ఆయన వైసీపీలోనేనట.......సౌండ్ చూస్తే అర్ధమవుతోందిగా !
వైసీపీకి దారుణ ఓటమి ఒక వైపు కలవరం పెడుతూంటే మరో వైపు పార్టీలో నేతల తీరు ఇంకా ఇబ్బందిగా మారుతోంది. ఎపుడు ఏ నేత జెండా దించేస్తారో అన్నది కూడా ఉంది.
By: Satya P | 6 Oct 2025 9:20 AM ISTవైసీపీకి దారుణ ఓటమి ఒక వైపు కలవరం పెడుతూంటే మరో వైపు పార్టీలో నేతల తీరు ఇంకా ఇబ్బందిగా మారుతోంది. ఎపుడు ఏ నేత జెండా దించేస్తారో అన్నది కూడా ఉంది. అసలే కష్టకాలం, నాయకులు అంతా జనంలోకి వెళ్తేనే పార్టీ గట్టిగా నిలబడుతుంది. అందుకోసమే పార్టీ పదవులు ఎన్నో కల్పించి నేతలకు అధినాయకత్వం పంచిపెడుతున్నా మౌనం అయితే వీడని నేతల లిస్ట్ చాలానే ఉంది. అయితే ఉత్తరాంధ్రాలో దిగ్గజ నేతగా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విషయంలో వైసీపీ డైలామాకు కొంత మేర క్లారిటీ వచ్చినట్లు అయింది అని అంటున్నారు
జగన్ రాకతో మీట్ :
ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓటమి తరువాత తొలిసారి ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తున్నారు. దాంతో ఆయన పర్యటన బ్రహ్మాండంగా ఉండాలని వైసీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన వైసీపీ నేతలంతా ఒక మీటింగ్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా నుంచి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తరలి రావడం విశేషంగా అంతా చూస్తున్నారు. ఆయన సైలెంట్ వీడడం మీద కూడా చర్చించుకుంటున్నారు.
కూటమి మీద స్ట్రాంగ్ గానే :
ఇక ఈ సమావేశంలో ప్రసాదరావు కూటమి ఏణ్ణర్థం పాలన మీద తనదైన శైలిలో విమర్శలు చేశారు ఉత్తరాంధ్రకు చేసిందేమీ లేదని ఆయన నిప్పులు చెరిగారు. జగనే అంతా చేశారని పాలకుడు అంటే ఆయనే అని కితాబు ఇచ్చారు. ఇలా జగన్ ని పొగుడుతూ కూటమిని తెగడుతూ ధర్మాన ఇచ్చిన స్పీచ్ తో ఫ్యాన్ పార్టీ నేతలకు ఒక పక్కా క్లారిటీ అయితే వచ్చింది అని అంటున్నారు. ఆయన భవిష్యత్తు రాజకీయం వైసీపీతోనే అని కూడా అంటున్నారు.
ఎంపీగా పోటీకి :
ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు ఎంపీగా శ్రీకాకుళం నుంచి పోటీ చేస్తారు అని అంటున్నారు. ఆయన చాలా ఏళ్ళ పాటు ఎమ్మెల్యేగానే ఉన్నారని రాష్ట్ర స్థాయి పదవులు అన్నీ చూశారని కీలక మంత్రిత్వ శాఖలు చేశారని అందుకే ఢిల్లీ రాజకీయాల పట్ల మక్కువగా ఉన్నారని చెబుతున్నారు. పైగా వచ్చే ఎన్నికల్లో కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యేగా దిగుతారని అంటున్నారు. ఇక టీడీపీ నుంచి కూడా కొత్త వారే ఉంటారని తన అనుభవంతో ఎంపీ సీటు గెలిచి ఢిల్లీలో అడుగు పెట్టాలని ధర్మానకు ఉందని అంటున్నారు.
కుమారుడి కోసమే :
అంతే కాదు ధర్మాన ప్రసాదరావు రాజకీయం అంతా కుమారుడి కోసమే అని చెబుతున్నారు. 2029 ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీ సీటుని తన కుమారుడు రామ మనోహర్ నాయుడుకు ఇప్పించుకోవాలని ఆయనకు ఉందని ఆ విధంగా తమ కుటుంబానికి రెండు సీట్లు కోరుతున్నారని టాక్ అయితే వినిపిస్తోంది. మరో మూడున్నరేళ్ల తరువాత కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత మరింతగా ఉంటుందని అపుడు 2019 నాటి సీన్ రిపీట్ అవుతుందని కూడా నమ్ముతున్నారుట. మొత్తానికి పెద్దాయన సైలెంట్ వీడి యాక్టివ్ కావడం పట్ల పార్టీలో హర్షం వ్యక్తం అవుతోంది.
