చిచ్చర పిడుగు లోకేశ్ కొడుకు.. తండ్రికి తగ్గట్లే వరల్డ్ రికార్డు
By: Tupaki Desk | 14 Sept 2025 4:31 PM ISTనారా వారి వారసుడు మంత్రి లోకేశ్ కుమారుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మనవడు దేవాన్ష్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. తాతకు తగ్గ మనవడిగా తండ్రి మెచ్చిన తనయుడిగా అరుదైన ఘనత సాధించాడు. ఫాసెస్ట్ చెక్ మెట్ సాల్వర్ గా వరల్డ్ బుక్ ఆప్ రికార్డ్స్ ను సొంతం చేసుకున్నాడు దేవాన్ష్. తల్లిదండ్రులు లోకేశ్, బ్రహ్మణితో కలిసి లండన్ వెళ్లిన దేవాన్ష్ వెస్ట్ మినిస్టర్ హాల్లో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలో ప్రముఖుల చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నాడు.
దేవాన్ష్ కు అవార్డు రావడం పట్ల మంత్రి నారా లోకేశ్ ఆనందం వ్యక్తం చేశారు. లోకేశ్ అధికారిక ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ ‘మా లిటిల్ ఛాంపియన్, మరోసారి గర్వపడేలా చేశాడు’’ అని భావోద్వేగంతో పోస్టు చేశారు. వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్‌గా ప్రపంచ రికార్డును నెలకొల్పడం తనను ఎంతోగానో ఆకట్టుకుందని, ఈ అవార్డు అందుకోవడానికి లండన్ రావడం సంతోషంగా ఉందని చెప్పారు లోకేశ్. ఇదో ప్రత్యేకమైన ఘనతగా లోకేశ్ అభిప్రాయపడ్డారు. అటు దేవాన్ష్ అవార్డ్ పై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు వరల్డ్ లీడర్, ఆయన మనవడు వరల్డ్ రికార్డ్ హోల్డర్ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
గత ఏడాది హైదరాబాద్ ఎన్టీఆర్ భవనలో వరల్డ్ చాంపియన్ చెస్ పోటీలు నిర్వహించారు. డిసెంబరులో జరిగిన ఈ పోటీల్లో దేవాన్ష్ ప్రతిభ చాటుకున్నారు. చదరంగంలో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్ ను వేగంగా పరిష్కరించారు. ఇందుకోసం కేవలం 11 నిమిషాల 59 సెకన్ల సమయం మాత్రమే తీసుకున్నారు. తొమ్మిదేళ్ల వయసులోనే ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ - 175 పజిల్స్ అవార్డుకు ఎంపికయ్యాడు. అప్పట్లో దేవాన్ష్ ఆట చూసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వెళ్లారు. ఇక తాజాగా లండన్ లో జరిగిన అవార్డు ప్రదానోత్సవానికి మంత్రి లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి వెళ్లారు.
