత భయంకర ఆరోపణలతో కలకలం రేపుతోంది.

By:  Tupaki Desk   |   22 July 2025 4:20 PM IST
దుస్తులు లేకుండా మహిళల మృతదేహాలు.. అసలు ధర్మస్థల కేసు ఏమిటి?
X

కర్నాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థల.. ఇప్పుడు అత్యంత భయంకర ఆరోపణలతో కలకలం రేపుతోంది. ఈ పవిత్ర ప్రదేశంలో రెండు దశాబ్దాలుగా వందలాది మంది హత్యకు గురయ్యారని, లైంగిక వేధింపులు జరిగాయని ఓ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఫిర్యాదు ఒక్కసారిగా దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ నేపథ్యంలో.. అసలు ఏమిటీ కేసు, ఇంతకాలం ఏం జరిగిందనేది ఇప్పుడు చూద్దామ్...!

అవును... 'ధర్మస్థలలో వందలాది మంది హత్యకు గురయ్యారు.. ఆ మహిళల మృతదేహాలు చాలా వరకు లోదుస్తులు కూడా లేకుండా ఉన్నాయి.. చాలామంది బాలికల మృతదేహాలు స్కూల్ యూనిఫామ్ లో ఉన్నాయి. ఆ మృతదేహాలపై లైంగిక దాడి, హింసకు సంబంధించిన గాయాలున్నాయి.. వాటిని నేనే పూడ్చిపెట్టాను!'.. అనే మాటలు ఒక్కసారిగా దేశం మొత్తాన్ని ఉలిక్కిపాటుకు గురి చేశాయి.

మంజునాథ ఆలయంలో 1995 నుంచి 2014 మధ్య పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి జులై 3న దక్షిణ కన్నడ జిల్లా పోలీసులకు ఈ భయంకరమైన ఫిర్యాదు చేశాడు. తన 20 ఏళ్ల సర్వీసులో వందలాది శవాలను తానే స్వయంగా ఖననం చేశానని, ఈ శవాల్లో ఎక్కువగా మహిళలు, యువతులతో పాటు స్కూల్ యూనిఫామ్ లలో మైనర్ బాలికలు ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

తనకు ఇష్టం లేకపోయినా, బలవంతంగా ఈ పని చేయించారని.. నోరు విప్పితే చంపేస్తామని బెదిరించారని అతడు పోలీసులకు చెప్పాడు. నేత్రావతి నదీ తీరంతో పాటు ఆలయం సమీపంలోని అడవుల్లో ఈ శవాలను ఖననం చేశానని.. మరికొన్ని కొన్ని సందర్భాల్లో శవాలను నదిలోకి విసిరేసినట్లు వెల్లడించాడు. ఈ సందర్భంగా తన ఉద్యోగానికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించాడు.

వాస్తవానికి 1998లోనే ఈ విషయంపై ఓసారి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పుడు తనను దారుణంగా కొట్టారని తెలిపాడు. దీంతో.. అప్పటి నుంచి నోరు మెదపలేదని అన్నారు. ఈ క్రమంలో 2014లో తన కుటుంబంలో ఒక బాలికపై జరిగిన లైంగిక దాడి తనను తీవ్రంగా కలచివేయడంతో.. ధర్మస్థల వదిలేసి పొరుగు రాష్ట్రానికి పారిపోయి.. దశాబ్దం తర్వాత, అపరాధ భావంతో తిరిగి వచ్చినట్టు వెల్లడించారు.

ఈ క్రమంలో... 1995 నుంచి 2014 వరకు సుమారు 20 ఏళ్ల కాలంలో 100 నుంచి 300 హత్యలు జరిగాయని కార్మికుడు ఆరోపించాడు. ఈ ఆరోపణలతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన పోలీసులు... కేసు నమోదు చేశారు. దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. వెంటనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసింది.

మరోవైపు.. 20 ఏళ్లలో రాష్ట్రంలో నమోదైన మిస్సింగ్ కేసులు, అసహజ మరణాలపై నివేదిక కోరారు కర్ణాటక స్టేట్ విమెన్స్ కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి. ఇదే సమయంలో... సిట్ దర్యాప్తును జడ్జి పర్యవేక్షణలో నిర్వహించాలని రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి గోపాల గౌడ డిమాండ్ చేశారు. ఏదిఏమైనా... ఈ కేసు దర్యాప్తు వీలైనంత త్వరగా పూర్తవ్వాలని.. దీని వెనుక ఉన్నవారిని బయటకు తేవాలని ప్రజలు కోరుతున్నారు.