Begin typing your search above and press return to search.

ఎన్నికల వేళ వాలంటీర్లపై ధర్మాన షాకింగ్ వ్యాఖ్యలు

తాజాగా శ్రీకాకుళం పట్టణంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన వైసీపీ పార్టీ సమావేశానికి హాజరైన ఆయన.. ప్రసంగంచారు. ఈ సందర్భంగా ఆయన వాలంటీర్లను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   13 April 2024 9:25 AM IST
ఎన్నికల వేళ వాలంటీర్లపై ధర్మాన షాకింగ్ వ్యాఖ్యలు
X

సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఆయన చెప్పాలనుకునే అంశానికి.. చెప్పే మాటలకు అప్పుడప్పుడు లింకులు తెగిపోతుంటాయి. ఆయన మాటల్లో కొంత పార్టును తీసుకొని చూస్తే.. ధర్మాన ఏంది? ఇలా మాట్లడారేమిటన్న భావన కలుగుతుంది. కాస్త దీర్ఘంగా ఆలోచిస్తే ఆయన మాటల మర్మం వేరుగా ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే.. తాజాగా చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉండటమే కాదు.. ఈ తరహా వ్యాఖ్యలు ఎన్నికల సమయంలో చేయటం ఏ మాత్రం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తాజాగా శ్రీకాకుళం పట్టణంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన వైసీపీ పార్టీ సమావేశానికి హాజరైన ఆయన.. ప్రసంగంచారు. ఈ సందర్భంగా ఆయన వాలంటీర్లను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో వాలంటీర్లు అంతా పాల్గొనేలా చేయాలని.. కేసులు అడ్డు వస్తాయంటే రాజీనామా చేయమని చెప్పాలన్నారు.

"వారు వైసీపీ కార్యకర్తల్లా పని చేస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఏం చేయాలో చూద్దాం. సామాన్యమైన ఓటరు ఎవరో ఒకరు అడగాలి కదా అనుకుంటారు. మనం ఇప్పుడే కదా వారికి కనిపించేది. మళ్లీ ఐదేళ్ల తర్వాత కనిపిస్తాం" అంటూ వ్యాఖ్యానించారు.

రాజీనామా చేసిన వలంటీర్లు 50 ఇళ్ల నుంచి పాతిక మందిని నామినేషన్ కార్యక్రమానికి తీసుకురావాలన్న టార్గెట్ ఇచ్చిన ధర్మాన.. ఎన్నికల్లో పోల్ మేనేజ్ మెంట్ చేసే వారే ఇబ్బందిగా ఉన్న నియోజకవర్గాల్లోనూ విజయం సాధిస్తారన్నారు. వాలంటీర్లు అంతా వైసీపీ కార్యకర్తలేనని.. వారితో రాజీనామా చేయించి ఎన్నికల్లో పాల్గొనేలా చేయాలన్న ధర్మాన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎన్నికల టైంలో ఇవేం మాటలు ధర్మాన? అంటూ తలలు పట్టుకునే పరిస్థితిని తీసుకొచ్చారంటున్నారు