గుర్తుంచుకోండి... ‘డాక్టర్’ ఫిజియోథెరపిస్ట్ కాదు..
ఇక ఫిజియోథెరపిస్టులు కొందరు కూడా డాక్టర్ ను తగిలించుకుంటూ ఉంటున్నారు. ఇకపై ఇది చెల్లదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) స్పష్టం చేసింది.
By: Tupaki Desk | 11 Sept 2025 3:36 PM ISTఎంబీబీఎస్ సాధించినవారు డాక్టర్ అని తమ పేరుకు ముందు పెట్టుకుంటారు.. కొందరు సాధించిన డాక్టరేట్ ను పేరు ముందు ఉంచుకుంటారు... ఇలాంటివారితో ఏ ఇబ్బందీ లేదు.. కానీ, కొందరు ఆర్ఎంపీలు సైతం డాక్టర్ అని పెట్టుకుంటుంటారు.. ఇది నిబంధనలకు విరుద్ధమే..! ఇక ఫిజియోథెరపిస్టులు కొందరు కూడా డాక్టర్ ను తగిలించుకుంటూ ఉంటున్నారు. ఇకపై ఇది చెల్లదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) స్పష్టం చేసింది.
ఫిజియోలంటే..??
డాక్టర్లు తమ దగ్గరికి వచ్చే రోగులను ఫిజియోల దగ్గరకు పంపుతారు. వీరికి వైద్యపరమైన సమస్యలను నిర్ధారణ చేయడంలో శిక్షణ ఉండదు. ఇదే విషయాన్ని డీజీహెచ్ఎస్ స్పష్టం చేసింది. ఫిజియోథెరపిస్టులను ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అందించడానికి అనుమతించొద్దని పేర్కొంది. అనుచిత ఫిజియోథెరపీ కారణంగా కొన్ని వ్యాధులు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గతంలో పట్నా, మద్రాస్ హైకోర్టులు, పలు కోర్టులు, వైద్య మండళ్లు ఇప్పటికే జారీ చేసిన ఉత్తర్వలను డీజీహెచ్ఎస్ తన ఉత్తర్వుల్లో వివరించింది. ఫిజియోథెరపిస్టులతో పాటు ఆక్యుపేషనల్ థెరపిస్టులు కూడా డాక్టర్ ను తమ పేరు ముందు వాడకుండా నిషేధించినట్లు పేర్కొంది.
మెడికల్ డిగ్రీలకు విరుద్దం...
ఫిజియోథెరపిస్టులు డాక్టర్ అని పేరు ముందు పెట్టుకోవడం మెడికల్ డిగ్రీలకు విరుద్ధమని డీజీహెచ్ఎస్ తేల్చి చెప్పింది. ఒకవేళ అలా పెట్టుకుంటే అది ప్రజలను తప్పుదోవ పట్టించడమే అని పేర్కొంది. నేరుగా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణకు కూడా ఫిజియోథెరపిస్టులను అనుమతించవద్దని, వైద్యులు పంపిన రోగులకు చికిత్స చేసేవరకే వీరు పరిమితం అని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఈ ఏడాది ఫిజియోథెరపీ పాఠాల్లో కూడా డాక్టర్ అనే పదాన్ని తొలగించాలని ఆదేశించింది. తాజా డీజీహెచ్ఎస్ నిర్ణయం వైద్య వర్గాల్లో చర్చకు కారణం అవుతోంది.
