డిలిమిటేషన్ మీద అమిత్ షా ఏమన్నారంటే ?
అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా నియంత్రణ అంతాగా అమలు కాలేదు, దాంతో జనాభా చూస్తే చాలా ఎక్కువగా ఉంటోంది.
By: Tupaki Desk | 12 July 2025 10:00 PM ISTపార్లమెంట్ నియోజకవర్గాల పునర్ విభజన జరిగితే కనుక తప్పకుండా దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని అంతా ఆందోళన చెందుతున్నారు. దానికి కారణం దక్షిణాదిన జనాభా నియంత్రణ దశాబ్దాలుగా పకడ్బందీగా అమలు అయింది. దాంతో పాటు సంతానోత్పత్తి రేటు కూడా దక్షిణాది రాష్ట్రాలలో అంతకంతకు తగ్గుతోంది. దీంతో రానున్న కాలంలో మరింతగా జనాభా తగ్గుతుంది అని అంతా కలవరపడుతున్నారు.
అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా నియంత్రణ అంతాగా అమలు కాలేదు, దాంతో జనాభా చూస్తే చాలా ఎక్కువగా ఉంటోంది. అలాగే సంతానోత్పత్తి రేటు కూడా సౌత్ స్టేట్స్ తో పోలిస్తే ఉత్తరాదిన బాగానే ఉంది అన్నది చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎంపీ సీట్లను జనాభా ప్రాతిపదికన పునర్ విభజన చేస్తే కనుక ఉత్తరాదినే పెద్ద ఎత్తున సీట్లు పెరుగుతాయని అంటున్నారు. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలు పూర్తిగా అన్యాయం అయిపోతాయని కూడా అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆ మధ్యన తమిళనాడు సీఎం డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పార్టీలు అన్నీ హాజరు అయి కేంద్రానికి తన నిరసనను తెలియచేశాయి. ఇక దీని మీద చాలా కాలంగా వివాదం రగులుతూనే ఉంది.
ఈ క్రమంలో కేంద్రం అనేక సార్లు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని చెబుతూ వచ్చింది. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి అదే మాట చెప్పారు. డీలిమిటేషన్ మీద ఆయన ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎంపీ సీట్ల పునర్విభజన మీద దక్షిణాది రాష్ట్రాలు చాలా కాలంగా ఆందోళన చేస్తున్నాయని అన్నారు. అయితే వారు ఆందోళనలను అందులోని సహేతుకతను తాము పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు అంతే కాదు దక్షిణాదిన ఉన్న పలు రాష్ట్రాలు అక్కడి రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున అభ్యంతరాలని కూడా గమనంలోకి తీసుకుంటామని చెప్పారు అలాగే వారి లేవనెత్తిన అనేక సమస్యలను సైతం పరిష్కరిస్తామని చెప్పారు
ఈ సందర్భంగా అమి షా ఒక కీలక హామీ ఇచ్చారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎట్టి పరిస్థితుల్లో ఏ విధమైన అన్యాయం జరగదని ఆయన స్పష్టం చేశారు. ఇక చూస్తే కనుక డీలిమిటేషన్ కమిషన్ అన్నది ఈ రోజుకీ ఒక చట్టంగా లేదని ఆయన అంటున్నారు.
రానున్న కాలంలో డీలిమిటేషన్ కమిషన్ చట్టాన్ని తీసుకొస్తామని కూడా ఆయన ప్రకటించారు. అదే విధంగా పార్లమెంట్‍లో డీలిమిటేషన్‍పై సమగ్రంగా చర్చిస్తామని అన్నారు. అలా పూర్తిస్థాయి చర్చ తర్వాత వచ్చిన ఆభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని చట్టరూపం ఇస్తామని చెబుతున్నారు. ఆ మీదటనే పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ఇక పనిలో పనిగా ఆయన తమిళనాడులోని డీఎంకే మీద విమర్శలు చేశారు. స్టాలిన్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాలు జరగడంతో ఆయన ఆ రాష్ట్రం మీదనే గురి పెట్టారు. తొందరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయని అందుకే కొందరు నాయకులు కొన్ని పార్టీలు ఇదే అంశం మీద తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నాయని అమిత్ షా సెటైర్లు వేశారు. ఇది రాజకీయం కోసం సృష్టించిన సమస్యగా బీజేపీ పెద్దలు భావిస్తున్నరా అన్నది కూడా ఇక్కడ చూడాల్సి ఉంటుందని అంటున్నారు.
మరో వైపు చూస్తే కనుక నిజంగా దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతోందని అంతా అంటున్నారు. మరి పార్లమెంట్ లో డీ లిమిటేషన్ మీద సమగ్రమైన చర్చ జరిపి జనాభా ప్రాతిపదిక అన్న అంశాన్ని ప్రాతిపదికగా తీసుకోకుండా కేంద్రం డీలిమిటేషన్ ప్రక్రియ చేపడుతుందా అన్నది చూడాల్సి ఉంది. అలా కాకపోతే మాత్రం ఎవరెన్ని హామీలు ఇచ్చినా దక్షిణాదికి తీరని అన్యాయం జరగడం ఖాయమనే అంటున్నారు.
