Begin typing your search above and press return to search.

మా ప్రభుత్వం మీద మగాళ్లు కోపంగా ఉన్నారు.. ధర్మాన ఆసక్తికర వ్యాఖ్యలు!

ఈసారి మహిళా ఓటర్లు ఎక్కువశాతం అధికారపార్టీ వైపు చూస్తున్నారనే చర్చ ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్న నేపథ్యంలో... మంత్రి ధర్మాన ప్రసాద రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   10 March 2024 4:05 AM GMT
మా ప్రభుత్వం మీద మగాళ్లు కోపంగా ఉన్నారు.. ధర్మాన ఆసక్తికర వ్యాఖ్యలు!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్లను ఆకట్టుకోవడానికి రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యలు బలే ఆసక్తికరంగా ఉంటుంటాయి. పైగా... ఈసారి మహిళా ఓటర్లు ఎక్కువశాతం అధికారపార్టీ వైపు చూస్తున్నారనే చర్చ ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్న నేపథ్యంలో... మంత్రి ధర్మాన ప్రసాద రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఓటు వేసే విషయంలో ఇంట్లో మగాళ్ల మాటలు అస్సలు వినొద్దని అన్నారు.

అవును... ఏపీ రాజకీయాల్లో మంత్రి ధర్మాన ప్రసాద రావు చేసే వ్యాఖ్యలకు సెపరేట్ ఫ్యాన్ బెల్ట్ ఉందని అంటుంటారు. నాలుగు గోడల మధ్యా చేయాల్సిన వ్యాఖ్యలు నలుగురిలోనూ చేస్తారని కొంతమంది అభిప్రాయపడుతుంటారు. ఈ సమయంలో ఇంట్లో మహిళలు ఓటు చేసే విషయంలో మగాళ్ల మాటలు వినొద్దని చెప్పారు. అందుకు గల కారణాన్ని సైతం ఆయన వెల్లడించారు. పథకాల డబ్బులన్నీ మహిళల ఖాతాల్లో పడుతుండటమే అందుకు కారణమని అన్నారు.

వివరాళ్లోకి వెళ్తే... శ్రీకాకుళం జిల్లా సింగుపురంలో నిర్వహించిన "వైఎస్సార్ చేయుత" నగదు పంపిణీ కార్యక్రమానికి మంత్రి ధర్మాన హాజరయ్యారు. ఈ సందర్భంగా మైకందుకున్న ఆయన.. మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా గత ఎన్నికల్లో అధికారం ఇచ్చారని.. ప్రభుత్వ పథకాల పంపిణీ సమయంలో పలుమార్లు ఏర్పాటు చేసిన సమావేశాల్లో నేరుగా మిమ్మల్ని కలిసేవారిని అని తెలిపారు. ఈ ప్రభుత్వంలో ఇదే చిట్టచివరి సమావేశం అని వెల్లడించారు.

ఈ క్రమంలోనే మరో రెండు మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని.. తర్వాత ఇలాంటి అధికారిక కార్యక్రమాలు ఏర్పాటుచేసే సమావేశాలు ఉండవని మంత్రి ధర్మాన వ్యాఖ్యానించారు. ఈ సమయంలో... పథకాల డబ్బులు అన్నీ మహిళల ఖాతాల్లోకే వెళ్తుండటం వల్ల తమ ప్రభుత్వంపై మగాళ్లకు కోపం ఉందని అన్నారు.

దీంతో... వారంతా సైకిల్ కే ఓటు వేయమని చెబుతారని.. అయితే వారి మాటలు మాత్రం మీరు వినొద్దని.. పథకాలకు కృతజ్ఞతగా వైసీపీకి ఓటు వేయాలని మంత్రి ధర్మాన ప్రసాద రావు మహిళలకు సూచించారు.

అలా కాకుండా... మీ మీ ఇల్లల్లోని మగాళ్లకు ఈ ప్రభుత్వంపై ఏమైనా కోపం ఉంటే అది కూడా మీరు కంట్రోల్ చేసి ఇంటిల్లపాదీ వైసీపీకి ఓటు వేసేలా చూడాల్సిన బాధ్యతను మహిళలు తీసుకోవాలని.. అది జగన్ కు మీరిచ్చే రిటన్ గిఫ్ట్ అని ధర్మన వ్యాఖ్యానించి ఉంటే మరింత బాగుండనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.