Begin typing your search above and press return to search.

విశాఖ కంటే బెస్ట్ కాపిటల్ సిటీ వేరొకటి లేదు...!

ఈ నేపధ్యంలో విశాఖ రాజధానికి మద్దతుగా వైసీపీ మంత్రులు అనేక పర్యాయాలు మాట్లాడుతూ వస్తున్నారు

By:  Tupaki Desk   |   21 Nov 2023 8:45 AM GMT
విశాఖ కంటే బెస్ట్ కాపిటల్ సిటీ వేరొకటి లేదు...!
X

వైసీపీకి మూడు రాజధానుల మీద మక్కువ ఉంది. అయితే అది న్యాయ స్థానాల్లో ఉంది. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ లో సీఎం క్యాంప్ ఆఫీసుని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఆయన రాక మాత్రం ఎపుడన్నది తెలియదు. దాని కోసం పెట్టిన అన్ని ముహూర్తాలూ అలా దాటి ముందుకు వెళ్ళిపోతున్నాయి.

ఈ నేపధ్యంలో విశాఖ రాజధానికి మద్దతుగా వైసీపీ మంత్రులు అనేక పర్యాయాలు మాట్లాడుతూ వస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే ఈ విషయంలో విశాఖ రాజధాని కావాలని తన కోరికను బాహాటంగా అనేక సార్లు వెల్లడించారు. అంతే కాదు పేరుకు మూడు రాజధానులు అని అంటున్నా విశాఖ మాత్రమే ఏకైక రాజధాని అవుతుందని అప్పట్లో ధర్మాన అని సంచలనం రేకెత్తించారు.

అది వివాదం కూడా అయింది. ఇపుడు చూస్తే సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లా అచ్యుతాపురంలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ విశాఖ రాజధాని మీద మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో విశాఖ కంటే అన్ని అర్హతలు ఉన్న రాజధాని వేరొకటి లేనే లేదు అని కూడా ఆయన అన్నారు.

విశాఖ రాజధాని కావడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు బాగా పెరుగుతాయని ఆయన చెప్పడం విశేషం. మొదట చెన్నై, ఆ తరువాత కర్నూల్ లలో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేస్తే రాజధాని కోసం ఉత్తరాంధ్రా ప్రజలు వెళ్లడానికి ఏకంగా రెండు రోజుల సమయం పట్టేదని గతాన్ని ఆయన గుర్తు చేశారు.

అలాంటి రాజధాని ఉత్తరాంధ్రా ముంగిటకే తీసుకుని రావలని వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతీ ఒక్కరూ స్వాగతించాలని ఆయన కోరారు. వైసీపీ ప్రభుత్వం ఏమి చేయలేదో ప్రజలకు చెప్పడంలో విపక్షాలకు ఏ ఒక్క అంశమూ లేదని సీనియర్ మంత్రి అనడం విశేషం.

రోడ్లు బాగా లేవని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు వద్దనుకోవద్దని ఆయన సూచించారు. రోడ్లు వేస్తే ప్రజల జీవన ప్రమాణాలు మారుతాయా అని ఆయన ప్రశ్నించారు. రాజధాని రావాలి అభివృద్ధి జరగాలని ఆయన అనడం విశేషం. మొత్తానికి ధర్మాన ప్రసాదరావు మరోసారి సంచలన కామెంట్స్ చేశారు అని అంటున్నారు.

ఎలా అంటే రోడ్లు వేస్తే జీవన ప్రమాణాలు మారుతాయా అని ప్రశ్నించడమే అని అంటున్నారు. ప్రభుత్వం రోడ్లు వేయలేదని పరోక్షంగా ఆయన అంగీకరించారని కూడా అంటున్నారు. ఇదిలా ఉంటే విశాఖ రాజధాని కావాలని ఆయన కోరుకోవడంలో తప్పు లేదు కానీ న్యాయస్థానంలో ఉన్న అంశాన్ని జనంలో ప్రతీ సారీ చర్చకు పెట్టడం వల్ల అంతిమంగా అది పార్టీకే చేటు తెస్తుందని అన్న వారూ ఉన్నారు.

ఎందుకంటే ప్రభుత్వం ఏమి చేసినా కోర్టు తీర్పు వచ్చిన తరువాతనే చేయాలి. అంతవరకూ వేచి చూడాలి. కోర్టు తీర్పు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. ఉత్తరాంధ్రా వాసులకు విశాఖ రాజధాని అని ఆశలు కల్పించి తీరా అమలు చేయలేకపోతే అది మరింత ఇబ్బంది అవుతుందని సీనియర్ మంత్రి తెలుసుకోలేకపోతున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.