విమానాల్లో కిటికీ తెరలు మూసి ఉంచాల్సిందే.. డీజీసీఏ అత్యవసర ఆదేశాలు!
విమానం టేకాఫ్ అయిన తర్వాత 10,000 అడుగుల ఎత్తుకు చేరే వరకు, ల్యాండింగ్ సమయంలో ఈ ఎత్తుకు దిగిన తర్వాత విండో షేడ్స్ మూసి ఉంచాలనే నిబంధన వర్తిస్తుంది.
By: Tupaki Desk | 24 May 2025 3:53 PM ISTపాకిస్తాన్‌తో ఇటీవల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) వాణిజ్య విమానయాన సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రక్షణ శాఖకు చెందిన వైమానిక స్థావరాల (డిఫెన్స్ ఎయిర్‌బేస్‌లు) సమీపంలో విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే సమయంలో విండో షేడ్స్ (కిటికీల తెరలు)ను తప్పనిసరిగా మూసివేయాలని సూచించింది. ముఖ్యంగా పాకిస్తాన్‌తో సరిహద్దును పంచుకునే పశ్చిమ భారత స్థావరాల వద్ద ఈ నిబంధనను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.
రక్షణ దృష్ట్యా కఠిన నిబంధనలు
విమానం టేకాఫ్ అయిన తర్వాత 10,000 అడుగుల ఎత్తుకు చేరే వరకు, ల్యాండింగ్ సమయంలో ఈ ఎత్తుకు దిగిన తర్వాత విండో షేడ్స్ మూసి ఉంచాలనే నిబంధన వర్తిస్తుంది. అయితే, అత్యవసర కిటికీల (ఎమర్జెన్సీ ఎగ్జిట్స్) దగ్గర మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉందని డీజీసీఏ తెలిపింది. పహల్గామ్ ఉగ్రదాడికి భారత బలగాలు 'ఆపరేషన్ సింధూర్'తో గట్టి బదులిచ్చిన తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఘర్షణలు తీవ్రమయ్యాయి. ఆ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా, దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో డీజీసీఏ ఇచ్చిన ఈ సూచనలకు అత్యధిక ప్రాధాన్యత ఏర్పడింది.
సైనిక స్థావరాల వద్ద ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీపై నిషేధం
డీజీసీఏ తన ప్రకటనలో మరో కీలక సూచన చేసింది. సైనిక స్థావరాల సమీపంలో ఉన్న విమానాశ్రయాల వద్ద ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీపై ఉన్న నిషేధం గురించి ప్రయాణికులకు ముందే తెలియజేయాలని విమానయాన సంస్థలకు ఆదేశించింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఎదుర్కోవాల్సిన కఠిన చర్యల గురించి కూడా ప్రయాణికులకు స్పష్టంగా వివరించాలని సూచించింది. ఈ చర్యలు కేవలం ఆపరేషనల్ సేఫ్టీకి మాత్రమే కాకుండా, ప్రయాణికులు తమకు తెలియకుండానే రక్షణపరమైన కీలక సమాచారాన్ని (మిలిటరీ ఇన్‌ఫర్మేషన్) బయట వ్యక్తులతో పంచుకోకుండా నిరోధించడానికి ఉద్దేశించినవి అని డీజీసీఏ వివరించింది.
కచ్చితంగా పాటించాల్సిన విమానాశ్రయాలు
లేహ్, శ్రీనగర్, జమ్ము, పఠాన్‌కోట్, ఆదంపుర్, చండీగఢ్, బఠిండా, జైసల్మేర్, నాల్, జోధ్‌పూర్, హిండన్, ఆగ్రా, కాన్పూర్, బరేలీ, మహారాజ్‌పూర్, గోరఖ్‌పూర్, భుజ్, లొహెగావ్, దాబోలిమ్ (గోవా), విశాఖపట్నం. ఈ విమానాశ్రయాలు ప్రధానంగా రక్షణ శాఖకు చెందిన ఎయిర్‌బేస్‌లకు సమీపంలో లేదా వాటితో అనుసంధానమై ఉన్నాయి.
భారత్-పాక్ గగనతల నిషేధం పొడిగింపు
ఈ పరిణామాల మధ్య, పాకిస్తాన్‌కు చెందిన విమానాలు భారత గగనతలాన్ని వినియోగించకుండా కేంద్ర ప్రభుత్వం మరోసారి నిషేధాన్ని పొడిగించింది. గతంలో విధించిన గడువు మే 23న ముగిసింది. ఈ నేపథ్యంలో నిషేధాన్ని జూన్ 23 వరకు పొడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా, భారత విమానాలకు గగనతలాన్ని మూసివేస్తూ పాకిస్తాన్ కూడా మరో నెల పాటు నిషేధాన్ని పొడిగించింది. జూన్ 24 తెల్లవారుజామున 4:59 గంటల వరకు తమ గగనతలంలో భారత విమానాలను నిషేధిస్తున్నట్లు పాకిస్తాన్ విమానాశ్రయ అధికారులు (PAA) వాయు సిబ్బందికి నోటీసులు జారీ చేశారు.
అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) నిబంధనల ప్రకారం.. ఒక నెల కంటే ఎక్కువ రోజులు గగనతలం వినియోగించకుండా అడ్డుకోవడం కుదరదు. అయినప్పటికీ, ఇరు దేశాలూ ఈ నిషేధాన్ని పరస్పరం పొడిగించుకుంటూ, దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయని స్పష్టం చేస్తున్నాయి.
