హైదరాబాద్ లో భారీ సైబర్ మోసం.. ఎన్ని కోట్లంటే..!
గత కొంతకాలంగా ప్రజలకు అత్యంత తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్న అంశాల్లో సైబర్ నేరం ఒకటనే సంగతి తెలిసిందే.
By: Raja Ch | 30 Nov 2025 1:22 PM ISTగత కొంతకాలంగా ప్రజలకు అత్యంత తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్న అంశాల్లో సైబర్ నేరం ఒకటనే సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. వీటిని ఆపేందుకు ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం ఎన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా ఏదో ఒకమూల ప్రజలు ఈ సైబర్ నేరాల బారిన పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ లో భారీ సైబర్ మోసం వెలుగు చూసింది.
అవును... ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, అలసత్వం వహించినా సైబర్ నేరగాళ్లు గోతికాడ నక్కలా కాసుకుని కూర్చుంటున్నారు.. వెంటనే పని మొదలుపెడుతున్నారు. వీరి భారిన ఇప్పటికే ఎంతో మంది పడి, ఆర్థికంగా తీవ్రమంగా నష్టపోగా.. తాజాగా హైదరాబాద్ లోని ఓ డాక్టర్ వారి బారిన పడ్డారు. ఈ సమయంలో... తాజా ఘటన తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద సైబర్ మోసంగా భావిస్తున్నారు!
వివరాళ్లోకి వెళ్తే... హైదరాబాద్ లోని హబ్సిగూడకు చెందిన ఓ డెంటల్ డాక్టర్ తాజాగా సైబర్ నేరగాళ్ల భారిన పడ్డారు. ఆయనకు ఇటీవల ఫేస్ బుక్ లో ఒక మెసేజ్ వచ్చింది. మోనికా మాధవన్ అనే పేరుతో ఒక మహిళ నుంచి అతనికి ఈ మెసేజ్ వచ్చింది. ఇందులో భాగంగా.. తాను పెళ్లి పేరుతో మోసపోయానని.. కష్టాల్లో ఉన్న తనను ఆదుకోవాలని ఆ మెసేజ్ లో పేర్కొంది.
ఈ క్రమంలో.. మాటల్లో మాట కలిపిందో ఏమో కానీ టెలీగ్రామ్ ఐడీతో సంప్రదింపులు జరుపుదామని తెలిపింది. అయితే.. ఆమె నిర్ణయానికి సదరు డెంటల్ డాక్టర్ సమ్మతించడంతో వారిద్దరి మధ్యా సంభాషణలు పెరిగాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. తనకు షేర్ ట్రెడింగ్ లో బాగా అనుభవం ఉందని ఆమె డాక్టర్ కు చెప్పుకొచ్చిందట.
అంతేకాకుండా... విదేశాల్లో ఉన్న స్టాక్ ఎక్స్ చేంజ్ లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ వైద్యుడిని నమ్మించింది. ఈ క్రమంలో తొలుత డాక్టర్ ను నమ్మించేందుకు పెద్ద మొత్తంలో లాభాలు ఆశ చూపెట్టింది. అయితే.. ఆ మొత్తం డబ్బులు విత్ డ్రా చేసుకోవాలంటే ట్యాక్స్ కట్టాలని మొదలుపెట్టింది. ఈ క్రమంలో సుమారు రూ.మూడున్నర కోట్లు కొట్టేసింది.
అలా అని ఆ ఒక్కసారితోనే అయిపోయిందనుకుంటే పొరపాటే సుమా! ఇలా రకరకాల కారణాలు చెప్పి, మొత్తం 91 విడతల్లో రూ.14 కోట్లకు పైగా కాజేసింది! దీంతో... తాను మోసపోయానని భావించిన సదరు డాక్టర్... వెంటనే పోలీసులను ఆశ్రయించారు. దీంతో... ఈ వ్యవహారమపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
