Begin typing your search above and press return to search.

చేతులు మాత్ర‌మే క‌లిశాయి.. మైల‌వ‌రంల్లో మార్పు వ‌స్తుందా?

మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. దేవినేని ఉమా. మ‌రొక‌రు ఇటీవ‌ల వైసీపీ నుంచి వ‌చ్చి టీడీపీ పంచ‌న చేరిన‌.. ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌.

By:  Tupaki Desk   |   22 April 2024 5:50 AM GMT
చేతులు మాత్ర‌మే క‌లిశాయి.. మైల‌వ‌రంల్లో మార్పు వ‌స్తుందా?
X

పై ఫొటోలో ఇద్ద‌రు కీల‌క టీడీపీ నేత‌లు చేయి చేయి బిగించుకుని.. క‌నిపిస్తున్నారు క‌దా! వారు ఎంతో అన్యోన్యంగా మారిపోయారని అనిపిస్తోంది క‌దా! కానీ..వారు చేతులు మాత్ర‌మే క‌లిపారు. మ‌న‌సులు క‌లుసుకునే ప‌రిస్థితిలో లేరు. మాట‌ల్లో ఉన్న మేలిమి త‌నం.. మ‌న‌సుల్లో క‌నిపించ‌డ‌మూ లేదు. వారే.. మైల‌వ‌రం నేత‌లు.. మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. దేవినేని ఉమా. మ‌రొక‌రు ఇటీవ‌ల వైసీపీ నుంచి వ‌చ్చి టీడీపీ పంచ‌న చేరిన‌.. ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌.

వీరిద్ద‌రి మ‌ధ్య కొన్ని ద‌శాబ్దాలుగా రాజ‌కీయ పోరు ఉంది. అది కూడా మైల‌వ‌రం టికెట్ గురించే. 2014లోనే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌.. ఈ టికెట్ కోసం ప్ర‌య‌త్నించారు. అప్ప‌ట్లో ఆయ‌న పార్టీలోనే ఉన్నారు. కానీ, చంద్ర‌బాబు ఇవ్వ‌లేదు. దీంతో ఆ ఎన్నిక‌ల్లోనే వ‌సంత‌.. దేవినేనికి వ్య‌తిరేకంగా అంత‌ర్గ‌తంగా పావులు క‌దిపార‌నే చ‌ర్చ జ‌రిగింది. ఇది చంద్ర‌బాబు వ‌ర‌కు కూడా వెళ్లింది. దీంతో పార్ట అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇస్తామ‌న్న ఎమ్మెల్సీ సీటును కూడా ఇవ్వ‌లేదు.

దీంతో 2014-2019 మ‌ధ్య వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ టీడీపీలోనే ఉన్నా.. విపక్ష నేత‌గా వ్య‌వ‌హ‌రించారు. టీడీపీ లోపాల‌ను వైసీపీకి చేర‌వేశార‌న్న విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. దీంతో సొంత పార్టీ నేతే అయినా.. వ‌సంత పై దేవినేని .. కోవ‌ర్టు అనే ముద్ర వేశారు.

అనంత‌ర కాలంలో వీరి మ‌ధ్య రాజ‌కీయ విభేదాలు మ‌రింత పెరిగి.. చివ‌ర‌కు వ‌సంత వైసీపీ బాట ప‌ట్టారు. గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. ఆశించిన మంత్రి ప‌ద‌వి ద‌క్క‌క పోవ‌డంతో వైసీపీలో మౌనంగా ఉన్నారు.

కానీ, నియోజ‌క‌వ‌ర్గంలో దేవినేని ఉమాపై అనేక విధాలుగా పోరాడారు. ఆయ‌న‌పై కేసులు కూడా పెట్టార‌ని.. ఉమానే చెప్పుకొచ్చారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు అదేవసంత టీడీపీ టికెట్ ద‌క్కించుకుని మైల‌వ‌రంలో దేవినేని ఉమాకు చెక్ పెట్టారు. ఇప్పుడు ఉమా స‌హ‌కారం లేక‌పోతే.. వ‌సంత గెలుపు అంత ఈజీకాద‌నేది అంద‌రికీ తెలిసిందే. దీంతో అనేక ప‌ర్యాయాలు..చంద్ర‌బాబు ఉమాతో చ‌ర్చ‌లు జ‌రిపి.. చివ‌ర‌కు చేతులు అయితే క‌లిపేలా చేశారు. చేతులు క‌లిసినా.. మ‌న‌సులో ఉన్న వ్య‌తిరేక‌తలు.. రాజ‌కీయ క‌క్ష‌లు మాత్రం తొలిగి పోలేద‌ని.. ఎడ‌మొహం పెడ‌మొహంగా ఉన్న వీరి ముఖాల‌ను చూస్తే అర్ధ‌మ‌వుతుంది.

మ‌రోవైపు.. ఇన్నాళ్లు త‌మ‌ను వేధించారంటూ.. క్షేత్ర‌స్థాయిలో దేవినేని కార్య‌క‌ర్త‌లు.. వ‌సంత‌కు అనుకూ లంగా ప‌నిచేసేందుకు ముందుకు రావ‌డం లేదు. ఉమా కూడా.. నిర్లిప్తంగానే ఉన్నారు. ఇది.. టీడీపీ గెలుపు అవ‌కాశాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపించేలా చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ నేప‌థ్యంలో ముందే చంద్ర‌బాబు వీరి మ‌ధ్య మ‌రింత స‌యోధ్య కుద‌ర్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు.