Begin typing your search above and press return to search.

టీడీపీ ఎమ్మెల్యే బొండా కామెంట్స్ ఎఫెక్ట్.. డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ యాక్షన్

కాలుష్యంపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యల వేడి ఇంకా చల్లారలేదు.

By:  Tupaki Desk   |   23 Sept 2025 10:50 AM IST
టీడీపీ ఎమ్మెల్యే బొండా కామెంట్స్ ఎఫెక్ట్.. డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ యాక్షన్
X

కాలుష్యంపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యల వేడి ఇంకా చల్లారలేదు. కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ క్రిష్ణయ్య తీరుపై ఎమ్మెల్యే ఉమ తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరును ఆయన ప్రస్తావించడంతో కూటమి ప్రభుత్వంలో అగ్గి రాజేసింది. ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ తోపాటు సీఎంవో కూడా సీరియస్ గా తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో చర్చ జరిగిన వెంటనే పవన్ తన ఫేసీలో పీసీబీ ఉన్నతాధికారులతో భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యే అలా ఎందుకు మాట్లాడారని తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్, ఆయనపై సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది.

ఈ చర్చ తర్వాత అసెంబ్లీకి రెండు రోజుల విరామం రాగా, సోమవారం మళ్లీ సభా కార్యక్రమాలు మొదలైన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్యే ఉమా వ్యాఖ్యలను తేలికగా తీసుకోని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం కూడా అసెంబ్లీలో తన చాంబర్ లో అటవీశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ క్రిష్ణతేజతో సమావేశమయ్యారు. కాలుష్య నియంత్రణ మండలిపై టీడీపీ ఎమ్మెల్యే బొండా విమర్శలు చేసిన విషయం వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ‘పీసీబీ’లో ప్రభుత్వ పర్యవేక్షణ పాక్షికంగా ఉంటుంది. పంచాయతీరాజ్ వంటి శాఖలపై ప్రభుత్వ పర్యవేక్షణ, నియంత్రణ ఉంటుంది. అందుకు భిన్నంగా పీసీబీ నిర్ణయాలు, విధులపై కొన్ని పరిమితులు ఉన్నాయి. పీసీబీకి చట్టబద్ద అధికారాలు ఉన్నాయి’ అని వారు పవన్ కు వివరించినట్లు చెబుతున్నారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, రాష్ట్రానికి పెట్టుబడులను ప్రోత్సహిస్తూనే, కాలుష్య నియంత్రణకు నిబంధనలు అమలు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పారిశ్రామికవేత్తలు పారిపోయేలా చేసే పరిస్థితి తేకూడదని పవన్ అభిప్రాయపడినట్లు సమాచారం. కూటమి పాలన ప్రారంభంలోనే పీసీబీపై సమీక్షించి అన్ని విషయాలు నిర్దేశించాం.. రాష్ట్రంలో కాలుష్యం, పర్యావరణ కార్యక్రమాల్లో యువత, విద్యార్థులను భాగస్వాములు చేయాలని నిర్ణయించినట్లు పవన్ చెప్పారు. పీసీబీని అడ్డుపెట్టుకుని వ్యక్తిగత ప్రయోజనాలను పొందాలని భావించే వారితో జాగరూకతతో వ్యవహరించాలి. పీసీబీ సిబ్బంది, వారి విధులేమిటి? కాంట్రాక్ట్ సిబ్బంది బాధ్యతలు ఏంటి? పీసీబీకి ఆర్థిక వనరులు ఏంటి? వాటిని ఆడిట్ ఏ విధంగా చేస్తున్నారు? అంటూ పవన్ ప్రశ్నించినట్లు చెబుతున్నారు.

అదేవిధంగా ఇప్పటివరకు పీసీబీ పరిశోధన, అభివృద్ధిపై ఏ మేరకు ద్రుష్టి సారించారు? జల, వాయు, శబ్ద కాలుష్య వివరాలను ప్రాంతాల వారీగా అప్డేట్ చేస్తున్నారా? అన్న సమాచారం అందుబాటులో ఉంటుందా? అంటూ పవన్ ప్రశ్నలు సంధించారని అంటున్నారు. వీటిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారని చెబుతున్నారు. మొత్తానికి టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ లేవనెత్తిన ప్రశ్నలు, చేసిన విమర్శలు పీసీబీని గట్టిగానే తాకినట్లు ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ పీసీబీ విధులు, బాధ్యతలపై ఫుల్ ఫోకస్ చేయడంతో కాలుష్య నియంత్రణ మండలిలో ఊహించని మార్పులు చేర్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.