Begin typing your search above and press return to search.

రేవంత్ కంటే కేసీఆర్ బెట‌ర్‌.. : బీజేపీ పైర్ బ్రాండ్ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ రేవంత్ కంటే కూడా.. సీఎం కేసీఆర్ వంద రెట్లు బెట‌ర్ అంటూ.. ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మాట్లాడిన అర్వింద్.

By:  Tupaki Desk   |   25 Nov 2023 2:36 PM GMT
రేవంత్ కంటే కేసీఆర్ బెట‌ర్‌.. :  బీజేపీ పైర్ బ్రాండ్ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సంచ‌ల‌న ఘ‌ట్టం చోటు చేసుకుంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అధికార పార్టీ బీఆర్ ఎస్‌పైనా, సీఎం కేసీఆర్‌పైనా విరుచుకుప‌డిన బీజేపీ నిజామాబాద్ ఎంపీ, ప్ర‌స్తుతం ఎన్నిక‌ల బ‌రిలో అసెంబ్లీకి పోటీ చేస్తున్న పొలిటిక‌ల్ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు ధ‌ర్మ‌పురి అర్వింద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ రేవంత్ కంటే కూడా.. సీఎం కేసీఆర్ వంద రెట్లు బెట‌ర్ అంటూ.. ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మాట్లాడిన అర్వింద్.. రేవంత్‌రెడ్డిపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే.. కేసీఆర్‌పై అనుకూల వ్యాఖ్య‌లు చేయ‌డం రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టించింది.

"తెలంగాణ కోసం.. కేసీఆర్ ప‌దేండ్లు కొట్లాడిండు. అప్పుడు రేవంత్‌రెడ్డి ఏడుండ‌డు. అప్ప‌ట్లో ఆయ‌న టీడీపీలో ఉన్న‌డు. తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించిండు. అంతేకాదు..తుపాకీ ప‌ట్టుకుని వ‌చ్చి ఉద్య‌మకారుల‌పై ఎక్కు పెట్టిండు" అని అర్వింద్ వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు కోసం.. అప్ప‌ట్లో సంచులు మోసాడ‌ని రేవంత్‌పై విరుచుకుప‌డ్డారు. ఇప్పుడు కూడా చంద్ర‌బాబు చెప్పిన‌ట్టే ఆడుతున్నాడ‌ని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. అది తెలంగాణ‌ను వారి చేతిలో పెట్టిన‌ట్టే అని అన్నారు.

అయితే.. ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా బీజేపీని కూడా ఇరుకున పెడుతున్నాయి. ఒక‌వైపు బీఆర్ఎస్ పై బీజేపీ నేత‌లు విరుచుకుప‌డుతున్నారు అధికారంలోకి వ‌స్తే.. కేసీఆర్ అవినీతిని వెలికి తీసి జైలుకు పంపిస్తామ‌ని.. ర‌క్ష‌ణ మంత్రి, బీజేపీ అగ్ర‌నేత రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్య‌లు చేశారు. ఇక‌, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా శ‌నివారం హైద‌రాబాద్‌లో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్ర‌భుత్వం అవినీతిలో కూరుకుపోయింద‌ని అన్నారు. కేసీఆర్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి స‌మ‌యంలో అనూహ్యంగా అర్వింద్ కేసీఆర్‌కు ద‌న్నుగా మాట్లాడడం చ‌ర్చ‌నీయాంశం అయింది. మ‌రోవైపు.. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్ర‌చారం.. "బీజేపీ-బీఆర్ ఎస్ ఒక్క‌టే" అన్న వ్యాఖ్య‌ల‌కు కూడా అర్వింద్ వ్యాఖ్య‌లు బలాన్ని చేకూరుస్తున్నాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.