నియోజకవర్గాల పునర్విభజన.. ఎక్కడెక్కడ సీట్లు పెరుగుతాయంటే..?
దేశంలో పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్రం నిర్ణయించడంతో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి.
By: Tupaki Desk | 27 Jun 2025 10:00 PM ISTదేశంలో పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్రం నిర్ణయించడంతో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ప్రధానంగా రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు మార్గం సుగమమైంది. చివరిగా 2009లో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అయితే అప్పట్లో నియోజకవర్గాల సంఖ్య పెంచకుండా, అప్పటికి ఉన్న 543 స్థానాలకే పరిమితం చేశారు. అయితే జనాభా పెరిగినందున ఆ స్థాయిలో పార్లమెంటు నియోజకవర్గాలను పెంచాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.
జనగణన, కులగణన చేపట్టి ఆ తర్వాత పార్లమెంటు నియోజకవర్గాల విభజన చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న పార్లమెంటు స్థానాలను పెంచాలని ప్రతిపాదనను పరిశీలిస్తోంది. దీంతో దాదాపు 20 శాతం సీట్లు పెరిగే అవకాశం ఉందంటున్నారు. అయితే జనాభా ఆధారంగా సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని, ఉత్తరాది ఆధిపత్యం పెరిగిపోతోందని గత కొంత కాలంగా విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో జనాభా లెక్కలకు సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రం నుంచి 20 శాతం సీట్లు పెంచాలనే కొత్త ప్రతిపాదనను కేంద్రం తెరపైకి తెచ్చింది. దీనిపై ఒక వైపు తీవ్రమైన చర్చ జరుగుతుండగా, విభజన హామీ కింద ఏపీ, తెలంగాణ అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపునకు ప్రభుత్వం సంకేతాలిచ్చిందని అంటున్నారు.
దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు సమూలంగా మారిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న స్థానాలు 175 నుంచి 225కి పెరుగుతాయని చెబుతున్నారు. అదేవిధంగా తెలంగాణలో 119 స్థానాల నుంచి 153 స్థానాలకు పెరుగుతాయని ప్రచారం జరుగుతోంది. అయితే పెరిగే స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్ ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలిస్తున్నారని అంటున్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్రం భావిస్తుండటంతో రెండు రాష్ట్రాల్లో సమూల మార్పు తథ్యం అంటున్నారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాల్లోనూ మార్పులు జరగవచ్చని భావిస్తున్నారు.
ప్రస్తుతం ఎస్సీ రిజర్వుడు స్థానాలుగా ఉన్న కొన్ని నియోజకవర్గాలు జనరల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అసెంబ్లీ సీట్లు పెరుగుతున్నందున రిజర్వుడు స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు నియోజకవర్గాల సంఖ్య పెరిగితే ఏ పార్టీకి లాభం? ఎవరికి నష్టం? అన్న చర్చ కూడా మొదలైంది. ఏపీలో అధికార కూటమికి ఈ పరిణామాలు కలిసొస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం కూటమిగా పోటీ చేసిన మూడు పార్టీలు సీట్లను విభజించుకొన్నాయి. పెరిగే స్థానాల వల్ల జనసేన,బీజేపీకి ఎక్కువ సీట్లు దక్కే పరిస్థితి ఉందంటున్నారు. మరోవైపు టీడీపీలో త్యాగరాజుల సంఖ్య తగ్గే పరిస్థితి వస్తుందని అంటున్నారు.
మరో వైపు ప్రతిపక్షం వైసీపీకి ఈ పరిణామం కత్తిమీద సామేనన్న భావన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలువురు పార్టీ నేతలు రాజీనామా చేయడం, గత ఎన్నికల్లో చేపట్టిన మార్పుల వల్ల ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాలకు ఇన్ చార్జులు లేకపోవడంతో పార్టీ ఇబ్బందిక పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గాలు పెరిగితే కొత్త నాయకత్వం తయారు చేసుకోవడం కాస్త కష్టమేనన్న టాక్ వినిపిస్తోంది. అదేవిధంగా తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు, ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య ఆసక్తికర పోటీ జరిగేఅవకాశాలు ఉన్నాయంటున్నారు.
