భారత్ లో సీఈఓల సగటు జీతంపై డెలాయిట్ ఆసక్తికర విషయాలు!
ఈ సందర్భంగా వెల్లడించిన వివరాల్లో... సీఈఓల సగటు వేతనంతో పోలిస్తే ప్రమోటర్ల సగటు వేతనం ఎక్కువగా ఉంటుందని తెలిపింది
By: Tupaki Desk | 9 April 2024 9:57 AM ISTకంపెనీల్లో ట్రైనీ, రెగ్యులర్ ఉద్యోగి, టీం లీడర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ ఇలా ఎన్ని పోస్టులు ఉన్నా.. వారందరికీ పైన ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈఓ) ఉంటారనేది తెలిసిన విషయమే! ఈ క్రమంలో భారతదేశంలో సీఈఓల సగటు జీతం ఎంత ఉంటుంది.. కోవిడ్ తర్వాత పరిస్థితి ఎలా మారింది.. అనే విషయాలను తాజాగా డెలాయిట్ ఇండియా వెల్లడించింది.
అవును... భారతదేశంలో కార్పొరేట్ కంపెనీల సీఈఓ ల సగటు వేతనం 13.8 కోట్ల రూపాయలకు చేరిందని.. కరోనాకు ముందు పరిస్థితులతో పోలిస్తే ఇది సుమారు 40% అధికమని "డెలాయిట్ ఇండియా ఎగ్జిక్యూటివ్ పర్ఫామెన్స్ అండ్ రివార్డ్ సర్వే 2024"ను రూపొందించిన సంస్థ తెలిపింది. దీనికోసం సుమారు 400కు పైగా సంస్థల నుంచి వివరాలు సేకరించినట్లు చెబుతున్నారు!
ఈ సందర్భంగా వెల్లడించిన వివరాల్లో... సీఈఓల సగటు వేతనంతో పోలిస్తే ప్రమోటర్ల సగటు వేతనం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఇందులో భాగంగా... సీఈఓల సగటు వార్షిక వేతనం రూ.13.8 కోట్లుగా ఉండగా.. ప్రమోటర్లు, ప్రమోటర్ల కుటుంబానికి చెందిన సీఈఓలకు మాత్రం సగటున రూ.16.7 కోట్ల వేతనం ఉంటోంది. అందుకు గల కారణాలున్నాయని తెలిపింది.
ఇందులో భాగంగా... ప్రమోటర్ సీఈఓల మొత్తం పదవీకాలం కారణంగా ప్రమోటర్ సీఈఓల కంటే వృత్తిపరమైన సీఈఓలు చాలా తరచుగా మారుతుండటమే దీనికి కారణం అని చెబుతున్నారు. ఇదే సమయంలో... సీఈఓ వేతనాలు పెరిగిన సమయంలో "పే అట్ రిస్క్" వాటా ప్రొఫెషనల్ సీఈఓలకు 57 శాతంగా, ప్రమోటరు సీఈఓలకు 47 శాతంగా ఉంది.
ఇదే సమయంలో... బీ.ఎస్.ఈ 200 కంపెనీల్లో సీఈఓల మార్పులు, నియామకాలపైనా సంస్థ కీలక విషయాలు వెల్లడించింది. ఇందులో భాగంగా... గత అయిదేళ్లలో 45% సంస్థల్లో సీఈఓల మార్పు జరగగా.. వారిలో ప్రతి 10 మంది కొత్త సీఈఓల్లో ఆరుగురిని సొంత కంపెనీల్లో నుంచే ఎంపిక చేశారట. ఇక మిగతా నలుగురిని మాత్రం బయటి కంపెనీల నుంచి తీసుకున్నారని వెల్లడించింది.
ఇక దీర్ఘకాల ప్రోత్సాహకాల విషయానికొస్తే... 2020లో 63% కంపెనీలు షేర్ల ఆధారిత ప్రోత్సాహకాలనే ఇవ్వగా, 2024లో వీటి సంఖ్య 75 శాతానికి చేరుకోవడం గమనార్హం. మరోపక్క... ఉద్యోగులకిచ్చే స్టాక్స్ ప్రోత్సాహకాలు మాత్రం 2020లో 68 శాతంగా ఉండగా.. 2024 కల్లా 49 శాతానికి తగ్గాయి.
