Begin typing your search above and press return to search.

కూటమి ప్రభుత్వంలో పవన్ మరో రికార్డు.. పరిపాలనలో పవర్ ఫుల్ మార్క్

పాలనా రంగంలో కేవలం రెండేళ్ల అనుభవం మాత్రమే ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ పనితీరుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలతోపాటు అటవీ పర్యావరణ శాఖలను పవన్ పర్యవేక్షిస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   15 July 2026 11:00 PM IST
కూటమి ప్రభుత్వంలో పవన్ మరో రికార్డు.. పరిపాలనలో పవర్ ఫుల్ మార్క్
X

పాలనా రంగంలో కేవలం రెండేళ్ల అనుభవం మాత్రమే ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ పనితీరుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలతోపాటు అటవీ పర్యావరణ శాఖలను పవన్ పర్యవేక్షిస్తున్నారు. అయితే బాధ్యతలు చేపట్టిన రెండేళ్ల వ్యవధిలోనే ఆయా శాఖల పనితీరులో పవన్ తనదైన మార్క్ వేశారని అభినందనలు అందుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాలు, ఎత్తైన కొండల్లో నాణ్యమైన రోడ్ల నిర్మాణంతోపాటు పంచాయతీ పాలనలో పారదర్శకత తీసుకువచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక మ్యాజిక్ డ్రైన్లు అనే కొత్త కాన్సెప్టుతో గ్రామాల్లో పారిశుధ్య పరిరక్షణకు పవన్ శ్రీకారం చుట్టారు. అదే సమయంలో స్వచ్ఛ రథాలను ఏర్పాటు చేసి కేవలం ఏడాదిలోనే గ్రామీణ ప్రాంతాల నుంచి కోటి కేజీల పొడి వ్యర్థాలను సేకరించారు. వీటి విలువ సుమారు రూ.16 కోట్లు ఉంటుందని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్ వేదికగా ప్రకటించింది.

గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ ప్రక్రియను ప్రభుత్వం ఎప్పటి నుంచో అమలు చేస్తుంది. కానీ, ఇన్నాళ్లు అదో మొక్కుబడి తంతుగానే కొనసాగింది. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోనే 2014-19 మధ్య గ్రామగ్రామాన చెత్త సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. చెత్త నుంచి సంపద సృష్టించాలని మార్గనిర్దేశం చేశారు. కానీ, ముఖ్యమంత్రి అనుకున్నట్లు అప్పట్లో చెత్త సేకరణ కేంద్రాల నుంచి ఫలితాలు సాధించలేకపోయారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అయితే ఈ దిశగా సరైన ఆలోచన కూడా చేయలేదనే విమర్శలు ఉన్నాయి. కానీ, ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ పూర్తిగా భిన్నమైన మార్గంలో సిబ్బందిని నడిపిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారని అంటున్నారు.

గ్రామాల్లో పారిశుధ్య పరిరక్షణ కోసం ప్రధానంగా చెత్త ఎక్కడిపడితే అక్కడ వేయకుండా ఉప ముఖ్యమంత్రి పవన్ గత ఏడాది జులైలో స్వచ్ఛరథం అనే పథకంతో వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇళ్లల్లో పనికి రాని, వృథాగా పారబోయాల్సిన వస్తువులను సేకరించి వాటికి సరుకులు ఇచ్చే విధానాన్ని ఏడాదిగా అమలు చేస్తున్నారు. ఈ పథకం గ్రామాల్లో బాగా ఆదరణ పొందుతోంది. దీంతో గత రెండేళ్లలో దాదాపు కోటి కేజీల పొడి వ్యర్థాలను సేకరించి చారిత్రాత్మక మైలురాయి స్థాపించిందని డిప్యూటీ సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం కృషి చేసిన ఆపరేటర్లు, గ్రామ పంచాయతీలు, గ్రీన్ అంబాసిడర్లు, ప్రజలను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందించారు.

పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ వ్యర్థాల నిర్వహణలో ‘‘స్వచ్ఛరథం’’ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్షేత్ర స్థాయి సిబ్బంది అంకితభావం, ప్రజల భాగస్వామ్యంతోనే అద్భుత ఫీట్ సాధ్యమైందని పవన్ కొనియాడారు. గత రెండేళ్లలో స్వచ్చరథం కార్యక్రమం ద్వారా కోటి కేజీల పొడి వ్యర్థాల సేకరణ విజయవంతంగా పూర్తి చేయడమే కాకుండా సుమారు రూ. 16 కోట్ల విలువైన డ్రై వేస్ట్ రీ సైక్లింగ్ చేపట్టి చెత్త నుండి సంపద సృష్టించామని, తద్వారా ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడిందని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. గత ఏడాది జులై 10వ తేదీన గుంటూరు జిల్లా, లాల్ పురంలో స్వచ్ఛరథం కార్యక్రమం ప్రారంభమైంది. తడి, పొడి వ్యర్థాల వర్గీకరణ పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించే ఆలోచనతో ఈ పథకాన్ని తీసుకువచ్చారు. ముందుగా పైలట్ ప్రాజెక్టుగా గుంటూరులో ప్రవేశపెట్టిన ఈ పథకం ఈ ఏడాది ఏప్రిల్ నుంచే రాష్ట్రవ్యాప్తంగా అమలు అవుతుండటం గమనార్హం.