పవన్ అమాయకుడు...పాపాల భైరవుడు బాబే !
పేరుకు టీడీపీ కూటమి ప్రభుత్వం అంటున్నారు కానీ అందులో పెత్తనం అంతా చేసేది ఒక్క టీడీపీయే అని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 12 July 2025 7:00 PM ISTపేరుకు టీడీపీ కూటమి ప్రభుత్వం అంటున్నారు కానీ అందులో పెత్తనం అంతా చేసేది ఒక్క టీడీపీయే అని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు కూటమి అని పేరు చెబుతూ తన పాపాలను అందరికీ అంటించే ప్రయత్నం బాబు చేస్తున్నారు అని అన్నారు. నిజానికి చూస్తే కూటమి ప్రభుత్వం కాదిది, చంద్రబాబు ప్రభుత్వమే అని ధర్మాన హాట్ కామెంట్స్ చేశారు. పాపాలు అన్నీ చేస్తున్నది చంద్రబాబే అన్నారు
ఇటీవల వైసీపీ పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసాదరావు మాట్లాడుతూ చంద్రబాబు మీద హాట్ కామెంట్స్ చేశారు. మోసాలు చేయడమే బాబు నైజం అన్నారు. అయినా సరే ఆయనను నమ్మి అధికారం ఇస్తున్నారని చెప్పారు. అలా మోసంతోనో మాయాజాలంతోనో అధికారం సంపాదించడమూ ఒక గొప్పతనమని టీడీపీ క్యాడర్ అంతా సంబరపడుతూ ఉంటుదని ఆయన అన్నారు.
ఒక్కోసారి దొంగోడుకి కూడా పేరు వస్తుందని ఊళ్ళో దొంగతనం చేసిన వాడిని కూడా ఆరడుగుల గోడ అవలీలగా దూకేసి దొంగతనం చేశాడురా అని తెలియకుండానే పొగుడుతూంటారని ధర్మాన అన్నారు. బాబుని పొగడడం అలాంటిదే అన్నారు
చంద్రబాబు అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఆయన అన్ని వర్గాలను ఇపుడు మోసం చేస్తున్నారు అని ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు ఇచ్చే హామీలతో తమకు సంబంధం లేదని బీజేపీ మొదటే తప్పుకుందని గుర్తు చేశారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి సైతం ఏ విషయంలోనూ ఇవాల్వ్ మెంట్ లేదని అన్నారు. ఆయన అమాయకుడని ధర్మాన వ్యాఖ్యానించారు.
తన రాజకీయం మీద అభద్రతాభావం తోనే పవన్ కళ్యాణ్ చంద్రబాబుని పొగుడుతున్నారే తప్ప మరేమీ కాదని అన్నారు. ఇలా కూటమి ప్రభుత్వంలో మొత్తానికి మొత్తం పెత్తనం చేస్తూ ఏడాదిగా ఏమీ చేయకుండా టీడీపీ మోసం చేస్తోంది అని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంగానే దీనిని అందుకే చూడాలని ఆయన కార్యకర్తలకు హితబోధ చేసారు.
మరో వైపు చూస్తే అత్యంత వెనకబడిన బీద జిల్లా అయిన శ్రీకాకుళానికి ఏడాది పాలనలో బాబు వేయి కోట్ల రూపాయలు కూడా కేటాయించలేదని ధర్మాన మండిపడ్డారు. ఏపీ వార్షిక బడ్జెట్ రెండు లక్షల కోట్ల రూపాయలుగా ఉంటే ఒక వేయి కోట్లు శ్రీకాకుళం అభివృద్ధికి కేటాయించలేరా అని ఆయన ప్రశ్నించారు. క్యాపిటల్ ఎక్స్ పెండించర్ గా వేయి కోట్లు ఇవ్వలేని ప్రభుత్వంగా టీడీపీ ఉందని ఆయన అన్నారు.
మొత్తం మీద చూస్తే చాలా కాలానికి నోరు తెరచినా ఘాటైన విమర్శలే ధర్మాన చంద్రబాబు మీద చేశారు అని అంటున్నారు. బాబు అధికారంలోకి రావడానికి మోసపూరితమైన మాటలు మాయ మాటలే చెబుతున్నారని అయితే మా బాబు ఎలాగోలా అధికారం తెచ్చేస్తాడు అన్నది ఆ పార్టీ క్యాడర్ ధైర్యం అని ధర్మాన చెప్పుకొచ్చారు. ఇక పవన్ ని అమాయకుడు ఆయనని అలా వదిలేయండి అన్ ధర్మాన చెప్పడమే విశేషం.
