ధర్మాన కఠిన నిర్ణయమేనా ?
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు జనసేనలో చేరుతున్నారని ప్రచారం సాగుతోంది.
By: Tupaki Desk | 27 Jun 2025 9:30 AM ISTశ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు జనసేనలో చేరుతున్నారని ప్రచారం సాగుతోంది. ఆయన టీడీపీలోకి అని కూడా అంతకు ముందు ప్రచారం సాగింది. దానికి కారణం ఆయన వైసీపీతో అంటీముట్టనట్టుగా ఉండడమే అని అంటున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు అయ్యాక ఆయన పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం లేదు.
అధినాయకత్వం ఎంత చెప్పి చూసినా ఆయనలో స్పందన రావడం లేదు అని అంటున్నారు. దాంతోనే ఈ రకమైన ప్రచారం మొదలైంది అని అంటున్నారు. ఇక ధర్మాన ప్రసాదరావు విషయంలో ఎందుకీ ప్రచారం జరుగుతోంది అంటే ఆయన కుమారుడిని రాజకీయంగా మంచి భవిష్యత్తులో చూసుకోవాలన్న కోరిక మేరకే అని అంటున్నారు.
శ్రీకాకుళం అసెంబ్లీ సీటు చూస్తే తెలుగుదేశం పార్టీకి ఎపుడూ అనుకూలంగా ఉంటూ వస్తోంది. తెలుగుదేశం పార్టీ పుట్టాక మొత్తం 10 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అందులో ఏడు సార్లు టీడీపీయే శ్రీకాకుళాన్ని గెలుచుకుంది. దాంతో పాటు అక్కడ కూటమి బలంగా ఉంది. ఈ క్రమంలో వైసీపీ బలహీనంగా కనిపిస్తోందని అంటున్నారు. అందుకే ఆయన కుమారుడు ఫ్యూచర్ ని బట్టే ఆలోచిస్తున్నారు అని ప్రచారం సాగింది.
అయితే తాజాగా జరుగుతున్న మరో ప్రచారం బట్టి చూస్తే తన మీద సాగుతున్న ఈ తరహా ప్రచారం మీద ధర్మాన కలత చెందుతున్నారు అని అంటున్నారు. తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం వైసీపీలోనే ఉంటాను అని ఆయన సన్నిహితులతో చెబుతున్నారుట. తాను పార్టీలు మారుతున్నాను అని వస్తున్న వార్తలు ఆవేదన కలిగిస్తున్నాయని ఆయన అంటున్నారుట.
మరో వైపు చూస్తే ధర్మాన వైసీపీలో ఏమైనా చురుకైన పాత్ర నిర్వహిస్తారా అంటే దాని మీద కూడా పెద్దగా ఎవరూ మాట్లాడటం లేదు అంటున్నారు. ధర్మాన కఠిన నిర్ణయం మీదనే దృష్టి పెట్టారని చెబుతున్నారు. తాను రాజకీయాల నుంచి విరమించుకోవాలని ఆయన గట్టిగా భావిస్తున్నారుట.
వర్తమాన రాజకీయాల్లో కొనసాగడం ఆయనకు ఇష్టం లేదని అంటున్నారు. చాలా చిన్న వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం చేసిన ధర్మాన మూడు పదుల లోపే ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి కూడా అయ్యారు దాంతో పాటు ఆయన కాంగ్రెస్ లో కొనసాగుతూ అనేక కీలక శాఖలను చూశారు, కాంగ్రెస్ వైసీపీలోనూ రెవిన్యూ శాఖ వంటి టాప్ పోర్టుఫోలియోని నిర్వహించారు.
ఇక చాలు తన రాజకీయం అని ఆయన అనుకుంటున్నారుట. నాలుగు దశాబ్దాలకు పై చిలుకు రాజకీయ జీవితం చూసిన ఆయన ఇక తాను రెస్ట్ తీసుకుందామనే ఆలోచిస్తున్నారు అంటున్నారు. మరి ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్తు అంటే దాని మీదనే చర్చ సాగుతోంది. మరి ఆయన కుమారుడు వైసీపీలోనే ఉంటారా లేక తనకు నచ్చిన పార్టీని ఎంచుకుంటారా అన్నదే చూడాలని అంటున్నారు ఏది ఏమైనా తన మీద వస్తున్న జంపింగ్ వార్తల పట్ల పెద్దాయన మనస్తాపం చెందుతున్నారని అంటున్నారు.
