Begin typing your search above and press return to search.

హస్తిన లీక్స్... పద్మావతికి ఫిక్స్ - సీతక్క, కొండా సురేఖ పెండింగ్?

అత్యంత హోరా హోరీగా ముగిసిన తెలంగాణ సందడి ముగిసిన సంగతి తెలిసిందే. పదేళ్ల బీఆరెస్స్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ చెక్ పెట్టింది.

By:  Tupaki Desk   |   6 Dec 2023 7:20 AM GMT
హస్తిన లీక్స్... పద్మావతికి ఫిక్స్ - సీతక్క, కొండా సురేఖ పెండింగ్?
X

అత్యంత హోరా హోరీగా ముగిసిన తెలంగాణ సందడి ముగిసిన సంగతి తెలిసిందే. పదేళ్ల బీఆరెస్స్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ చెక్ పెట్టింది. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సమయంలో రేవంత్ కేబినెట్ లో ఎవరెవరికి మంత్రి పదవులు ఫిక్సయ్యాయనేది ఆసక్తిగా మారింది. ఈ సమయంలో హస్తిన నుంచి లీకులు మొదలవుతున్నాయి!

అవును... తెలంగాణ కొత్త ప్రభుత్వంలో రేవంత్ టీంలో ఎవరెవరు మంత్రులుగా ఉండబోతున్నారనేది ఆసక్తిగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్లు ఎక్కువగా ఉండటంతో ఫిల్టరింగ్ అత్యంత కీలకంగా మారబోతుందనే చర్చ మొదలయ్యింది. ఈ క్రమలో వస్తున్న లీకుల ప్రకారం... ఒక కీలకమైన మంత్రి పదవి, ఇద్దరు ముఖ్యమైన నేతల మధ్య దోబూచులాడుతుందని అంటుండగా.. ఇప్పటికే రెండు మూడు మంత్రి పదవులు ఫైనల్ అయినట్లు లీక్స్ వెలువడుతున్నాయి.

ఇందులో భాగంగా... టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డికి హోం శాఖను కేటాయించనున్నట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో దుద్దిళ్ల శ్రీధర్‌ బాబుకు ఆర్థిక శాఖ కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కీలకమైన రెండు శాఖలు ఇలా కాంగ్రెస్ పార్టీ కీలక నేతలనే వరించినట్లు చర్చ నడుస్తుంది. అనంతరం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కేటాయింపు అనేది అత్యంత కీలకంగా చెబుతున్నారు.

ఈ సమయంలో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక భూమిక పోషించినట్లు చెబుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఖమ్మం జిల్లాలో అన్నీ తానై నడిపించినట్లు చెబుతున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ల మధ్య కీలకమైన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కోసం పోరు నడుస్తుందని తెలుస్తుంది. ఈ క్రమంలో ఒకవేళ ఈ శాఖ కోమటిరెడ్డికే ఇవ్వాల్సి వస్తే... పొంగులేటికి పీడబ్ల్యూడీ మంత్రిత్వ శాఖ దక్కొచ్చని అంటున్నారు.

ఇక ప్రధానంగా మల్లు భట్టి విక్రమార్కకు ఉపముఖ్యమంత్రి పదవితో పాటు దేవాదాయ శాఖ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం అందుతుంది. ఇదే సమయంలో... కొండా సురేఖను ఉపముఖ్యమంత్రి పదవికి పరిశీలిస్తున్నారని అంటున్నారు. అయితే ఆమె మంత్రివర్గం కేటాయింపు పెండింగ్‌ లో ఉందని తెలుస్తుంది.

మరోపక్క పొన్నం ప్రభాకర్, సీతక్క, దామోదర్ రాజనరసింహ, సుదర్శన్ రెడ్డి మొదలైన నేతలకు మంత్రిత్వ శాఖలు ఇంకా ఖరారు కాలేదని సమాచారం. మరోపక్క ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఇతర కీలక పదవులకు సంబంధించి సమీర్ శర్మ ప్రధాన కార్యదర్శిగా, శివధర్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్‌ గా, సంజయ్ జాజు సీఎంవోగా పరిశీలనలో ఉన్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా... ఈ రోజు సాయంత్రానికి ఈ పదవులపై స్పష్టత రావొచ్చని సమాచారం!