దేవినేని ఉమా...ఇలా అయిందేంటి చెప్మా ?
దేవినేని ఉమా మహేశ్వరరావు కరడు కట్టిన తెలుగుదేశం నాయకుడు. పార్టీని పసుపు జెండాను తనలో పూర్తిగా ఆవాహన చేసుకున్న వారు.
By: Tupaki Desk | 12 May 2025 5:00 PM ISTదేవినేని ఉమా మహేశ్వరరావు కరడు కట్టిన తెలుగుదేశం నాయకుడు. పార్టీని పసుపు జెండాను తనలో పూర్తిగా ఆవాహన చేసుకున్న వారు. పార్టీ కోసం ప్రాణం ఇస్తారు ఆయన రాజకీయం అక్షరాలా మూడు దశాబ్దాలకు చేరుకుంది. ఆయన రాజకీయాల్లోకి అనూహ్యంగా వచ్చారు.
ఆయన అన్న దేవినేని వెంకటరమణ మొదట టీడీపీ ఎమ్మెల్యేగా ఉండేవారు. ఆయనకు చంద్రబాబు కేబినెట్ లో ప్రాధమిక విద్యా శాఖ మంత్రిగా కీలక హోదా ఇచ్చారు. అయితే ఒక రైలు ప్రమాదంలో ఆయన మృతి చెందడంతో తమ్ముడుగా ఉమా రాజకీయ వారసత్వాన్ని అందుకున్నారు. ఇక 1999లో తొలిసారి నందిగామ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఉమా ఆ తరువాత 2004లో అదే సీటు నుంచి ఎమ్మెల్యే అయ్యారు.
ఇక నందిగామా రిజర్వుడు సీటు కావడంతో ఆయన 2009లో మైలవరానికి షీఫ్ట్ అయ్యారు. 2009లో ఆయన అక్కడ నుంచి గెలిచారు. ఇక 2014లో మరోసారి గెలిచి ఏపీలో విభజన తరువాత ఏర్పడిన బాబు సర్కార్ లో కీలకమైన జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
ఇలా నాలుగు సార్లు వరసగా గెలిచిన దేవినేని ఉమా 2019లో మాత్రం మైలవరం నుంచి ఓటమి పాలు అయ్యారు. 2024 లో మాత్రం ఆయనకు ఆ సీటు దక్కలేదు. వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన వసంత కృష్ణ ప్రసాద్ ఆఖరి నిముషంలో అలా వచ్చి దక్కించుకున్నారు. ఆ సమయంలో దేవినేని ఉమాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు.
కానీ కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఆయనకు మాత్రం ఏ పదవీ దక్కలేదు. ఇప్పటికి బాగానే ఎమ్మెల్సీ పదవులు భర్తీ చేశారు. కానీ ఉమాకు మాత్రం పదవి అంటూ రాలేదు. దాంతో ఆయన వర్గం నిరాశలో ఉంది. ఉమా అయితే చంద్రబాబుకు అత్యంత సన్నిహిత నేత. ఇటీవల ఆయన కుమారుడి పెళ్ళికి మంత్రి నారా లోకేష్ తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు.
అంతలా పార్టీలో అందరితోనూ మంచి సంబంధాలు ఉన్నా ఉమాకు పదవి దక్కక పోవడం ఎందుకు అంటే కుల సమీకరణలే అడ్డుగా ఉన్నాయని అటున్నారు. కమ్మ సామాజిక వర్గంలో చాలా మంది పోటీలో ఉన్నారు. క్రిష్ణా గుంటూరులలో నేతల మధ్య బాగా పోటీ ఉంది. దాంతో ఉమాకు అదే ప్రతిబంధకంగా ఉంది. అయితే చంద్రాబు లోకేష్ బాబుల వల్ల తనకు ఏదో నాటికి మంచి పదవి దక్కుతుందని ఉమా భావిస్తున్నారు.
అయితే సామాజిక సమతూకాన్ని పూర్తిగా అమలు చేసుకుంటూ రావడంతో పొత్తులలో కొన్ని పదవులు మిత్రులకు ఇస్తూ పోవడం క్రిష్ణా జిల్లాలో బలమైన పోటీ ఉండడంతో ఉమాకు ఈ టెర్మ్ లో ఏదైనా పదవి దక్కుతుందా అన్నది అంతా ఆలోచిస్తున్నారు. ఆరు పదుల వయసు దాటిన ఉమా ఇపుడు కీలక దశలో రాజకీయంగా ఉన్నారు 2029 ఎన్నికల నాటికి ఆయనకు సీనియర్ గా టికెట్ ఇస్తారా లేదా అన్నది మరో చర్చగా ఉంది. ఏది ఏమైనా ఉమా రాజకీయం కృష్ణా తీరంలో ఏ మలుపు తిరుగుతుందో అన్న చర్చ అయితే అంతటా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
