Begin typing your search above and press return to search.

ధర్మాన ధర్మ సంకటం...?

శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావు రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఆయన రూట్ ఎటూ అన్న దాని మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది

By:  Tupaki Desk   |   28 Oct 2023 3:53 AM GMT
ధర్మాన ధర్మ సంకటం...?
X

శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావు రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఆయన రూట్ ఎటూ అన్న దాని మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ధర్మాన ప్రసాదరావు నరసన్నపేట నుంచి అలాగే శ్రీకాకుళం నుంచి పలు మార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఎన్నో సార్లు కీలకమైన మంత్రిత్వ శాఖలను కూడా నిర్వహించారు.

ఆయన ఆరున్నర పదుల వయసులో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని అధినాయకత్వం చాన్స్ ఇస్తే పెద్దల సభ అంటే రాజ్యసభ మెంబర్ కావాలని ఉందని ధర్మాన తన సన్నిహితులతో చెబుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే తనకు బదులుగా తన కుమారుడు ధర్మాన రామమనోహర్ నాయుడుకు శ్రీకాకుళం టికెట్ ఇవ్వాలని కూడా ఆయన ప్రతిపాదిస్తున్నట్లుగా చెబుతున్నారు.

అయితే ధర్మాన మాటను అధినాయకత్వం వేరే విధంగా తీసుకుంటోంది అని అంటున్నారు. ఆయన పార్లమెంట్ కి వెళ్లాలంటే పంపిస్తామని అయితే అది రాజ్యసభకు కాదు, లోక్ సభకు అని అంటోంది వైసీపీ హై కమాండ్. వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా ధర్మాన పోటీ చేయాలని కోరుతోంది. ఇక శ్రీకాకుళం ఎమ్మెల్యే టికెట్ కొత్త వారికి ఇస్తామని అంటోంది.

దీంతోనే వస్తోంది తకరారు. పోనీ తన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తాను హ్యాపీగా ఎంపీ టికెట్ కి పోటీ చేస్తాను అని పెద్దాయన అంటున్నా అలా వీలు కాదు అన్నట్లుగా వైసీపీ పెద్దలు చెబుతున్నారుట. ఇదంతా ఎందుకు అంటే దీని వెనక కూడా వ్యూహం ఉంది అని అంటున్నారు. శ్రీకాకుళం లోక్ సభ సీటు ఎపుడూ ఎర్రన్నాయుడు ఫ్యామిలీకే అంకితం అన్నట్లుగా మూడు దశాబ్దాలుగా పోతోంది. 1996లో ఎర్రన్నాయుడు ఎంపీగా పోటీ చేయడం మొదలెడితే 1998, 1999, 2004, దాకా ఆయనే వరసబెట్టి నాలుగు సార్లు గెలిచారు. 2009లో మొదటిసారి ఆయన ఓడారు. 2012లో దివంగతులయ్యారు.

ఇక ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడు 2014, 2019లలో వరసగా గెలిచారు. 2019లో అయితే కేవలం ఆరున్నర వేల స్వల్ప ఓట్ల తేడాతో వైసీపీ ఓడింది. ఎర్రన్నాయుడు రోజుల నుంచి ధర్మాన ఫ్యామిలీ లోపాయికారిగా కింజరాపు ఫ్యామిలీకి లోక్ సభ ఎన్నికల్లో సహకారం ఇస్తోంది అని ప్రచారంలో ఉంది ఇక 2019 తరువాత వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్, అలాగే శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్ గా నాడు ఉన్న కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ధర్మాన ఫ్యామిలీ లోపాయికారీ సాయం గురించి అధినాయకత్వానికి చెప్పారని అంటున్నారు.

ఇక మొత్తం పార్లమెంట్ పరిధిలో ఏడింటికీ అయిదు అసెంబ్లీ సీట్లు గెలిచి కూడా ఎంపీ సీటు ఓడిపోవడం మీద జగన్ సీరియస్ అయ్యారని నాడే ప్రచారంలోకి వచ్చింది. వైసీపీకి సాలిడ్ గా కాళింగ ఓట్లు పడుతున్నా వెలమ సామాజిక వర్గం ఓట్లలో చీలిక వస్తోందని, అదే టీడీపీని గట్టెక్కిస్తోందని అధినాయకత్వం గ్రహించింది అంటున్నారు.

అందువల్ల 2019 తరువాతనే ఎంపీగా ధర్మాన ఫ్యామిలీ నుంచి నిలబెట్టాలని డిసైడ్ అయ్యారని చెబుతారు. ఇపుడు అదే మాట మీద హై కమాండ్ ఉంది. ధర్మాన ఫ్యామిలీ నుంచి ప్రసాదరావు పోటీలో ఉంటే వెలమ ఓట్లు మొత్తం వైసీపీకి పడేలా చూసుకుంటారని, కాళింగ ఓట్లు కూడా కలసి వస్తాయి కాబట్టి గెలుపు ష్యూర్ అని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు.

ఒకవేళ ఓటమి పాలు అయితే ప్రసాదరావు రాజకీయ జీవితమే ఇబ్బందిలో పడుతుంది కాబట్టి అలా జరగదని కూడా తలపోస్తోంది. ఈ విధంగా హై కమాండ్ వత్తిడి చేయడంతో ధర్మాన ప్రసాదరావు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు అని అంటున్నారు. మరి ఎన్నికల వేళకు ఏమి జరుగుతుందో చూడాలి. ఇపుడున్న పరిస్థితులు చూస్తే మంత్రి మాత్రం ఎంపీగా పోటీ చేసేందుకు ససేమిరా అంటున్నారు అని తెలుస్తోంది.