Begin typing your search above and press return to search.

ఊపిరి’పీల్చుకున్న ఢిల్లీ వాసులు.. తగ్గిన కాలుష్యం!

దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యపూరిత నగరంగా దేశ రాజధాని ఢిల్లీ రికార్డులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   11 Nov 2023 3:48 AM GMT
ఊపిరి’పీల్చుకున్న ఢిల్లీ వాసులు.. తగ్గిన కాలుష్యం!
X

దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యపూరిత నగరంగా దేశ రాజధాని ఢిల్లీ రికార్డులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో కాలుష్యం ధాటికి పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించాల్సి వచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలను ఆలస్యంగా తెరవడం మొదలుపెట్టారు. విపరీతమైన పొగతో విమానాల రాకపోకల సమయాల్లోనూ మార్పులు చేశారు.

చివరకు కాలుష్యం విషయంలో సుప్రీంకోర్టే జోక్యం చేసుకునే వరకు పరిస్థితి చేయిదాటింది. కాలుష్య నియంత్రణకు కేజ్రీవాల్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిగా లేవని సుప్రీంకోర్టు తలంటింది. పంజాబ్, హరియాణాల్లో రైతులు పొలాల్లో గడ్డిని తగలబెడుతుండటం వల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతోందని.. దీని నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తిని వ్యక్తం చేసింది.

అయితే రెండు వారాలుగా వేధిస్తున్న ఢిల్లీ కాలుష్యం ఎట్టకేలకు కొంతవరకు తగ్గింది. వర్షాలు కురియడంతో కాలుష్యం చాలా వరకు తగ్గిపోయింది. ఈ మేరకు గాలి నాణ్యత పెరిగింది. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. దీంతో రాజధాని వాసులు ఎట్టకేలకు ‘ఊపిరి’పీల్చుకున్నారు.

రాత్రిపూట వర్షం కురవడంతో గాలి నాణ్యత మెరుగుపడుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ వర్షాలు వాయునాణ్యతను మెరుగుపరచడంలో ఉపయోగపడతాయని వెల్లడించారు. నోయిడా, గురుగ్రామ్, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)ల్లో రాత్రి తేలికపాటి వర్షం కురిసింది. నేడు మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఢిల్లీ నగరంలో తీవ్ర వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు నవంబర్‌ 20–21 తేదీల్లో క్లౌడ్‌ సీడింగ్‌ ద్వారా కృత్రిమ వర్షం కురిపించాలని ఢిల్లీ ప్రభుత్వ యోచిస్తోంది. ఇందుకు ప్రముఖ విద్యా సంస్థ.. ఐఐటీ కాన్పూర్‌ సహాయం తీసుకోవాలని నిర్ణయించింది. ఇలాంటి సమయంలో వర్షాలు కురవడం ప్రభుత్వానికి ఊరటనిచ్చింది.

వాయునాణ్యత సూచీ ఢిల్లీలో చాలా చోట్ల 400 పాయింట్లకు పైగా ఉండగా.. రాత్రి ఆ విలువ 100కు తగ్గిపోయింది. దీంతో వాయు కాలుష్యం తగ్గించేందుకు ఢిల్లీ సర్కార్‌ మేఘ మథనానికి సిద్ధమైంది. కృత్రిమ వర్షాలను కురిపించి ప్రజలకు కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలని యోచిస్తోంది.

క్లౌడ్‌ సీడింగ్‌ ప్రక్రియలో భాగంగా మేఘాలలో కొన్ని లవణాల మిశ్రమాన్ని వెదజల్లి వర్షం పడేలా చేస్తారు. దీంతో గాలిలో ఉన్న ధూళి కణాలు వర్షం వల్ల భూమికి చేరిపోతాయి. ఫలితంగా పర్యావరణం కాలుష్య రహితం అవుతుంది. ఈ సమయంలోనే వర్షాలు కురవడంతో ఢిల్లీ వాసులు ఊపిరిపీల్చుకున్నారు.

కాగా పంజాబ్, హరియాణా ప్రాంతాల్లో రైతులు గడ్డికాల్చడం వల్లే 24 శాతం వాయు కాలుష్యం సంభవిస్తోందని సుప్రీంకోర్టు తాజాగా పేర్కొంది. అలాగే బొగ్గు, బూడిద వల్ల 17 శాతం, వాహనాల వల్ల 16 శాతం గాలి కలుషితమవుతోందని వెల్లడించింది. కాలుష్యం తగ్గడానికి రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.