వందలాది మహిళల శవాల దిబ్బ....ధర్మస్థలి మిస్టరీ వెనక ?
అయితే ఈ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణల మీద కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగానే స్పందించింది. దాంతో ఈ నెల 19న సిట్ ని ఏర్పాటు చేసింది.
By: Tupaki Desk | 23 July 2025 10:08 PM ISTధర్మస్థలి. పేరులోనే ధర్మం ఉంది. అధ్బుతమైన ఆధ్యాత్మిక క్షేత్రం అది ఆ పేరు వింటేనే ఆధ్యాత్మిక భావనలు మనసు అనే నాసికకు తగిలి దేహం యావత్తూ పవిత్రమైన భావనలోకి వెళ్ళిపోతుంది. అటువంటి ధర్మస్థలి ఇపుడు దేశవ్యాప్తంగా చర్చగా తావిస్తోంది అతి పెద్ద సంచలనానికి కేంద్రంగా మారింది. ధర్మం పేరు వినిపించే చోట ఘోరాలు జరుగుతున్నాయన్న వార్తలు భక్తులను వేదనకు గురి చేస్తూంటే పరిశోధకులకు ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
ఇంతకీ ధర్మస్థలిలో ఏమి జరుగుతోంది. ప్రచారంలో ఉన్న దానిలో వాస్తవం ఎంత అన్నది కూడా మేధో మధనం జరుగుతోంది. ఒకటి రెండూ కాదు ఏకంగా వందలాది మహిళల శవాలు దిబ్బలుగా అక్కడ పేరుకు పోయాయట. వాటిని పూడ్చిన ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన సమాచారంతో ఇపుడు ఆధ్యాత్మిక లోకంతో పాటు అంతటా ప్రకంపనలు రేగుతున్నాయి.
1995 నుంచి ఇలాగే మహిళల శవాలు కనిపిస్తున్నాయని పూడ్చిపెడుతున్నానని సదరు పారిశుద్ధ్య కార్మికుడు చెప్పేసరికి దేశమంతా షాక్ తింది. ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఎంతో పవిత్రమైన క్షేత్రంలో అసలు ఏమి జరుగుతోంది అన్న చర్చ మొదలైంది. ఇంతకీ అక్కడ ఏమి జరుగుతోంది అది మిస్టరీనా లేక రియాలిటీనా అసలు అలాంటివి జరిగితే ఇన్నేళ్ళ పాటు బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఎలా మేనేజ్ చేయగలిగారు. ఇవన్నీ ప్రశ్నలు. వీటి వెనకాల ఎవరు ఉన్నారు అన్నది కూడా మరో కీలకమైన ప్రశ్నగా ముందుకు వస్తోంది.
తానే స్వయంగా వందలాది మహిళల శవాలను పాతిపెట్టాను అని సదరు పారిశుద్ధ్య కార్మికుడు చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఆలయ పరిసరాలలో ఈ శవాలను పూడ్చిపెట్టిన అతనికి కూడా మొదట్లో అవి ఆత్మహత్యకు గాని ప్రమాదవశాత్తు అక్కడ నేత్రావతి నదీలో పడి మరణించి ఉంటారేమో అన్న భావన ఉండేదట. కానీ రాను రానూ శవాలు గుట్టలు తేలడంతో పాటు ఒంటి మీద దెబ్బలు నగ్న దేహాలు ఇవన్నీ చూసిన తర్వాత మాత్రం ఏదో జరుగుతోంది అని భావించే గొంతు విప్పాడని అంటున్నారు.
తాను ఇన్నాళ్ళూ చేస్తున్న పని పట్ల అపరాధ భావంతో ఉన్నాను అని చెబుతూ పోలీసులకు ఆ కార్మికుడు ఫిర్యాదు చేశాడు. దాంతో విషయం లోకానికి తెలిసింది. ఇంతకీ ఈ ధర్మస్థల ఎక్కడ ఉంది ఏమా కధ అంటే ధర్మస్థల పవిత్ర క్షేత్రం హిందువులకు అత్యంత కీలకమైన ఆలయం. ధర్మష్తలి అన్నది కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో బెళ్తంగడి తాలూకాలో నేత్రావతి నదీతీరంలో ఉంది. ఇక ఇక్కడి గ్రామపంచాయితీ మండలంలో ఉన్న ఒకే ఒక పంచాయితీగా ధర్మస్థలని పేర్కొంటారు. అలా ఈ ధర్మస్థల గ్రామంలోనే ప్రఖ్యాతి చెందిన చెందిన ధర్మస్థల ఆలయం నెలకొని ఉంది.
ఇక అద్భుతమైన ప్రదేశంలో ఈ క్షేత్రం ఉంది. కర్ణాటక పశ్చిమ కనుమల మధ్యలో ఉన్న పవిత్ర ఆలయ ప్రాంతంగా ఇది భాసిల్లుతోంది. ఇక్కడ మంజునాథేశ్వర స్వామి వారు కొలువు ఉంటారు. ఒక విధంగా ఆధ్యాత్మిక తీర్థయాత్రా కేంద్రంగా ఇది ఉంది. అంతే కాదు భారత దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు ఇక్కడికి వస్తారు. అటువంటి ప్రఖ్యాతి క్షేత్రం మీద ఇపుడు వినవస్తున్న ఆరోపణలను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అంతటి పుణ్య క్షేత్రంలో హత్యలు జరిగాయా అని విస్తుబోతున్నారు.
ఈ ఆరోపణలు చేస్తున్న వ్యక్తికి ఆలయంతో ఎంతో సంబంధం ఉంది. ఆయన 1995 నుంచి 2014 వరకు ధర్మస్థల ఆలయంలో శానిటేషన్ ఉద్యోగిగా పనిచేసి ఉన్నాడు. అటువంటి వ్యక్తి మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత ఈ నెల 3న దక్షిణ కన్నడ జిల్లా పోలీసులకు అక్కడ హత్యల గురించి ఒక సంచలన ఫిర్యాదు చేశాడు. తన సర్వీసు కాలంలో దాదాపుగా వంద నుంచి మూడు వందల వరకూ మృతదేహాలను ఖననం చేశానని తెలిపాడు.
మరి ఇందులో ఉన్నవి అన్నీ కూడా మహిళలు మైనర్ బాలికలుగా ఆ కార్మికుడు చెప్పడం విశేషం. వీరి మీద లైంగిక దాడులు అలాగే యాసిడ్ దాడులు జరిగాయని స్పష్టంగా చెప్పాడు. ఇలా వెల్లువలా వచ్చి పడుతున్న మృత దేహాలను తాను అక్కడ నేత్రావతి నది ఒడ్డున కొన్ని, అలాగే, ఆలయం పక్కనున్న అడవుల్లో మరి కొన్ని పాతిపెట్టి నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక మరి కొన్ని సందర్భాల్లో ఏకంగా నదిలో విసిరేశానని వివరించాడు. తన వాదనకు బలంగా కొన్ని ఫోటోలు ఆధారాల్ని కూడా పోలీసులకు సమర్పించడం విశేషం.
ఆ కార్మికుడు కేవలం ఆరోపణలతో సరిపుచ్చలేదు. ఈ హత్యల వేనక ఆలయ అధికారులు ఉన్నారని కూడా చెబుతున్నాడు. తన నోరు విప్పితే హత్య చేస్తామని బెదిరించారని అందుకే అన్నేళ్ళ పాటు తాను ఆ హత్యల గురించి చెప్పలేదని అంటున్నాడు. ఇక గతంలో ఒకసారి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నం చేస్తే తనను తీవ్రంగా దాడికి గురి చేశారు అని చెప్పాడు. మళ్ళీ ఇన్నేళ్ళ తరువత తాను ఈ విషయం చెప్పడం వెనక తాను తప్పు చేశాను అన్న భావంతో అని చెప్పాడు. అయితే ఆ కార్మికుడు చెబుతున్న దాని మీద కూడా అనుమానాలు ఉన్నాయి.
ఇన్ని వందల హత్యలు జరిగితే మిస్సింగ్ కేసులు అయినా బయటకు రావాలి కదా అన్నది చర్చిస్తున్నారు. అంతే కాదు ఏ ఒక్క కేసు ఇన్నేళ్ళలో బయటపడకుండా ఉంటుందా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. అయితే కొన్ని విషయాలు చూస్తే అక్కడ హత్యలు ఎన్నో కొన్ని అయినా జరిగి ఉంటాయన్న అనుమానాలు కలుగుతున్నాయి.
కాస్తా వెనక్కి వెళ్తే సరిగ్గా 2012లో సౌజన్య అనే విద్యార్థిని హత్య ఆ రోజులలో దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. అలాగే అనన్య భట్ అనే వైద్య విద్యార్థిని మిస్సింగ్ కేసు సైతం అప్పట్లో వెలుగు చూసింది. ఈ కేసులో అయితే అనన్య భట్ తల్లి కోర్టును ఆశ్రయించి తన కూతురు అస్తికలు ఇప్పించాలని దీనంగా కోరిన సందర్భం కూడా ఉంది. వీటిని కనుక పరిశీలిస్తే ఆ కార్మికుడు చెప్పింది నిజమేనా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
అయితే ఈ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణల మీద కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగానే స్పందించింది. దాంతో ఈ నెల 19న సిట్ ని ఏర్పాటు చేసింది. ప్రణవ్ మోహంతి నేతృత్వంలోని ఈ బృందం నది పరిసరాల్లో తవ్వకాలతో పాటు ఆలయ ప్రాంగణాల్లో ఆధారాల సేకరణకు ఆ మీదట లోతైన విచారణను చేపట్టింది. అయితే మరో వైపు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గోపాల గౌడ్ పర్యవేక్షణలో ఈ ఘోరకలి మీద సమగ్రమైన సంపూర్ణమైన విచారణ జరిపించాలని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా డిమాండ్ వస్తోంది. అంతే కాదు అన్ని సంచలనాలు బయట పెట్టిన సదరు కార్మికుడికి పటిష్ట భద్రత కల్పించాలని కూడా కోరుతున్నారు.
అయితే మరో వైపు చూస్తే ఈ సంచలన ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర ఒకటి దాగి ఉందని బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి విమర్శించారు. కన్నడ నాట ధర్మస్థల ఒక పవిత్ర పుణ్యక్షేత్రమని ఆయన గుర్తు చేస్తున్నారు. అలాంటి ఆలయం పవిత్రతను దెబ్బ తీసే చర్యలుగా ఆయన పేర్కొంటున్నారు. ఇక ఆస్తిక జనుల విషయం తీసుకుంటే ఎవరో ఏదో ఆరోపణలు చేస్తే పవిత్ర క్షేత్రం మీద అనుమానాలు రేకెత్తిస్తారా అని అంటున్నారు. నిజంగా కనుక వందలాది మంది హత్యకు గురి అయితే ఈ పాతికేళ్ల కాలంలో బయటకు రాకుండా ఉంటుందా అని కూడా భక్తులు అంటున్నారు. అయితే ఇది మిస్టరీగా మిగిలిపోకుండా ఉండాలంటే విచారణ జరపాల్సిందే అని మేధావులు సహా అంతా అంటున్నారు.
