Begin typing your search above and press return to search.

షాకింగ్... బీ-52 బాంబర్ యుద్ధ విమానాన్ని ఢీకొట్టబోయిన విమానం!

ఈ సమయంలో... యుద్ధ విమానం తమకు ఎదురుగా వస్తున్నట్లు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదని డెల్టా విమాన పైలట్ పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   21 July 2025 3:18 PM IST
షాకింగ్... బీ-52 బాంబర్  యుద్ధ విమానాన్ని ఢీకొట్టబోయిన విమానం!
X

గాల్లో రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొంటే ఏమవుతుంది.. ఇదే క్రమంలో ఓ ప్రయాణికుల విమానం, యుద్ధ విమానం ఢీకొంటే..? అలాంటి ఘోరం తృటిలో తప్పిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో డెల్టా ఎయిర్ లైన్స్ కు చెందిన ఆ విమానంలో పరిస్థితిని వివరించిన ఓ పాసింజర్ ఆడియో నెట్టింట వైరల్ గా మారింది.

అవును... ఓ ప్రయాణికుల విమానానికి, ఓ భారీ యుద్ధ విమానం ఎదురైంది. డెల్టా ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన విమానానికి తృటిలో ఘోర ప్రమాదం తప్పిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా... ఇటీవల మిన్నియాపొలిస్‌ నుంచి మైనట్‌ కు వెళ్తున్న డెల్టా ఎయిర్‌ లైన్స్‌ విమానానికి, బీ 52 బాంబర్‌ యుద్ధ విమానం ఎదురుగా వచ్చింది.

ఈ సమయంలో... యుద్ధ విమానం తమకు ఎదురుగా వస్తున్నట్లు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదని డెల్టా విమాన పైలట్ పేర్కొన్నారు. దీంతో ఆ సమయంలో ప్రమాదాన్ని తప్పించడానికి విమానాన్ని వేగంగా మరోవైపునకు మళ్లించినట్లు తెలిపారు. విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయిన తర్వాత ఈ విషయాన్ని ప్రయాణికులకు చెప్పి క్షమాపణలు కోరారు.

ఆ సమయంలో ప్రమాదం గురించి పైలట్‌ ప్రకటన చేస్తున్న సమయంలో ఆడియో రికార్డు చేసిన ఓ పాసింజర్ దాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో ఇది వైరల్‌ గా మారింది. ఈ సందర్భంగా... యుద్ధ విమానం ఒక్కసారిగా తమవైపు దూసుకురావడంతో విమానాన్ని వేగంగా మరోవైపు తిప్పినట్లు తెలిపారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

దీనిపై స్కైవెస్ట్ ఎయిర్‌ లైన్స్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా... జూలై 18న మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్ నుండి ఉత్తర డకోటాలోని మినోట్‌ కు డెల్టా కనెక్షన్‌ గా పనిచేస్తున్న స్కైవెస్ట్ విమానం 3788 సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని తెలిపింది. అయితె... మార్గంలో మరొక విమానం కనిపించినప్పుడు గో-రౌండ్ చేసిందని తెలిపింది.

కాగా... మినోట్ ఎయిర్ ఫోర్స్ బేస్ 5వ బాంబ్ వింగ్, 91వ మిస్సైల్ వింగ్ లకు నిలయంగా ఉంది. అయితే ఈ ప్రాంతంలో సైనిక, పౌర విమాన మార్గాలు రెండూ సమీపంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో... ఈ సంఘటన సైనిక వైమానిక స్థావర వినియోగదారులు, పౌర విమానాల మధ్య సమన్వయం గురించి ప్రశ్నలను లేవనెత్తింది!