Begin typing your search above and press return to search.

'ఢిల్లీ' బిల్లు ఎపిసోడ్ లో మోడీ సర్కారు గట్టెక్కే లెక్కలేంటి?

నిబంధనల ప్రకారం తాజాగా మోడీ సర్కారు ఈ ఆర్డినెన్స్ స్థానం లో బిల్ ను పార్లమెంటు లో ప్రవేశ పెట్టనుంది.

By:  Tupaki Desk   |   31 July 2023 5:43 AM GMT
ఢిల్లీ బిల్లు ఎపిసోడ్ లో మోడీ సర్కారు గట్టెక్కే లెక్కలేంటి?
X

ఈ నెల ఇరవై నుంచి ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు ఇప్పటివరకు ఒక్కరోజు కూడా సాగని పరిస్థితి తెలిసిందే. మణిపూర్ అల్లర్ల పై ఆగమాగం అవుతున్న ఉభయ సభల్లో మరింత రాజకీయ వేడిని పుట్టించేందుకు మోడీ సర్కారు సిద్దమైంది. ఇప్పటికే ఆర్డినెన్స్ ద్వారా అమల్లోకి తెచ్చిన ఢిల్లీకి చెందిన బిల్లును తాజాగా లోక్ సభలో ప్రవేశ పెట్టాల ని భావిస్తోంది. ఈ ఢిల్లీ బిల్లును సంక్షిప్తంగా చెప్పాలంటే.. ఉద్యోగుల పై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాల్ని తగ్గిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేయటం తెలిసిందే.

నిబంధనల ప్రకారం తాజాగా మోడీ సర్కారు ఈ ఆర్డినెన్స్ స్థానం లో బిల్ ను పార్లమెంటు లో ప్రవేశ పెట్టనుంది. తొలుత లోక్ సభలో.. అనంతరం రాజ్యసభ లోకి రానున్న ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే మోడీ సర్కారు మీద అవిశ్వాస తీర్మానాన్ని విపక్షాలు స్పీకర్ కు అందజేయటం తెలిసిందే. తొలుత ఢిల్లీ బిల్లును ఈ వారం లో ఆమోదింపచేసుకొని.. అనంతరం అవిశ్వాస తీర్మానాన్ని తెర మీదకు తీసుకొచ్చి.. ఆపై సభను వాయిదా వేయించుకోవాలన్న యోచన లో మోడీ సర్కార్ ఉన్నట్లు చెబుతున్నారు.

లోక్ సభలో ఢిల్లీ బిల్లుకు ఎలాంటి సమస్యా ఉండనట్లే. ఎందుకంటే.. మెజార్టీ సభ్యులు మోడీ సర్కారు పక్షాన ఉండటంతో అదేం పెద్ద సమస్య కాబోదు. ఇక.. సమస్యంతా రాజ్యసభ లోనే. ఎందుకంటే.. ఇక్కడ మోడీ సర్కారు కు పూర్తి బలం లేదు. రాజ్యసభ మొత్తం సభ్యుల సంఖ్య 243 కాగా.. కొన్ని ఖాళీల నేపథ్యంలో ఇప్పటికి 238 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు.

అంటే.. 120 మంది సభ్యుల బలం అవసరం. ఇక్కడ బీజేపీకి 92 మంది సభ్యులు ఉన్నారు. ఎన్డీయే కూటమికి మొత్తం 105 సభ్యుల బలం ఉంది. మరో 15 మంది రాజ్యసభ సభ్యుల బలం అవసరమవుతుంది. ఇందులో... అయిదుగురు నామినేటెడ్ సభ్యులు.. ఇద్దరు స్వతంత్ర సభ్యుల మద్దతు తమ వైపే ఉంటుందని మోడీ సర్కారు భావిస్తోంది.

అంటే.. బిల్లు ఆమోదానికి మరో ఎనిమిది మంది సభ్యుల మద్దతు అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ కి ఉన్న 9 మంది సభ్యులు.. బీజేడీకి చెందిన తొమ్మిది మంది సభ్యులపైనే మోడీ సర్కారు ఆశలన్నీ పెట్టుకుంది. ఈ రెండు పార్టీల్లో వైసీపీ ఇప్పటికే ఢిల్లీ బిల్లు విషయం లో మోడీ సర్కారు కు అనుకూలంగా తన నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేడీ మాత్రం తన మద్దతు గురించి ఇప్పటివరకు ప్రకటన చేయలేదు.

సభలో ఒక్కో సభ్యుడి బలం మాత్రమే ఉన్న బీఎస్పీ.. టీడీపీ.. జేడీఎస్ ల మద్దతు ను మోడీ సర్కారు కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ బిల్లును కాస్తంత కష్టపడైనా గట్టెక్కించుకునే బలం మోడీ సర్కారు కు ఉందని చెప్పాలి. ఈ బిల్లుకున్న ప్రాధాన్యత నేపథ్యంలో తొంభై ఏళ్ల మన్మోహన్ వీల్ ఛైర్ లో రాజ్యసభ కు హాజరవుతారని చెబుతున్నారు.