ఇంటి గుట్టు విప్పిన అర్వింద్.. భలే దొరికిపోయారుగా
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని ఉందన్న చందంగా మారింది తెలంగాణలోని బీజేపీ పరిస్థితి.
By: Garuda Media | 7 March 2026 10:43 AM ISTఅంగట్లో అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని ఉందన్న చందంగా మారింది తెలంగాణలోని బీజేపీ పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో తనకు తానుగా రాజకీయంగా బలోపేతం అయ్యేందుకు తెలంగాణలో అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ.. ముఖ్యనేతల మధ్య నెలకొన్న పంచాయితీలు.. పార్టీకి శాపంగా మారుతున్నాయి. అయితే.. లోగుట్టు విషయాల్ని ఎవరూ మాట్లాడని దుస్థితి. దీనికి తోడు బీజేపీ అధిష్టానం సైతం తెలంగాణ విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తే.. రెండు అడుగులు వెనక్కి వేసే పరిస్థితి. దీంతో.. బీజేపీని తెలంగాణలో బలోపేతం చేయం సాధ్యం కావట్లేదు.
తెలంగాణ బీజేపీ అన్నంతనే గుర్తుకు వచ్చే ముఖ్య నేతల్లో కిషన్ రెడ్డి.. బండి సంజయ్.. ఈటల రాజేందర్.. లక్ష్మణ్.. రఘనందన్.. ధర్మపురి అర్వింద్.. డీకే అరుణ లాంటోళ్లు భారీగానే ఉన్నారు. కాకుంటే.. వీరిలో ఒకరంటే మరొకరికి పడని పరిస్థితి. పైకి అందరూ బాగున్నట్లే కనిపించినా.. లోలోన మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ బీజేపీలో నాలుగైదు పవర్ జోన్లు ఉన్నాయి. ఒకరు మరొకరితో కలిసేందుకు పెద్దగా ప్రయత్నించని వేళలో.. అనూహ్య రీతిలో పార్టీ పెరుగుదల ప్రభావితం అవుతోంది. ఈ వాదనలకు బలం చేకూరేలా ఈ మధ్యన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం తెలంగాణ బీజేపీ నేతల పని తీరుపై పెదవి విరిచిన పరిస్థితి. అయినప్పటికీ మార్పు రాలేదు.
ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. తాజాగా నిజామాబాద్ లో జరిగిన కార్యక్రమంలో నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన సంచలన వ్యాఖ్యలే కారణం. నిజామాబాద్ జిల్లాలో ఇటీవల గెలుపొందిన బీజేపీ కార్పొరేటర్లు.. కౌన్సిలర్లకు తాజాగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ఈటల రాజేందర్ ను ఆహ్వానించారు ధర్మపురి అర్వింద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను.. ఈటల రాజేందర్ కలిసికట్టుగా పని చేస్తూ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురాగలమన్న ధీమాను వ్యక్తం చేశారు.
ఈ వ్యాఖ్య ఇప్పుడు సంచలనంగా మారింది. అర్వింద్.. ఈటల కలిస్తే సరిపోతుందా? మరి కిషన్ రెడ్డి.. బండి సంజయ్ సంగతేంటి? అన్నది ప్రశ్న. అర్వింద్ నోటి నుంచి వచ్చిన మాటలు తెలంగాణ బీజేపీలో నెలకొన్న లుకలుకలు ఇట్టే బయటపెడతాయని చెప్పక తప్పదు. తాను నిర్వహించే కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు కేంద్ర మంత్రులుగా ఉన్న ఇద్దరు ప్రముఖుల్ని కాదని.. ఈటలను పిలవటం ఒక ఎత్తు అయితే.. తామిద్దరం కలిస్తే తెలంగాణలో పార్టీ పవర్ లోకి వస్తుందన్న వ్యాఖ్యలు చూస్తే.. పార్టీలో అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. ఈ వ్యాఖ్యలను బీజేపీ అధినాయకత్వం ఏ మేరకు తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే.. మిగిలిన పార్టీలతో పోలిస్తే బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం తక్కువ. స్వేచ్ఛగా తాము అనుకున్నది మాట్లాడలేని పరిస్థితి. క్రమశిక్షణ పేరుతో కట్టడి చేయటం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లోనూ అర్వింద్ చేసిన వ్యాఖ్యలు.. పార్టీలోని ముఖ్యనేతల మధ్య పెరిగిన దూరాన్ని తెలిసేలా చేసిందని చెప్పాలి.
