Begin typing your search above and press return to search.

దేవాన్ష్ పేరుతో పుష్కర్ ఘాట్.. మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ ఆర్డర్స్

ఈ విషయం కాస్తా మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లడంతో ఆయన తక్షణమే స్పందించారు. అధికారుల ఉత్సాహంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

By:  Tupaki Political Desk   |   6 Jun 2026 3:06 PM IST
దేవాన్ష్ పేరుతో పుష్కర్ ఘాట్.. మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ ఆర్డర్స్
X

ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు, మంత్రి లోకేశ్ కుమారుడు దేవాన్ష్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. అంతర్జాతీయ చెస్ చాంపియన్ పోటీల్లో ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ గా రికార్డు సృష్టించిన దేవాన్ష్ ఆ తర్వాత సొంతంగా యూట్యూబ్ చానల్ ప్రారంభించి డైనోసార్స్ కోసం పాఠాలు చెబుతూ ఆకట్టుకున్నారు. ఇలా సొంతంగా తన ప్రతిభతో ఒకవైపు వార్తల్లో నిలుస్తుంటే, ఆయనను పొగుడుతూ రాజకీయంగా ఎదగాలని కొందరు టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల నిర్వహించిన మహానాడు వేదికపై దేవాన్ష్ ను ఎన్టీఆర్ తో పోల్చి ఓ నేత ప్రసంగించిన వీడియో వైరల్ అయింది. ఇక తాజాగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొందరు పార్టీ నేతలు మరింత అత్యుత్సాహం ప్రదర్శించి మంత్రి లోకేశ్ తో చీవాట్లు తిన్నారని అంటున్నారు.

వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల్లో ఒక ఘాట్ కు దేవాన్ష్ పేరు పెట్టడం హాట్ టాపిక్ అయింది. గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది జరగనుండా, ముందస్తు ఏర్పాట్లను ప్రభుత్వం అత్యంత వేగంగా చేస్తోంది. ఇందులో భాగంగా కొన్ని చోట్ల మోడల్ పుష్కర ఘాట్లను ఏర్పాటు చేస్తోంది. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గోదావరి పరివాహక ప్రాంతాల్లో పర్యటించి పుష్కరాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. త్వరలో మళ్లీ తాను వస్తానని ఈ లోగా పనులలో పురోగతి కనిపించాలని ఆదేశించారు. దీంతో అధికారులు ఆఘమేఘాలపై పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి పుష్కర్ ఘాట్ వద్ద ఊహించని విధంగా ఒక బోర్డు వెలిసింది. మునికూడలిలో నిర్మిస్తున్న మోడల్ గ్రామీణ పుష్కర ఘాట్‌కు దేవాన్ష్ పేరు పెట్టడం వైరల్ అయింది. ఈ ఘాట్ ను ఇటీవల జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ 'దేవాన్ష్ ఘాట్' అని రాసి ఉన్న బోర్డు కనిపించింది. దీంతో ఆ ఫొటో నెట్టింట వైరల్ అయింది.

తీవ్రంగా స్పందించిన మంత్రి లోకేష్

ఈ విషయం కాస్తా మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లడంతో ఆయన తక్షణమే స్పందించారు. అధికారుల ఉత్సాహంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది.. ఏ పుష్కర ఘాట్‌కు కూడా దేవాన్ష్ పేరు పెట్టడానికి వీల్లేదు’ అని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ అధికారిక పనులకు లేదా ఘాట్లకు ఇలా తమ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టడం కరెక్ట్ కాదనే సంకేతాన్ని లోకేష్ స్పష్టంగా ఇచ్చారని అంటున్నారు. అంతేకాదు, ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన దృష్టికి తీసుకువచ్చిన నెటిజన్లకు మంత్రి లోకేష్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం విశేషం.

ఘాట్ వద్ద పనులు ముమ్మరం

మరోవైపు, ఈ వివాదం పక్కన పెడితే.. మునికూడలి ఘాట్ వద్ద పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 24న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆ లోపే ప్రాథమిక ఏర్పాట్లు పూర్తి చేయాలని చూస్తున్నారు. గోదావరి హారతి కోసం ప్రత్యేక వేదిక, భక్తుల కోసం మరుగుదొడ్లు, తాగునీరు, బట్టలు మార్చుకునే గదులు, వైద్య శిబిరాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు.