జగన్ సేఫ్...కూటమికి టైట్
జాతీయ స్థాయిలో సంభవించిన కీలక పరిణామంతో ఏపీ రాజకీయాల్లో మౌలికమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.
By: Satya P | 18 April 2026 8:00 PM ISTజాతీయ స్థాయిలో సంభవించిన కీలక పరిణామంతో ఏపీ రాజకీయాల్లో మౌలికమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడంతో ఇక సమీప భవిష్యత్తులో లోక్ సభ అసెంబ్లీ సీట్ల పెంపు అన్నది ఉండే చాన్స్ అయితే కనిపించడం లేదు. 2029 కి గట్టిగా మూడేళ్ల సమయం కూడా లేదు. ప్రస్తుతం 131 రాజ్యాంగ సవరణ బిల్లు లోక్ సభ ఆమోదం పొందితే కనుక ఏపీలో 175 సీట్లు కాస్తా 263 గా పెరిగేవి. అలాగే లోక్ సభ సీట్లు 38 దాకా ఉండేవి.
వైసీపీ రిలాక్స్ :
నియోజకవర్గాల పునర్విభజన ఎపుడూ అధికారంలో ఉండే పార్టీలకే ఉపయోగం అనంది తెలిసిదే. విభజన అన్నది అధికారంలో ఉన్న వారి కను సన్నలలోనే జరుగుతుంది. వారికి అనుకూలంగా చేసుకోవడం కూడా జరుగుతుంది. ఆ విధంగా చూస్తే వైసీపీకి బలంగా ఉన్న నియోజకవర్గాలను ముక్కలుగా చేయడమో లేక మహిళా సీట్లుగానో లేక రిజర్వుడు సీట్లుగానో చేసేందుకు ఆస్కారం ఉండేది. అపుడు వైసీపీకి రాజకీయంగా అతి పెద్ద సవాల్ ఎదురయ్యేది. అదే సమయంలో కూటమికి పునర్ విభజన వల్ల భారీ లబ్ది కలుగుతుంది అన్న చర్చ కూడా ఉంది.
కూటమిలో పోటీ :
ఇదిలా ఉంటే కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో అయితే చాలా కష్టం మీద సర్దుబాటు చేసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని అధికారంలో నుంచి దించేందుకు అంతా కలిశారు. కానీ అయిదేళ్ళ తరువాత 2029లో పోటీ చేస్తున్న క్రమంలో ఈ సర్దుబాటు అంత సాఫీగా ఉండే చాన్స్ లేదని అంటున్నారు. పైగా మూడు పార్టీలలోనూ ఆశావహులు, త్యాగరాజులు కూడా సీట్ల రేసులోకి దూసుకుని వస్తారు. దాంతో 263 సీట్లు కనుక పెరిగి ఉంటే కూటమికి పూర్తిగా అనుకూలంగా ఉండేదన్న విశ్లేషణలు ఉన్నాయి. అలా కాకపోవడం వల్ల కూటమికి ఇపుడు టైట్ పొజిషన్ గానే ఉండొచ్చు అని అంటున్నారు.
ఊరించి వెనక్కి :
మరో వైపు చూస్తే ఈ గత ఇరవై రోజులుగా ఏపీలో సీట్లు పెరుగుతాయని ఊరించి మరీ పెద్ద ఎత్తున అన్ని పార్టీలు ప్రచారం చేసుకున్నాయి.దాంతో మహిళా నాయకురాళ్ళే కాదు చాలా మంది కొత్త నాయకులు కూడా పోటీకి తయారుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా డీలిమిటేషన్ చేస్తుందని అంతా అనుకున్నారు. తీరా చూస్తే బిల్లు వీగిపోవడం తో కధ మళ్ళీ మొదటికి వచ్చినట్లు అయింది అని అంటున్నారు.
అతి పెద్ద తతంగం :
డీలిమిటేషన్ అన్నది అతి పెద్ద తతంగం గా ఉంది అన్నది లోక్ సభ సాక్షిగా రుజువు అయింది. దాంతో ఈ నంబర్ గేంలో ఎన్డీయే పూర్తిగా వెనకబడింది అన్న చర్చ కూడా సాగుతోంది. అదే సమయంలో విపక్షాలు ఎన్నడూ లేని విధంగా ఒక్కటిగా ముందుకు రావడంతో కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ అన్నది మరోసారి ఆలోచించేందుకు ఇప్పట్లో సాహసిస్తుందా అన్నదే చర్చగా ఉంది ఒక వేళ ఆలోచించినా అన్ని రాష్ట్రాలకు అంగీకారంతో సీట్ల పెంపు చేయడం అన్నది అసాధ్యం అంటున్నారు. ఆ మాటకు వస్తే ఉత్తరాది దక్షిణాది అన్న సమస్య కాదు ఎన్డీయే పట్ల వ్యతిరేకతతోనే విపక్షాలు ఏ బిల్లుకైనా ఏ రాజ్యాంగ సవరణకు అయినా అడ్డు చెప్పే పరిస్థితి ఉంది కాబట్టి 2029 ఎన్నికలకు ప్రస్తుతం ఉన్న సీట్లతోనే పోటీ చేయాల్సిందే అని అంటున్నారు. సో ఏపీలో అయితే పొలిటికల్ పిక్చర్ క్లియర్ గానే కనిపిస్తోంది అని అంటున్నారు.
