‘ప్రజాస్వామ్య’ శకటం.. ఇక్కడా కేసీఆర్ కు సంకటం
కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే.. ఈ మేరకు అప్పటివరకు సీఎం అధికారిక నివాసంగా ఉన్న ప్రగతి భవన్ గేట్లను బద్దలు కొట్టించారు.
By: Tupaki Desk | 15 Jan 2024 8:00 AM ISTతెలంగాణలో ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇవాళ్టికి నెల మీద వారం రోజులు. ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ సీఎంగా మారిపోయారు. టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఎన్నికల ప్రచారం సమయంలో సర్కారు ఏర్పడిన వెంటనే రేవంత్ రెడ్డి టీమ్ చేసిన ప్రచారం.. ‘ప్రజా ప్రభుత్వం’ తీసుకొస్తామని. దీని ఉద్దేశం.. కేసీఆర్ నియంత తరహాలో పాలన సాగించారని, ప్రజలను కలుసుకోలేదని, ప్రజాస్వామ్య వ్యవస్థలు, వ్యక్తుల గొంతునొక్కారని, తాము గెలిస్తే అందరూ గళం వినిపించే అవకాశం ఇస్తామని చెప్పడం. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే.. ఈ మేరకు అప్పటివరకు సీఎం అధికారిక నివాసంగా ఉన్న ప్రగతి భవన్ గేట్లను బద్దలు కొట్టించారు.
అనంతరం ఆ భవన్ పేరును ప్రజా భవన్ గా మార్చారు. ప్రజా పాలనలో భాగంగా సమస్యలపై దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. మరోవైపు ప్రజా పాలనలో భాగంగా గత 28 నుంచి ఈ నెల 6 వరకు ఆరు గ్యారెంటీలు, వివిధ అంశాలపై దరఖాస్తులు తీసుకున్నారు. గణతంత్రంలో ప్రతిబింబం భారత దేశం గణతంత్ర (రిపబ్లిక్) దేశంగా ఆవిర్భవించిన నేపథ్యంలో ఏటా జనవరి 26న గణతంత్ర వేడుకలు నిర్వహిస్తుంటారు.
ఇందులో సమాఖ్య వ్యవస్థకు ప్రతిబింబంగా రాష్ట్రాల ప్రాతినిధ్యానికి అవకాశం కల్పిస్తారు. ఆ సందర్భంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తమ పరిపాలనలో సాధించిన ప్రగతిని చాటేలా శకటాలను రూపొందించి ప్రదర్శనలో పాల్గొంటాయి. ఈ ఏడాది గణతంత్ర వేడుకల కవాతుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర శకటాలు ఎంపికయ్యాయి. అయితే, తెలంగాణ శకటం పేరు ‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’ కావడమే ఇక్కడ ప్రత్యేకత.
చాకలి ఐలమ్మ, కొమరం భీం, రాంజీ గోండు తదితర పోరాట యోధులతో ఈ శకటాన్ని ఏర్పాటు చేశారు. దీనికి కేంద్ర రక్షణ శాఖ ఆమోదం లభించింది. ప్రదర్శన సమయంలో దానికి ఇరువైపులా రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా కొమ్ముకోయ, గుస్సాడి, డప్పు నృత్యాల కళాకారుల ప్రదర్శన ఉంటాయి. ఇవన్నీ గిరిజన సంప్రదాయాన్ని చాటేవే. నాలుగేళ్ల తర్వాత.. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి 2015లో రిపబ్లిబ్ డే పరేడ్ లో పాల్గొనే అవకాశం దక్కింది.
ఆ తరవాత ఐదేళ్లు గ్యాప్ వచ్చింది. 2020 అనంతరం మళ్లీ ఈ ఏడాది శకటం ప్రదర్శనకు అనుమతి దక్కింది. కాగా.. నాలుగేళ్ల తర్వాత కేసీఆర్ ప్రభుత్వం మారిన తర్వాత వస్తున్న రిపబ్లిక్ డే పరేడ్ లోనే తెలంగాణ శకటానికి అవకాశం దక్కడం గమనార్హం. దీనిని తమ ఉద్దేశాలను చాటేలా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ సర్కారు అనుకూలంగా ఉపయోగించుకోవడ విశేషం. కాగా, రిపబ్లిక్ డే పరేడ్ కు ఏపీ శకటం కూడా ఎంపికైంది. ‘డిజిటల్ క్లాస్ రూమ్’ ఆ శకటం థీమ్. ఏపీలోని వైఎస్ జగన్ సర్కారు 62 వేల డిజిటల్ క్లాస్ రూమ్ ల ద్వారా విద్యా బోధన సాగిస్తోంది. ఇదే అంశాన్ని చాటేలా శకటం రూపొందించింది.
