Begin typing your search above and press return to search.

ఏపీలో 50, తెలంగాణలో 34 పెరగనున్న అసెంబ్లీ స్థానాలు

దేశంలో పార్లమెంటు స్థానాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాలను పెంచనున్నారు.

By:  Tupaki Desk   |   30 Jun 2025 11:23 AM IST
ఏపీలో 50, తెలంగాణలో 34 పెరగనున్న అసెంబ్లీ స్థానాలు
X

దేశంలో పార్లమెంటు స్థానాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాలను పెంచనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీ స్థానాలను పెంచాలని అనుకున్నా, ఇంతకాలం ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ చేపట్టాలని నిర్ణయించడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి చెబుతున్నారు.

డీలిమిటేషన్ ప్రక్రియతో రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 84 అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా, అదనంగా 50 పెరుగుతాయని చెబుతున్నారు. దీంతో ఏపీ అసెంబ్లీ స్థానాల సంఖ్య 225కు చేరనుంది. అదేవిధంగా తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 స్థానాలు 153కి పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ రాష్ట్రంలో కొత్తగా 34 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

దేశంలో 2014 తర్వాత జనగణన జరగకపోవడంతో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల పునర్విభజన జరగలేదు. తాజాగా జనగణనకు కేంద్రం సై అనడంతో అసెంబ్లీ స్థానాల పునర్విభజన ప్రక్రియకు అవాంతరం తొలగిపోయినట్లు భావిస్తున్నారు. 2026లో జనగణన, కులగణన చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. దీంతో 2027లో డీలిమిటేషన్ చేపట్టి అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను పెంచిన తర్వాతే 2029 ఎన్నికలకు వెళ్లాలనేది కేంద్ర ఆలోచనగా చెబుతున్నారు.

వాస్తవానికి చాలా కాలంగా పార్లమెంటు స్థానాల పెంపు ప్రతిపాదన ఉంది. ప్రస్తుత జనాభా ఆధారంగా పార్లమెంటు స్థానాలను పెంచాలని కేంద్రానికి కొన్ని ప్రతిపాదనలు అందినట్లు చెబుతున్నారు. అయితే జనాభా ఆధారంగా పార్లమెంటు స్థానాలను పెంచితే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే వాదన తెరపైకి వచ్చింది. బిహార్, ఉత్తరప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు పెరుగుతాయని, ప్రాంతీయ సమతుల్యుత దెబ్బతింటుందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ ప్రతిపాదనను కేంద్రం ఖండిస్తూ వస్తోంది. ఇంతవరకు జనాభాపై కచ్చితమైన లెక్కలు లేకపోవడంతో పార్లమెంటు స్థానాల పునర్విభజన సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేస్తూ వస్తోంది. మరోవైపు జనాభాతో ముడిపెట్టకుండా ప్రతి రాష్ట్రంలో కనీసం 20 శాతం స్థానాలు పెంచాలని కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

ఈ గందరగోళ పరిస్థితుల నడుమ కేంద్రం జనగణన చేపట్టాలని నిర్ణయించడంతో ఊహాగానాలకు తెరపడింది. జనగణన లెక్కలు తేలిన తర్వాత జనాభాపై స్పష్టత వస్తుంది. ఆ తర్వాత అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను పెంచేందుకు ఎటువంటి అడ్డంకులు ఉండవని కేంద్రం భావిస్తోంది. మొత్తానికి పార్లమెంటు స్థానాలు పెంపు నిర్ణయంతో రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీల సంఖ్య పెరిగనుందని వార్తలు వస్తున్నాయి.