Begin typing your search above and press return to search.

వైసీపీ తరఫున పోలింగ్ ఏజెంట్లుగా వాలంటీర్లు...?

వైసీపీలో సీనియర్ మంత్రిగా ధర్మాధర్మాలు ఎరిగిన రాజకీయ నేతగా ఉన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాదరావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు

By:  Tupaki Desk   |   22 Feb 2024 4:04 AM GMT
వైసీపీ  తరఫున  పోలింగ్ ఏజెంట్లుగా వాలంటీర్లు...?
X

వైసీపీలో సీనియర్ మంత్రిగా ధర్మాధర్మాలు ఎరిగిన రాజకీయ నేతగా ఉన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాదరావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లు అంతా పోలింగ్ బూత్ లలో వైసీపీ తరఫున ఏజెంట్లుగా కూర్చోవాలని ఆయన కోరడం విశేషమే. వాలంటీర్లు అలా కూర్చోవాల్సిన అవసరం ఉందని ధర్మాన గట్టిగా నొక్కి చెబుతున్నారు.

జిల్లాలోని గార మండలం అంపోలులో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల సేవలకు పురస్కారాలు అందచేస్తూ మంత్రి ఈ మాటలు అన్నారు. అంతే కాదు వృద్ధులు దివ్యాంగులతో పోస్టల్ బ్యాలెట్ తయారు చేయించాల్సిన బాధ్యత వాలంటీర్ల మీద ఉందని ఆయన అన్నారు.

ఎనభై సంవత్సరాలు దాటిన ప్రతీ పౌరుడికీ పోస్టల్ బ్యాలెట్ ఇస్తున్నారు దాన్ని వారి చేత అప్లికేషన్ ఇప్పించి పెట్టించండి అని ఆయన కోరారు. వైసీపీ పట్ల కోపంగా ఉన్న వారు ఈ విధంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పక్కదారి పట్టిస్తారని అలా చేయకుండా చూడాలని ఆయన కోరారు.

అవసరం అయితే పోలింగ్ బూతులలో కూర్చుని దొంగ ఓట్లు పడనీయకుండా బాధ్యత తీసుకోవాలని ధర్మాన సూచించారు. వాలంటీర్లకు సర్వీసు రూల్స్ ఏమీ లేవని వారు ఏ పని అయినా చేయవచ్చు అని ధర్మాన అంటున్నారు. వారు స్వచ్చంద సేవకులు అని ఆయన అన్నారు. మీరు ప్రజల కోసం పనిచేసేవారు కాబట్టి అలా పోలింగ్ విషయంలో కూడా ఒక కంట కనిపెట్టాలని ధర్మాన హిత బోధ చేశారు.

ధర్మాన చెప్పింది బాగానే ఉన్నా కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఇటీవలే ఏపీ స్టేట్ ఎలెక్షన్ కి సూచించింది అని అంటున్నారు. మరి వాలంటీర్ల విషయంలో పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోబెట్టడానికి ఆలోచిస్తున్నామని ధర్మాన చెప్పడం అంటే ఏ విధంగా అర్ధం చేసుకోవాలి అన్న చర్చ అయితే వస్తోంది.

ప్రస్తుతం ఇది టీడీపీ సహా ఇతర ప్రతిపక్షాలకు మాత్రం ఒక విమర్శనాస్త్రంగా మారుతోంది. ఇప్పటికే వాలంటీర్లతో వైసీపీ రాజకీయ అవసరాలు తీర్చుకుంటోందని ఆరోపిస్తూ వస్తున్న విపక్షాలు మాత్రం వారిని పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోబెడితే అసలు ఊరుకోవని అంటున్నారు.