స్కూల్ బిల్డింగ్ పై కూలిన విమానం... ఆందోళనకరంగా 100 మంది పరిస్థితి!
అవును... బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం సోమవారం ఢాకాలో పాఠశాల భవనంపై కూలిపోయింది.
By: Tupaki Desk | 21 July 2025 4:54 PM ISTఇటీవల అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్స్ పై కూలిన ఘటన మరువక ముందే మరో షాకింగ్ ఘటన జరిగింది. ఇందులో భాగంగా... బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో స్థానిక మైల్ స్టోన్ స్కూల్ పై ఆ దేశ ఎయిర్ ఫోర్స్ కు చెందిన శిక్షణ యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ తోపాటు మరో విద్యార్థి మృతి చెందినట్లు తెలుస్తోంది. 100 మందికి గాయలైనట్లు సమాచారం.
అవును... బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం సోమవారం ఢాకాలో పాఠశాల భవనంపై కూలిపోయింది. ఈ ఘటనలో పైలెట్ తో పాటు ఒక విద్యార్థి మృతి చెందగా, 100 మంది గాయపడ్డారని తెలుస్తోంది. పాఠశాలలో విద్యార్థులు ఉన్న సమయంలోనే ప్రమాదం జరగడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటూ స్థానిక మీడియా వెల్లడించింది.
చైనాలో తయారైన ఎఫ్-7 జెట్ విమానం ఢాకాలోని ఉత్తర ప్రాంతంలోని మైల్ స్టోన్ స్కూల్ భవనంపైకి దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ప్రమాద స్థలిలో పెద్ద ఎత్తున మంటలు, పొగలు వ్యాపించినట్లు అక్కడి మీడియా వీడియో దృశ్యాలను ప్రసారం చేసింది. మరోవైపు ఈ ఘటనను బంగ్లాదేశ్ ఆర్మీ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు.
స్థానిక టెలివిజన్ ప్రసారం చేసిన దృశ్యాల్లో... కొంతమంది కాలిన గాయాలతో, మరికొంతమంది తీవ్ర రక్తస్రావంతో, గందరగోళం మధ్య విద్యార్థులు అదుపుతప్పి పరిగెడుతున్న దృశ్యాలు కనిపించాయి. అంబులెన్స్ లు వెంటనే అందుబాటులో లేకపోవడంతో ఆర్మీ సిబ్బంది, గాయపడిన విద్యార్థులను రిక్షా వ్యాన్ లలో ఆస్పత్రికి తరలించినట్లు చెబుతున్నారు.
ఈ సందర్భంగా... 30 మందికి పైగా గాయపడినవారిని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీలో చేర్చగా... మరికొందరిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారని డైలీ స్టార్ నివేదించింది. విమానం మూడు అంతస్తుల పాఠశాల భవనం ముందు భాగంలో కూలిపోయిందని పేర్కొంది.
కాగా... ఈ ఏడాది చైనా నిర్మిత ఎఫ్-7 విమానం కూలిపోవడం ఇది రెండోసారి. గత నెలలో మయన్మార్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-7 యుద్ధ విమానం సాగింగ్ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ మృతి చెందారు. ఈ క్రమంలో తాజాగా మరో ఎఫ్-7 యుద్ధ విమానం ఢాకాలో కూలిపోవడంతో బీజింగ్ ఉత్పత్తి చేసే రక్షణ పరికరాల నాణ్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
