Begin typing your search above and press return to search.

ఆఫీసుకు రాకుంటే ప్రమోషన్ కట్.. ప్రముఖ కంపెనీ షాకింగ్ నిర్ణయం

దీంతో.. అప్పటివరకు మాటలతో సరిపెట్టిన కంపెనీలు కొంతకాలంగా చేతల్లో చర్యల్ని చేపడుతున్నాయి.

By:  Tupaki Desk   |   19 March 2024 4:39 AM GMT
ఆఫీసుకు రాకుంటే ప్రమోషన్ కట్.. ప్రముఖ కంపెనీ షాకింగ్ నిర్ణయం
X

ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి వేళ అన్నీ టెక్ కంపెనీలు తమ ఉద్యోగులందరికి వర్కు ఫ్రం హోం వసతిని కలిగించటమే కాదు కరోనా తగ్గిన తర్వాత కూడా అదే తీరును కొనసాగించింది. అయితే.. కరోనా ఛాయలు ఎక్కడా లేకపోగా.. వర్కు ఫ్రం హోంను ఒక వసతిలా వాడేస్తున్న వైనంపై ఐటీ కంపెనీలు గుర్రుగా ఉన్నాయి. దాదాపు ఏడాదిన్నర నుంచి సీరియస్ గా ఆఫీసుకు రావాలని ఉద్యోగులకు చెబుతున్నా.. వారిలో పలువురు వర్కు ఫ్రం హోం వైపే మొగ్గు చూపటం తెలిసిందే.

దీంతో.. అప్పటివరకు మాటలతో సరిపెట్టిన కంపెనీలు కొంతకాలంగా చేతల్లో చర్యల్ని చేపడుతున్నాయి. తప్పనిసరిగా ఆఫీసుకు రావాల్సిందేనని తేల్చి చెబుతున్నాయి. ఇలాంటి వేళ ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ డెల్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కంపెనీ నిబంధనల ప్రకారం ఉద్యోగుల్లో ఎవరైనా ఆఫీసుకు రాని పక్షంలో ప్రమోషన్లు ఉండవని స్పష్టం చేసినట్లుగా జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ఇంటి నుంచి పని చేయకుండా.. ఆఫీసుకు రావాలని చెప్పినా మాట వినని కొందరు ఉద్యోగులకు అర్థమయ్యేలా తన మాట తీరును మార్చింది డెల్.

ఇంటి నుంచి పని చేయాలనుకుంటే పని చేయొచ్చని.. వారి నిర్ణయానికి అభ్యంతరం చెప్పమన్న డెల్ సంస్థ.. కానీ వారెవరిని ప్రమోషన్ల లిస్టులోకి తీసుకోమంటూ ట్విస్టు చెప్పి షాకిచ్చింది. ప్రస్తుతం ఆ కంపెనీలో హైబ్రిడ్ విధానం కొనసాగుతోంది. ప్రతి ఉద్యోగి కనీసం వారంలో మూడు రోజుల పాటు ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. అలా రాని వారందరిని ఇంటి నుంచి పని చేస్తున్న ఉద్యోగులుగా పరిగణించి.. వారికి ప్రమోషన్లు ఉండవని తేల్చింది.

ఇక్కడో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. కరోనాకు ముందు సైతం డెల్ సంస్థలో వర్కు ఫ్రం హోం విధానం అమల్లో ఉండేది. సంస్థ సీఈవో కం వ్యవస్థాపకుడు మైఖేల్ డెల్ సైతం ఇంటి నుంచి పని చేసే విధానానికి మొగ్గు చూపేవారు. అంతేకాదు.. అప్పట్లో ఆఫీసులకు రావాలని చెప్పే కంపెనీల తీరును తప్పు పట్టే వారు. అలాంటి ఆయన కంపెనీ ఈ రోజున వర్కు ఫ్రం హోం అన్న పాలసీలో ఉన్న ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వమని చెబుతూ కోత పెట్టిన తీరు సంచలనంగా మారింది. కంపెనీ తాజా నిర్ణయం పట్ల డెల్ ఉద్యోగులు సంతోషంగా లేరంటున్నారు.